విధి నిర్వహణలో నిర్లక్ష్యం, మితిమీరిన ప్రవర్తనతో ఏపీలోని కొందరు పోలీసు అధికారులు క్రమశిక్షణా చర్యలకు గురవుతున్నారు.తాజాగా కృష్ణా జిల్లాలో ఓ ఎస్ఐ సస్పెండ్ అయ్యారు. కృష్ణా జిల్లా రేపూడి తండాకు చెందిన లకావత్ బాలాజీ ఆత్మహత్య ఘటనలో ఎ. కొండూరు (A,Konduru) ఎస్సై టి.శ్రీనివాసును సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ.
నిన్న ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన బాలాజీ.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాటుసారా కేసులో విచారణ పేరుతో ఎ.కొండూరు ఎస్సై టి.శ్రీనివాస్ విచక్షణారహితంగా దాడి చేసిన కారణంగానే మృతి చెందినట్లు ఆరోపించారు మృతుడి కుటుంబ సభ్యులు. ప్రాధమిక దర్యాప్తు ఆదారంగా ఎస్సైను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మైలవరం ఇన్ స్పెక్టర్ ఎల్. రమేష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అలాగే, నూజివీడు డీఎస్పీని వివరణ కోరుతూ నోటీసు జారీచేశారు.
నాటు సారా అమ్ముతున్నాడని గిరిజనుడైన లకావత్ బాలాజీని ఎస్పై శ్రీనివాస్ పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లి కొట్టడంతో ఆ అవమానాన్ని భరించలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కుటుంబసభ్యులు, గిరిజనులు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎస్పైను సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్లో బాలాజీని ఎస్సై తీవ్రంగా కొట్టడంతో కిందపడిపోయాడు. ఈ అవమానాన్ని భరించలేక మంగళవారం నారికింపాడు సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని కుమారుడు అంటున్నాడు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరగడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
