Site icon NTV Telugu

తెలుగు అకాడమీ కేసులో 16కి చేరిన అరెస్టుల ప‌ర్వం

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం క‌లిగించిన తెలుగు అకాడమీ కుంభ‌కోణం కేసులో అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది. తాజాగా మరొకరి అరెస్టు జ‌రిగింది. దీంతో తెలుగు అకాడమీ కేసులో అరెస్టుల సంఖ్య 16కు చేరింది. బ్యాంకు నుంచి డబ్బులు కొల్లగొట్టాలని ప్లాన్ కృష్ణారెడ్డిదే అని తెలుస్తోంది. సాయి కుమార్ కు సలహా ఇచ్చినందుకు రెండున్నర కోట్లు తీసుకున్నాడు కృష్ణారెడ్డి.

మొదట్లో కృష్ణారెడ్డి సాయికుమార్ కలిసి ఫిక్స్డ్ డిపాజిట్ల కొల్లగొట్టడం పై సమావేశాలు నిర్వ‌హించారు. పెద్ద మొత్తంలో వాటాను డిమాండ్ చేయడంతో కృష్ణా రెడ్డిని పక్కన పెట్టాడు సాయి కుమార్. చివ‌ర‌కు ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారని సీసీఎస్ పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డ‌యింది.

తెలుగు అకాడమీ కేసు రెండు రాష్ట్రాల్లో దుమారం రేపింది. ఇప్ప‌టివ‌ర‌కూ పరారీలో ఉన్న కృష్ణారెడ్డిని సీసీఎస్‌ పోలీసులు ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేశారు. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన కృష్ణారెడ్డి.. కూకట్ పల్లిలోని నిజాంపేట్‌లో నివాసం ఉంటున్న‌ట్టు పోలీసులు తెలిపారు. తెలుగు అకాడమీ డిపాజిట్లలో తన వాటాగా కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు రాగా, పోలీసుల విచారణలో మాత్రం 3.5 కోట్లు తీసుకున్నట్లు కృష్ణారెడ్డి చెబుతుండ‌డం కొస‌మెరుపు. ఏపీ వేర్ హౌసింగ్ లో 10కోట్లు, ఏపీ సీడ్స్ కార్పోరేషన్ 5కోట్ల స్కాం లోనూ కృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించాడ‌ని పోలీసులు చెబుతున్నారు.

ఈ దోచుకున్న డబ్బుని నిందితులు ఏం చేశార‌నేది అంతుప‌ట్ట‌ని మిస్ట‌రీగా మారింది. ఎక్కడ దాచారు. ఎందులో పెట్టుబడులు పెట్టారనే అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ గోల్ మాల్‌లో ప్ర‌ధాన నిందితుడైన సాయికుమార్‌ 35 ఎకరాల స్థలం కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది.

మరో నిందితుడు వెంకటేశ్వర్‌రెడ్డి కూడా సత్తుపల్లిలో ఓ భారీ బిల్డింగ్ కొనుగోలు చేశాడ‌ని ద‌ర్యాప్తులో తెలుస్తోంది. తెలుగు అకాడమీ డిపాజిట్లతో ఆర్థిక మోసాలకు పాల్పడిన నిందితుల ఆస్తులను గుర్తించిన ఈడీ అధికారులు వాటిని జప్తు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన విధంగా దొంగ‌లు దొంగ‌లు ఊళ్ళు పంచుకున్న చందంగా మారింది.

Exit mobile version