Site icon NTV Telugu

పిల్లల కోసం టీకాలు.. యాక్షన్ ప్లాన్ రెడీ?

దేశ వ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే దేశంలోని వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ప్రస్తుతం దేశంలో 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఉచితంగా టీకాలను పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరు రెండు డోసులను తప్పనిసరిగా వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ పూర్తి చేసుకున్న 90రోజులకు సెకండ్ డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలంతా కరోనాపై అవగాహన పెంచుకొని కోవిడ్ టీకాలను వేయించుకుంటున్నారు. అయితే కొంత మందిలో వ్యాక్సిన్ తర్వాత సల్ప రియాక్షన్ వస్తుండటంతో పలువురు టీకాలు వేసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారని సమాచారం.  

పెద్దలకు టీకాలు ముగింపు దశకు చేరుకుంటుండటంతో ప్రభుత్వ యంత్రాంగం పిల్లలకు కోవిడ్ టీకాలు వేసేందుకు రెడీ అవుతోంది. పల్స్ పోలియో తరహాలో క్యాంపెయిన్, ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్దలకు అందిస్తున్న టీకాల సెకండ్ డోస్ ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటోంది. అప్పటికల్లా పిల్లల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రాధాన్యతను గుర్తించి వారికి టీకాలు వేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించే టీకాల ఆధారంగా చిన్నారులకు టీకాలు వేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో 18ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు దాదాపు 1.03కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ రెండున్నర నెలల వ్యవధితో కనీసం ఒక్క డోసు అయినా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లల కోసం తయారవుతున్న కోవాగ్జిన్ ను 28రోజుల గ్యాప్ లో రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. జైడస్ క్యాడిలా మాత్రం 30రోజుల గ్యాప్ తో మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,672 వ్యాక్సినేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారానే చిన్నారులకు సైతం కోవిడ్ టీకాలను వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవసరమైతే అదనంగా కూడా వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

చిన్నారులకు ప్రస్తుతం కోవాగ్జిన్, జైడస్ క్యాడిలా సంస్థలు మాత్రమే టీకాలు తయారు చేస్తున్నాయి. వీటికి కేంద్ర వైద్యారోగ్య శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రానున్నాయి. ఆ తర్వాతే టీకాల పంపిణీ జరగనుందని అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ కల్లా పెద్దలకు అందిస్తున్న టీకాల సెకండ్ డోస్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటి కల్లా చిన్నారుల టీకా అందుబాటులోకి వస్తే వాటిని ప్రాధాన్యత క్రమంలో అందించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే డోసుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం తన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోనుంది. మొత్తానికి పల్స్ పోలియో తరహాలోనే చిన్నారులకు కోవిడ్ టీకాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముందస్తు సన్నాహాలు చేస్తుండటం విశేషం.

Exit mobile version