A Vizag Man Killed His Wife Cuts Body Parts Puts In Drum: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు చంపేసి, 35 ముక్కలు చేసిన సంఘటన గురించి అందరికీ తెలిసిందే! అదే తరహాలోనే విశాఖపట్నంలో ఒక దారుణం వెలుగు చూసింది. ఒక వివాహితను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఒక డ్రమ్ములో కుక్కేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ఏడాదిన్నర క్రితం జరగ్గా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వివాఖపట్నం జిల్లాలోని మధురవాడ వికలాంగుల కాలనీలో ఒక జంట ఓ ఇంట్లో నివసిస్తూ ఉండేది. భార్య గర్భవతి కాగా.. భర్త కూలీ పని చేసి, కుటుంబాన్ని పోషించేవాడు.
కట్ చేస్తే.. ఏడాది కాలంగా వారి ఇల్లు తాళం వేసి ఉంది. ఈ కాలంలో ఎవ్వరూ ఆ ఇంటికి రాలేదు. ఏడాది క్రితమే ఆ ఇంట్లో ఉన్న మహిళ గర్భవతి కావడంతో, బహుశా ఆమె పుట్టింటికి వెళ్లి ఉండొచ్చని స్థానికులు అనుకున్నారు. భర్త కూడా ఆమెకు తోడుగా ఉండేందుకు వెళ్లాడేమోనని భావించారు. అయితే.. ఆదివారం సాయంత్రం ఆ ఇల్లు ఉన్న ప్రాంతం నుంచి స్థానికులు నడుస్తుండగా.. వారికి దుర్వాసన వచ్చింది. దీంతో అనుమానం కలిగి, వాళ్లు వెంటనే ఆ ఇంటి యజమానికి సమాచారం అందించారు. వెంటనే ఇంటికి చేరుకున్న ఆయన.. తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. లోనికి వెళ్లగా, ఓ ప్లాస్టిక్ డ్రమ్ కనిపించింది. అందులో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన యజమాని.. స్థానికుల సహాయంతో ఆ డ్రమ్మును బయటకు తీశాడు. అప్పుడు అందులో మహిళ మృతదేహం ఉందని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ఆ డ్రమ్మును పరిశీలించారు. మృతదేహం ఉన్న పరిస్థితిని గమనిస్తే.. ఏడాదిన్నర క్రితమే ఆ మహిళను హత్య చేసి, ముక్కలుగా నరికినట్లు పోలీసులు గుర్తించారు. కచ్ఛితంగా ఈ పని ఆమె భర్తే చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.
