NTV Telugu Site icon

2024 Elections: ఎన్టీఆర్ సాధించనిది కేసీఆర్ సాధిస్తారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఇప్పుడు తన ఆరాధ్యుడు నందమూరి తారక రామారావును గుర్తుచేస్తున్నారు. ఎన్టీయార్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1983లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయం సాధించింది. అదే ఏడాది మే 28న తన పుట్టిన రోజు నాడు విజయవాడలో విపక్షాలతో మహా రాజకీయ సదస్సు నిర్వహించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ వ్యతిరేక ఐక్యకూటమి ప్రయత్నాలకు అది మరో ఆరంభం.

1983లోనే కర్నాటకలో రామకృష్ణ హెగ్డే సారధ్యంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మరుసటి ఏడాది జమ్ము కశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లా సారధ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధించింది. గతంలో ఈ మూడు రాష్ట్రాలు కాంగ్రెస్‌ కంచుకోటలు. కనుక ఈ విజయాలు ప్రతిపక్ష శిభిరంలో సహజంగానే గొప్ప ఆశలు రేపాయి. ఎందుకంటే, 1977-79 జనతా ప్రయోగం విఫలం కావటం ప్రజల స్మృతి పథం నుంచి ఇంకా తొలగిపోలేదు. అప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న విపక్ష ఐక్యతను విజయవాడ సమావేశం ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం మొదలైంది. ఐతే, అప్పటికి రెండేళ్ల క్రితం ఆవిర్భించిన బీజేపీని సమావేశానికి దూరం పెట్టారు. నలబై ఏళ్ల తరువాత ఇప్పడు బీజేపీకి వ్యతిరేకంగా అలాంటి ప్రయత్నం మొదలైంది. ఇప్పుడు ఈ ఐక్య పోరాటానికి కాంగ్రెస్‌ను దూరం పెట్టటం కేవలం విధి విచిత్రం.

ఇది ఇలావుంటే, ప్రస్తుతం కేంద్రానికి వ్యతిరేకంగా ప్రాంతీయ శక్తులను ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చురుగ్గా సాగుతోంది. అయితే, ఇది ఏమాత్రం ప్రజాభిమానం చూరగొంటుందో చూడాల్సి వుంది. 1983-84లో ఎన్టీఆర్ చేసిన ప్రయత్నం ఫలితం ఇవ్వలేదు. ఎన్టీఆర్ చేయలేకపోయిన దానిని కేసీఆర్ చేయగలరా? చరిత్ర పునరావృతమవుతుంది, మొదట విషాదం వలె, రెండవది ప్రహసనంలా అని “ది ఎయిటీన్త్ బ్రూమైర్ ఆఫ్ లూయిస్ బోనపార్టే”లో కార్ల్ మార్క్స్ వ్యంగ్యంగా అంటాడు. నాడు ఎన్టీయార్‌ ప్రయత్నానికి కొనసాగింపుగా 1984లో శ్రీనగర్, కలకత్తా, ఢిల్లీ సమావేశాలు విషాదమే. నాడు హాజరైన 24 మంది నేతలలో శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా కూడా ఉన్నారు. బహుశా వీరు నాటి అనుభవం ఇప్పుడు ఉపయోగపడవచ్చు.

ఈ నెల 17న కేసీఆర్ 68వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ మీడియాలో ఫుల్‌పేజీ ప్రకటనలు ఇచ్చారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలోని అన్ని ముఖ్య కూడళ్లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు.

1984 సార్వత్రిక ఎన్నికల ముందు విజయవాడ సమావేశం విపక్షాలకు గొప్ప స్పూర్తిని ఇచ్చింది. నాడు విపక్షాల ఐక్యతకు కేంద్రబింధువు ఎన్టీయార్‌ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్‌పై కూడా జాతీయ స్థాయిలో అలాంటి చర్చ నడుస్తోంది. ఐతే నాడు విపక్షాల ఐక్యతకు తొలి అడుగు వేసిన టీడీపీ ఇప్పుడు కేసీఆర్‌ ప్రయత్నాలను వ్యతిరేకిస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ కేసీఆర్‌ ప్రయత్నానికి దూరంగా ఉండటం గమనార్హం.

నిన్న (ఫిబ్రవరి 20) కేసీఆర్‌ ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం అయ్యారు. కొత్త ఆశ, కొత్త సంకల్పం, కొత్త ఎజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా అన్నారు. ఇందుకోసం బీజేపీయేతర శక్తులన్నీ ఏకం కావాలన్నారు. కేసీఆర్‌తో పాటు మహా ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే కూడా దేశంలో నెలకొన్ని రాజీకీయ పరిస్థితులపై ఆవేదన చెందారు. దేశంలో ప్రజాపాలన మంటగలిసి పోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తు ఏమైపోతుందని ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎవరో ఒకరు ఆలోచించాలి, ఈ అంశాన్ని లేవనెత్తాలి కాబట్టి అది తమతోనే ప్రారంభమవుతోందన్నారాయన. ఇక, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కేసీఆర్‌ ప్రయత్నాలను ప్రశంసించారు. కలిసికట్టుగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలని, కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని పవార్‌ అన్నారు.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ బలహీనమైన వేళ ప్రాంతీయ పార్టీలకు బీజేపీతో పోరాటం అనివార్యమైంది. ఫెడరల్‌ స్ఫూర్తి కోసం అవి ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది. కేసీఆర్‌ పిలుపుకు తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. బీజేపీ వ్యతిరేక పోరులో కలిసి పనిచేస్తామని సీపీఎం ప్రకటించింది. ప్రాంతీయ పార్టీల ఐక్యతతో గతంలో లబ్ది పొందిన మాజీ ప్రధాని దేవెగౌడ కూడా కేసీఆర్‌కు అండగా నిలిచారు. అలాగే ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌తో కూడా మోడీ వ్యతిరేక ఫ్రంట్ అవకాశాలపై కేసీఆర్‌ చర్చించారు.

Read: Russia-Ukraine Conflict: యుద్దానికి తాము సైతం సిద్దం అంటున్న మ‌హిళ‌లు…

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ ఇంకా ఇందులోకి దిగలేదు. మార్చి 10న యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కానీ ఆయన నిర్ణయం పాత్ర తెలుస్తుంది. నిజానికి, కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయంగా తనను తాను మలచుకోవాలనుకుంటున్నారు. మరోవైపు, 2024 ఎన్నికలలో మోడీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదగాలని మమతా బెనర్జీ ఉవ్విళ్లూరుతున్నారు. స్టాలిన్‌కు అలాంటి ఆశలు ఏమీ లేవు..కానీ తన తండ్రి లాగే ఢిల్లీలో సముచిత స్థానం కోరుకుంటున్నారు.

నేతల మధ్య పరస్పర అపనమ్మకం, మొండితనం 1983-84లో విపక్షాల ఐక్యతకు అడ్డుపడ్డాయి. నాడు ఒక్కో నేతకు ఒక్కో ప్రాధాన్యం ఉండేది. మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు విముఖంగా ఉన్నట్లే, ఆనాడు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏను విపక్షాలు కలుపుకుపోలేదు. దానికి ప్రధాన కారణం వామపక్షాలు. కలకత్తా సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన లెఫ్ట్ ఆనాడు జాతీయ స్థాయిలో బలంగా ఉండేది.

2014 నుంచి బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసి మాట్లాడే రెండు ఫోరమ్‌లు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. హోం మంత్రిత్వ శాఖలో భాగమైన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు జరగటమే లేదు. ప్రణాళికా సంఘం రద్దుతో నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఉనికి ప్రశ్నార్థకమైంది. ముఖ్యమంత్రులు నీతి అయోగ్ పాలక మండలిలో సభ్యులు. కానీ ఇది కూడా క్రియాశీల వేదిక కాదు. కాబట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌ మాదిరిగా కొందరు ముఖ్యమంత్రులు గవర్నర్‌ వ్యవహార శైలితో విసిగిపోయారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల డిప్యూటేషన్‌ నిబంధనలలో ఇటీవలి మార్పులు కూడా కేంద్ర , రాష్ట్రాల మధ్య అగాధం సృష్టించాయి. కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు మెడికల్ కాలేజీ అడ్మిషన్లకు నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) మాత్రమే ప్రమాణంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కోవిడ్‌ సమయంలో ముఖ్యమంత్రులతో ప్రధాని కనీసం రెండు డజన్ల వర్చువల్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. కాని ఈ సమావేశాలు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ , ఎన్‌డీసీలా అనువైన వేదిక కాలేకపోయాయి.

Read: Trivikram: మాటల మాంత్రికుడి మాస్టర్ ప్లాన్.. మరో స్టార్ హీరోయిన్నీ రంగంలోకి దింపి

నీట్ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌ కే స్టాలిన్ మోడీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ చేతిలో వరుస పరాభావలతో కేసీఆర్‌ రగిలిపోతున్నారు. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజారాబాద్‌ ఎన్నికల తరువాత కేసీఆర్‌ పూర్తిగా బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. 2023 డిసెంబర్‌లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటమే దానికి కారణం. స్టాలిన్‌ ఆందోళన పాలనాపరమైనది. కానీ కేసీఆర్‌ ఆందోళన రాజకీయ ప్రధానమైనది. జాతీయ ప్రతిపక్ష రాజకీయాల్లో ఎన్టీఆర్‌గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు.

ఓ వైపు కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు, కేసీఆర్‌ హస్తం పార్టీ పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్నారు. అది లేకేండా ఏ ప్రతిపక్ష కూటమి నిలబడదని కేసీఆర్‌కు తెలియంది కాదు. అందుకే రాహుల్ గాంధీని బహిరంగంగా ప్రశంసించారు. ఆయనను తూలనాడిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మతో కూడా పెట్టుకున్నారు. ఇక తమిళనాడులో కాంగ్రెస్‌కు డీఎంకే మిత్రపక్షంగా ఉంది. కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వాన్ని ఉద్ధవ్ ఠాక్రే నడుపుతున్నారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ జార్ఖండ్‌ ముక్తి మోర్చా కూడా కాంగ్రెస్‌ భాగస్వామి. అన్నిటికి మించి ఈ ప్రాంతీయ శక్తులన్నింటికీ పితామహుడు ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ లేకుండా మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఉండదని తేల్చి చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది నిజం.

1996 – 2014 మధ్య ఢిల్లీలో ప్రాంతీయ పార్టీలు ఆడింది ఆట పాడింది పాట. 1984 తర్వాత మొదటిసారి 2014లో కేంద్రంలో ఏకపార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని కోల్పోయాయి. ఎన్డీయే నుంచి శివసేన, అకాలీదళ్ వైదొలగడంతో బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏ దాదాపు ఉనికిని కోల్పోయింది.

ఇప్పుడు ప్రాంతీయ శక్తులు ఫెడరల్ ఫ్రంట్‌ కోసం కసరత్తు చేస్తుండగా బీజేపీ మాత్రం తన ఏకైక జాతీయ ప్రత్యర్థి కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయటంపై దృష్టి పెట్టింది. 2014లో బీజేపీ గెలిచిన 282 సీట్లలో 166, 2019లో 303 సీట్లలో 175 సీట్లు కాంగ్రెస్ పై గెలిచినవే. 2014లో, కాంగ్రెస్ 23 స్థానాల్లో బీజేపీని ఓడించింది. 2019లో ఆ సంఖ్య 15కి పడిపోయింది. 200 స్థానాల్లో ఈ బీజేపీ-కాంగ్రెస్‌ మధ్య ప్రత్యక్ష పోరు ఉంది. బీజేపీ ఈ సంఖ్యను పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ప్రాంతీయ శక్తుల నుండి ఎదురయ్యే సవాలుకు చెక్‌ పెట్టాలని చూస్తోంది. కనుక, తాను చేపట్టిన మహాకార్యంలో కేసీఆర్‌ ఎంతవరకు సఫలీకృతుడవుతారో చూడాలి. ఈ ప్రయత్నంలో ఆయన విజయం సాధించి బీజేపీని గద్దెదించగలిగితే నాడు ఎన్టీఆర్‌ సాధించని కార్యాన్ని కేసీఆర్‌ సాధించిన వాడవుతారు.