గుంటూరు జిల్లాలోని, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో టిడిఆర్ బాండ్ ల పేరుతో భారీ అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. 10 కోట్ల రూపాయల అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు. రోడ్ల విస్తరణ పేరుతో, ఈ టిడిఆర్ బాండ్ల అక్రమాలు జరిగాయని, విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. కొన్ని చోట్ల రోడ్ డెవలప్మెంట్ ప్లానింగ్ లేకుండానే, టిడిఆర్ బాండ్లు విడుదల చేశారని, డోర్ నెంబర్లు మార్చి, తక్కువ ధర పలికే స్థలానికి కూడా ఎక్కువ దరలకు టీడీఆర్ బాండ్లు ఇచ్చారని, విజిలెన్స్ నివేదికలో తేలుతున్నట్టు సమాచారం.
గుంటూరు, చిలకలూరిపేట, మంగళగిరి, చీరాల వంటి ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పేరుతో ఈ టీడీఆర్ బాండ్ల అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో 10 మంది టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ అక్రమాలలో భాగస్వామ్యం ఉన్నట్లు తేల్చారు. కొద్దిమందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారని సమాచారం. ప్రాథమికంగా 10 కోట్ల రూపాయల అవకతవకలు టిడిఆర్ బాండ్ల కేటాయింపులో జరిగాయని విజిలెన్స్ అధికారులు తేల్చారు. పూర్తి స్థాయి విచారణ జరిగితే ఇంకెన్ని అక్రమాలు వెలుగు చూస్తాయోనన్న చర్చ జరుగుతోంది.