Site icon NTV Telugu

సునామిలా విరుచుకుపడుతోన్న మహమ్మారి

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త వేరియంట్‌ సునామిలా విరుచుకు పడుతోంది. ఉప్పెనలా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో కూడా కేసులు స్పీండందుకున్నాయి. కేవలం మూడు రోజులలో పరిస్థితి మారింది. బుధవారం ఒక్క రోజే 13,154 మందికి వైరస్‌ సోకింది. మంగళవారంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఇక, ఒమిక్రాన్‌ విషయానికి వస్తే ప్రస్తుతం అది 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాపించింది. ఈ రకం కేసుల సంఖ్య వెయ్యికి చేరువ కావటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర మరోసారి హాట్‌ స్పాట్‌గా మారతున్నాయి.

మహారాష్ట్రలో బుధవారం 2,172 కేసులు వెలుగు చూశాయి. 75 రోజుల తరువాత ఇదే గరిష్టం. ముంబయి నగరంలోనే 1,333 మందికి తాజాగా కరోనా సోకింది. అలాగే, రాష్ట్రంలోని పన్నెండు జిల్లాలలో కేసులు పెరుగుతున్నాయి. రాబోవు రోజులలో మహారాష్ట్రలో కేసుల ఉదృతికి ఇది సంకేతం. దాంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఒకటి రెండు రోజుల్లో పక్కా ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది.

మరోవైపు, డిసెంబర్‌ 14 నాటికి రాష్ట్రంలో 6,481 యాక్టివ్‌ కేసులు ఉండగా.. డిసెంబర్‌ 28 నాటికి ఆ సంఖ్య 11,492కి చేరింది. రెండు వారాలలో దాదాపు రెట్టింపయ్యాయి. ఇదే సమయంలో ముంబయిలో 1,769 నుంచి 5,803 కి చేరాయి. ఐతే, మరణాలు తక్కువగా ఉండటం కాస్త ఊరట. ఐతే, ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర 263 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఇంత జరుగుతున్నా చాలా చోట్ల జనం కనీసం ముఖానికి మాస్కులు కూడా పెట్టుకోని పరిస్థితి కనిపిస్తుంది. ముంబయి, షోలాపూర్‌, నాసిక్‌,థానె, పుణె, సాంగ్లీ,సతారా వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాబోవు రోజుల్లో ఈ ప్రాంతాలు హాట్‌స్పాట్లుగా మారతాయనటంలో ఎలాంటి సందేహం లేదు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీని ఒమిక్రాన్‌ కమ్మేస్తోంది. కొత్తగా నమోదవుతున్న కేసులలో దాదాపు సగం ఒమిక్రాన్‌ రకానివే. బుధవారం 923 కోవిడ్‌ 19 కేసులు నమోదయ్యాయి. మే నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలోఇదే అత్యధికం. బుధవారం నమోదైన వాటిలో 46 శాతం కేసులు ఒమిక్రాన్‌ రకానివని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. జెట్‌ వేగంతో కేసులు పెరుగుతున్నా జనం ఏమాత్రం భయ పడుతున్నట్టు లేదు. నిబంధనలు గాలికి వదిలేసి తిరుగుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం మచ్చుకైనా కనిపించదు. భుజం భుజం రాసుకుంటూ కనిపిస్తున్నారు. ఢిల్లీలోని ప్రధాన మార్కెట్‌ సెంటర్లన్నిటిలో ఇదే పరిస్థితి. జనం గుంపు గుంపులుగా కనిపిస్తున్నారు.

కోవిడ్‌ సేఫ్టీ ప్రోటోకాల్‌ అతిక్రమించిన వారిపై ఢిల్లీ పోలీసులు భారీగా ఫైన్లు వేస్తున్నారు. బుధవారం ఒక్క రోజే 4,392 మంది బుక్కయ్యారు. అందులో 4,428 కేసులు ఫేస్‌ మాస్క్‌కు సంబంధించినవే. కాగా భౌతిక దూరం పాటించలేదని 83 మందిపై, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేసినందుకు గాను 60 మందికి జరిమానా విధించారు. ఈ క్రమంలో 69 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కానీ ఎలాంటి అరెస్టులు జరగలేదు. ఇక, నిబంధనలు పాటించని వారు కట్టిన ఫైన్ల విలువ 86 లక్షల 33 వేల 700 రూపాయలు. ఇది ఆశ్యర్యం కలిగించే విషయం.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులను చూస్తే బ్రిటన్‌లో బుధవారం 183,037కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కేసులు భారీగా పెరగటంతో ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తోంది. వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని, తక్షణం టీకా తీసుకోవాలని ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

మరోవైపు, ప్రపంచానికి ఒమిక్రాన్‌ రిస్క్‌ తీవ్రమవుతోందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ అంటోంది. గత వారం ప్రపంచ వ్యాప్తంగా కేసులు 11 శాతం పెరిగాయి. డెల్టా, ఒమిక్రాన్ కలిసి కరోనా సునామీ సృష్టిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చాలా దేశాలలో ఈ కొత్త వేరియంట్‌ డెల్టా స్థానాన్ని ఆక్రమించింది. ఫలితంగా అమెరికా, యూరప్ దేశాలలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసుల ప్రపంచ సగటు మంగళవారం 930,000ల గరిష్ట స్థాయికి చేరింది. గతంలో ఇది 827,000 ఉంది.

మరోవైపు, అమెరికాలో నిజంగానే కేసుల సునామీ కొనాసగుతోంది. మంగళవారం ఏకండా 5 లక్షల 12 వేల మంది కరోనా బారినపడ్డారు. 2020లో మహమ్మారి ప్రారంభమైనప్పటి ఒక రోజులో అత్యధికంగా కేసులు నమోదు కావటం ఇదే. ఇక, ఈ కొత్త కేసులలో ఒమిక్రాన్‌ వాటా 58.6 శాతం. దీనిని బట్టి మంగళవారం ఒక్క రోజే అమెరికాలో దాదాపు మూడు లక్షల మందికి కొత్త వేరియంట్‌ సోకినట్టు తెలుస్తోంది. ఒమిక్రాన్‌ వల్ల ఇప్పటికే అమెరికా వైద్య వ్యవస్థ సామర్ధ్యాన్ని మించి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ప్రతి రోజు దాదాపు తొమ్మిది వేల మంది ఆస్పత్రి పాలవుతున్నారు. జనవరి చివరి నాటికి అమెరికాలో ఒమిక్రాన్ పీక్‌కు చేరుతుందని ప్రభుత్వ వైద్య సలహాదారు ఆంతోనీ పౌచీ అన్నారు.

ఫ్రాన్స్‌లోనూ పరిస్థితి బ్రిటన్‌ కన్నా దయనీయంగా ఉంది. 24 గంటలలో 2,08,000 కేసులు నమోదయ్యాయి. యూరప్‌లో ఒకే రోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం డెన్మార్క్, పోర్చుగల్, యూకే, ఆస్ట్రేలియాలు కూడా కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టించాయి. దాంతో అత్యవసర సర్వీసులకు సిబ్బంది కొరత ఏర్పడుతోంది.

Exit mobile version