Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీలో 31 కొత్త జాతీయ రహదారులకు సీఎం జగన్ శంకుస్థాపన

ఏపీలో 31 కొత్త జాతీయ రహదారులకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఏపీలో ఈరోజు 51 ప్రాజెక్టులకు ముందడుగు పడుతోందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఈరోజు మైలురాయి లాంటి రోజన్నారు. ఏపీలో జాతీయ రహదారులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూ.10,400 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని జగన్ చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో వెళ్తుందన్నారు. జాతీయ రహదారుల పరిధి 4,190 కిలోమీటర్ల నుంచి 8 వేల కిలోమీటర్లకు పైగా పెరిగిందన్నారు.

2019 ఆగస్టులో విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో పశ్చిమ వైపు రెండో ఫ్లైఓవర్ కావాలని తాను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని సీఎం జగన్ తెలిపారు. తన విజ్ఞప్తి పట్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెంటనే అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన సహకారంతో రెండున్నరేళ్లలో ఫ్లైఓవర్ పూర్తయిందన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మేలు పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ పోర్టు నుంచి భీమిలి, భోగాపురం వరకు ఆరు లైన్‌ల రహదారి చాలా అవసరమన్నారు. విజయవాడకు బైపాస్ రోడ్డు అవసరమని.. ఇప్పటికే పశ్చిమ బైపాస్‌కు అనుమతించారని.. తూర్పు బైపాస్‌కు కూడా అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.

Exit mobile version