శ్రీకాకుళంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులతో పాఠశాలకు బయలు దేరిన స్కూల్ బస్సు చెరువులో పడిపోయింది. బుధవారం ఉదయం ఎచ్చెర్ల మండలంలోని కొయ్యం గ్రామ సమీపంలోని నల్ల చెరువులో ఈ ఘటన జరిగింది. 8 మంది విద్యార్థులతో వెళుతున్న స్కూల్ బస్సు చెరువులో పడిపోవడంతో.. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను కాపాడారు.. అప్పటికే ఒక విద్యార్థి మృతి చెందాడు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. విద్యార్థి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.