NTV Telugu Site icon

Woman Statue: ఈ విగ్రహమేంటి ఇలా ఉందనుకుంటున్నారా? ఎన్నో విశేషాలు దీని సొంతం.

Woman Statue

Woman Statue

Woman Statue: మనం ఎన్నో చోట్ల ఎన్నో రకాల విగ్రహాలను చూసుంటాం. కానీ ఇలాంటి అరుదైన విగ్రహాన్ని మాత్రం బహుశా తొలిసారి చూస్తున్నామేమో. ఎందుకంటే ఇదొక నగ్న స్త్రీ విగ్రహం. అభ్యంతరకరమైన భంగిమలో తీర్చిదిద్దిన అందమైన బొమ్మ. ఈ అపురూప కళాఖండం పేరు యక్షి. కేరళలోని పాలక్కడ్‌ జిల్లా మలంపుఝా గార్డెన్స్‌లో ఉంది. ఆ రాష్ట్రంలోని అతిపెద్ద పర్యాటక ప్రాంతం. అత్యధిక సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తున్న ప్రదేశం. ఒక మహిళ వస్త్రాలు లేకుండా నేల మీద రెండు కాళ్లూ ముందుకు పెట్టి ఎడంగా తెరిచి కూర్చున్న చిత్రం.

తలను వెనక్కి నాజూగ్గా వంచి రెండు చేతులతో కురులను విప్పుకుంటున్న పోజు. నేత్రాలను సగం మాత్రమే తెరిచి చూస్తున్న స్టిల్‌. ఈ స్టాచ్యూ హైట్‌ 30 అడుగులు. ఇది మన దేశంలోని ఎత్తైన దిగంబర స్త్రీ ప్రతిమల్లో ఒకటి. కోవెల బయట కొలువై ఉండటం ఈ దేవత ప్రతిరూపం ప్రత్యేకత. ఈ విగ్రహాన్ని చూసినవారికి ముందుగా మనసులో కలిగే భావం అసభ్యత. కానీ దీని రూపకర్త ఈ అభిప్రాయంతో అస్సలు ఏకీభవించడు. ఈ బొమ్మలో బూతు ఏమాత్రం లేదని, ఆడ మనిషిని అలా చూడాలని ఫిక్స్‌ అయితే తప్ప ఇందులో అశ్లీలం కనిపించదని చెబుతున్నాడు. ఈ విగ్రహ రూపశిల్పి పేరు కనాయి కున్హిరామన్‌.

read also: America: అగ్రరాజ్యం అమెరికాలో ‘టాప్‌’ స్టార్టప్‌ హీరోలూ మనోళ్లే

వాస్తవానికి ఈ ప్రతిమ ఒక స్త్రీ శరీర అందాన్ని కళాత్మకంగా అభివర్ణిస్తోందని చెప్పొచ్చు. భారతదేశంలో ఇప్పటివరకు సృష్టించబడిన అత్యుత్తమ కళాకృతుల్లో ఈ యక్షి ఒకటని అనటంలో అతిశయోక్తిలేదు. కనాయి కున్హిరామన్‌ 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు (1969లో) దీనికి తుది రూపమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఆర్ట్‌ వర్క్‌ని శాశ్వతంగా నిలిచిపోయేలా చేసే ఏర్పాట్లులో నిమగ్నమయ్యాడు. దీనికి కాంస్యం పూత పూయాలని భావిస్తున్నాడు. తద్వారా అత్యంత దృఢంగా మార్చాలని, భవిష్యత్తులో చిన్న డ్యామేజీ కూడా కాకుండా చూడాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.

అత్యున్నత నైపుణ్యానికి, సృజనాత్మకతకు, నిస్సంకోచమైన భావ వ్యక్తీకరణకు ప్రతీకగా నిలుస్తున్న ఈ విగ్రహాన్ని రూపొందించడం వెనక ఆదర్శవంతమైన ఉద్దేశాలు ఉన్నాయి. సమాజంలోని సంప్రదాయవాదుల ప్రతికూల ఆలోచనా తీరులో, వాళ్లు స్త్రీలను చూసే చూపులో మార్పు తేవటం కోసం దీన్ని ఏర్పాటుచేశారు. యక్షికి రూపకల్పన చేసేటప్పుడు ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. చాలా మంది దీన్ని తీవ్రంగా ద్వేషించారు. కానీ ఇప్పుడు అత్యధికులు మెచ్చుకుంటున్నారు. ఆదరిస్తున్నారు. దీంతో ఇది రొమాంటిక్‌ ఏరియాకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందనే పాజిటివ్‌ కామెంట్లు వినిపిస్తున్నాయి.