Araku Valley: సింగిల్ డిజిట్‌లోకి ఉష్ణోగ్రతలు.. అరకు అందాలకు చలికాలం తోడు.. పర్యాటకుల సందడి..

Alluri Agency Cold Wave

Alluri Agency Cold Wave

Araku Valley: అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలిగాలుల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతం గజగజ వణికిపోతోంది. ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. అరకులో కనిష్ఠంగా 9 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, మినమలూరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏజెన్సీలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా మాడగడ సన్‌రైజ్ పాయింట్ పర్యాటకులతో సందడిగా మారింది. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో పర్యాటకులు మాడగడ కొండపైకి చేరుకుని సూర్యోదయాన్ని వీక్షిస్తున్నారు.

కొండ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మంచు అందాలను తమ కెమెరాల్లో, సెల్ఫీల రూపంలో బంధిస్తూ సందడి చేస్తున్నారు. ప్రకృతి అందాల మధ్య సన్‌రైజ్‌ను ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. అంతేకాకుండా స్థానిక గిరిజనులతో కలిసి సంప్రదాయ దింసా నృత్యాలు చేస్తూ ఆడిపాడుతున్నారు. ఒకవైపు చలి తీవ్రత పెరుగుతున్నప్పటికీ.. మరోవైపు మంచు అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, గిరిజన సంస్కృతి పర్యాటకులను ఏజెన్సీ వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో మాడగడ సన్‌రైజ్ పాయింట్ పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది.