Site icon NTV Telugu

Andhra Pradesh: మధ్యాహ్న భోజనం తిని 42 మంది విద్యార్థులకు అస్వస్థత

కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం తిన్నవారిలో కొందరు విద్యార్థులు వెంటనే వాంతులు చేసుకున్నారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

కాగా ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీఈవో.. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. పిల్లలు అస్వస్థతకు గురికావడానికి కారణమైన హెచ్‌ఎం లక్ష్మీనరసింహులును డీఈవో సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీపై విచారణకు ఆదేశించారు. ఉడకని భోజనం తినడమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకుని ఎంపీ తలారి రంగయ్య ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పినట్లు ఎంపీ తలారి రంగయ్య తెలిపారు.

Exit mobile version