NTV Telugu Site icon

Shakuntalam: శాకుంతలం.. సినిమా కాదు.. శతమానం పూర్తిచేసుకున్న ఓ టీచరమ్మ జీవితం..

Shakuntala Patnaik

Shakuntala Patnaik

శకుంతలా పట్నాయక్‌. వందేళ్ల నిండు జీవితాన్ని పూర్తిచేసుకున్న ఓ టీచరమ్మ. ఐదుగురు బిడ్డలకు అమ్మ. అమ్మమ్మ, నాయనమ్మ వంటి ప్రమోషన్లు, జేజమ్మ వంటి డబుల్‌ ప్రమోషన్లు పొందిన అత్యంత అరుదైన అదృష్టవంతురాలు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి దగ్గరలో ఉన్న సరవకోట అనే చిన్న పట్టణానికి చెందిన మహిళ. 1922 జూన్‌ 22న జన్మించారు. మొన్నీమధ్యే శతజన్మదినోత్సవం జరుపుకున్నారు. చుట్టూ వంద మంది కుటుంబ సభ్యులు ఆత్మీయంగా చేరగా వంద కొవ్వొత్తుల మధ్య వెలిగిపోతున్న కేక్‌ను కట్‌ చేసి సెంటినరీ బర్త్‌డేని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

ఒక వ్యక్తి దశదశాబ్దాల సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవించి ఉండటమంటే మాటలు కాదు. ఘనంగా వేడుకలు చేసుకోవాల్సిన విలువైన సందర్భం. తప్పకుండా చదువుకోవాల్సిన పెద్ద పుస్తకం. చూసి నేర్చుకోవాల్సిన చరిత్ర. స్ఫూర్తి పొందాల్సిన కథ. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. శకుంతలా పట్నాయక్‌ తన లాంగ్‌ లైఫ్‌లో రెండు ప్రపంచ యుద్ధాలను, మన దేశం గెలిచిన మూడు యుద్ధాలకు ప్రత్యక్ష సాక్షి. ఇండియా విక్టరీ నమోదుచేసిన ఆ మూడు యుద్ధాలు.. 1. స్పానిష్‌ ఫ్లూ 2. స్వాతంత్ర్య పోరాటం 3. ప్రాణాంతక కరోనా.

ఆది నుంచీ ఆనందంగా, సంతోషంగా సాగిన జీవితం అసాధారణ మైలురాయిని చేరుకోవటంపై స్పందిస్తూ శకుంతల భావోద్వేగానికి గురయ్యారు. దేవుడికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితం ధన్యమైందని, మనిషిగా ఇంతకంటే ఏం కోరుకుంటామని సంతృప్తి వ్యక్తం చేశారు. అనుభవాలను పంచుకున్నారు. జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు, సమస్యలు ఎదురవుతాయని, స్వీకరించటం తప్ప వాటి నుంచి తప్పించుకోలేమని అన్నారు. పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయాలని, వల్లకాకపోతే పెద్దల సలహాల ప్రకారం నడుచుకోవాలని సూచించారు.

శకుంతలా పట్నాయక్‌ తండ్రి బ్రిటిష్‌ ఆర్మీలో పనిచేసేవారు. శకుంతలకి కాన్వెంట్‌ చదువులు చెప్పించారు. ఉద్యోగ రీత్యా ఆయన వివిధ ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యేవారు. దీంతో కుటుంబం కూడా ఆయనతోపాటే అక్కడికి వెళ్లేది. దీంతో శకుంతల మంచి మంచి కాన్వెంట్ స్కూల్స్‌లో చదువుకున్నారు. ఎక్కువ జ్ఞానం పొందే అవకాశం లభించింది. స్కూల్‌ డేస్‌లో శకుంతల బాస్కెట్‌ బాల్‌ ఆడేవారు. అప్పట్లో కుటుంబాల్లో బంధుత్వాలకి బాగా విలువ ఉండేది. అన్ని విషయాలనూ అందరూ పంచుకునేవారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగారు.

శకుంతల 1946లో డాక్టర్‌ పీబీ పట్నాయక్‌ని పెళ్లి చేసుకున్నారు. అలా శకుంతలా పట్నాయక్‌ అయ్యారు. ఆయన మ్యాథమెటిక్స్‌ ప్రొఫెసర్‌. పెళ్లి తర్వాత లండన్‌లో స్టాటిస్టిక్స్‌లో డాక్టరేట్‌ చేసేందుకు వెళ్లారు. ఆ రోజుల్లో ఎక్కువగా నౌకల్లోనే విదేశాలకు వెళ్లేవారు. ఒక్కో ప్రయాణం నెల పాటు సాగేది. ఉత్తరప్రత్యుత్తరాలకీ చాలా రోజులు పట్టేది. ఆయన 1960లో ఐక్య రాజ్య సమితి(యూఎన్‌ఓ)లో చేరారు. దీంతో శకుంతలా పట్నాయక్‌ కూడా యూఎన్‌ఓ స్కూల్స్‌లో ఇంగ్లిష్‌ బోధించేవారు. ఈమె అనర్గళంగా ఇంగ్లిష్‌ మాట్లాడేవారు. చెప్పేవారు.

అందువల్ల వివిధ దేశాల్లో పనిచేసే అవకాశాలు వచ్చాయి. శకుంతల పుట్టింటివారు, మెట్టింటివారు అందరూ కలుపుకుంటే మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య వందకు పైగా చేరింది. శకుంతలకి నలుగురు కొడుకులు, ఒక కూతురు. వీళ్లందరూ సమాజంలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఒకరు నాసా సైంటిస్టుగా రిటైర్‌ అవుతున్నారు. శకుంతలకి 12 మంది మనవలు మనవరాళ్లు, 9 మంది మునిమనవలు, మునిమనవరాళ్లు.

‘ఈరోజుల్లో మనుషుల మధ్య అనుబంధాలు ఎలా ఉన్నాయి?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ సెల్‌ఫోన్లు రిలేషన్‌షిప్‌లను పాడుచేస్తున్నాయని, వ్యక్తుల విలువైన సమయాలను నాశనం చేస్తున్నాయని శకుంతలా పట్నాయక్‌ ఆవేదన వెలిబుచ్చారు.