Site icon NTV Telugu

Russia-Ukraine War: రష్యా అణ్వాయుధం ప్రయోగించక తప్పదా..?

Russia War Min

Russia War Min

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతుందే కానీ తగ్గుతున్న సూచనలు కనిపించుట లేదు. యుద్ధం మొదలై రెండు నెలలు దాటింది. శాంతి సాధన దిశగా అడుగు కూడా ముందుకు పడే సూచనలు లేవు. పైగా రష్యా పదే పదే అణు జపం చేస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్నట్టుగా మాట్లాడుతోంది. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఆయుధ సాయం ఇలాగే కొనసాగితే పుతిన్‌ ఏం చేస్తాడో ఊహించను కూడా ఊహించలేం.

ఇప్పుడు జరుగుతోంది పేరుకే ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం. నిజానికి ఇది అమెరికా, నాటో దేశాలు రష్యాపై చేస్తున్న ఆధిపత్య పోరాటం. రష్యాను దెబ్బతీసే ప్లాన్‌లో భాగంగానే అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ను అడ్డంపెట్టుకుని రష్యాను కోలుకోని విధంగా దెబ్బకొట్టాలేది అమెరికా ప్లాన్‌. అరవై రోజుల ఈ సుదీర్ఘ పోరు చూసిన ఎవరికైనా అదే అనిపిస్తుంది. తన చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేయటం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష మిలటరీ సాయం చేయకుండా పరోక్షంగా కావాల్సినంత అండదండలు అందిస్తోంది. తన మిత్రదేశాలతో కలిసి భారీ ఎత్తున ఆయుధాలు, అధునాతన యుద్ధ సామాగ్రితో పాటు సాంకేతిక మద్దతును సమకూరుస్తోంది. ఇది రష్యాకు ఏ మాత్రం నచ్చని విషయం. అందుకే ఉక్రెయిన్‌ మీద మరింతగా విరుచుకుపడుతోంది.

అమెరికా, నాటో దేశాలు చేతలతోనే కాదు.. మాటలతో కూడా రష్యాను రెచ్చగొడుతున్నాయి. భవిష్యత్‌లో మరోసారి ఇరుగుపొరుగు దేశాలను ఆక్రమించుకోకుండా రష్యాకు బుద్ధి చెబుతామని అమెరికా బాహాటంగానే అంటోంది. తాజాగా అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు ఉక్రెయిన్‌లో పర్యటించి ఉక్రెయిన్‌కు మరింత అధునాతన సైనిక సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను పెంచేందుకు పశ్చిమ జర్మనీలోని రామ్‌స్టెయిన్ యూఎస్‌ ఎయిర్ బేస్ వద్ద నలబై దేశాల రక్షణ మంత్రులు భేటీ అయ్యారు. ఈ భేటీకి కూడా అమెరికాయే ఆతిథ్యం ఇచ్చింది.

మరోవైపు ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించేందుకు ఇష్టపడని జర్మనీ కూడా ఇప్పుడు మనసు మార్చుకుంది. 500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆర్మ్‌డ్‌ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ వెహికిల్స్‌ను పంపుతున్నట్టు ప్రకటించింది. మొదట్లో ఉక్రెయిన్‌ సామర్థ్యాన్ని సందేహించిన పశ్చిమ దేశాలు ఇప్పుడు దాని పోరాట పటిమ చూసి ఆశ్చర్యపోతున్నాయి. అందుకే అవి ఈ యుద్ధాన్ని సాగదీసే కార్యక్రమం పెట్టుకున్నాయి. రష్యాను ఓడించటమే అవి లక్ష్యంగా పెట్టుకున్నట్టు తాజా పరిణమాలను బట్టి తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఆ దేశాలు మచ్చుకు కూడా శాంతి మాట ఎత్తటం లేదు.

ఆయుధాలు సమకూర్చగలిగితే రష్యాపై ఉక్రెయిన్‌కు గెలుస్తుందనే అంచనాకు పశ్చిమ దేశాలు వచ్చాయి. అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా మొదటి నుంచీ అదే చెబుతున్నాడు. ఆయుధాలు ఇవ్వండి పోరాడతామని పదే పదే చెబుతూ వచ్చాడు. నిజానికి నాటో ఆయుధ సాయం లేకపోతే ఉక్రెయిన్‌ ఇన్ని రోజులు యుద్ద రంగంలో నిలిచేది కాదు. తొలి నాళ్లలోనే రష్యాకు తలవంచేది.

ఉక్రెయిన్‌లోకి తమ దళాలను పంపితే పరిస్థితి మరోలా ఉంటుందని నాటో కూటమికి తెలుసు. అందుకే అది నో ఫ్లైజోన్‌కు కూడా అంగీకరించలేదు. అది రష్యాతో ప్రత్యక్ష యుద్ధాన్ని కోరుకోవటం లేదు. ఏమాత్రం అటు ఇటు అయినా అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే భయం దానికి ఉంది. ఐతే, ఇదే సమయంలో రష్యాను కట్టడి చేయటం కూడా దానికి ముఖ్యమే. అందుకే ఉక్రెయిన్‌కు ఇబ్బడి ముబ్బడిగా అధునాతన ఆయుధసామాగ్రిని టెక్నాలజీని చేరవేస్తోంది. ఐతే, రష్యా దీనిని కూడా యుద్దంగానే పరగణిస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా విదేశాంగ మంత్రి నోట తాజాగా మూడవ ప్రపంచ యుద్ధం అనే మాట వినిపించింది. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ఉండటం నిజమే అని యావత్‌ ప్రపంచాన్ని హెచ్చరించారు.

మూడో ప్రపంచ యుద్ధం వద్దని శాంతి జపం చేస్తున్న చాలా దేశాలు తమ చేష్టల ద్వారా యుద్ధాన్ని కోరుకుంటున్నాయని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సమకూర్చినాటో దేశాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయనే రష్యా వాదనలో కూడా నిజం ఉంది. అమెరికా దాని మిత్రపక్షాలకు ఉక్రెయిన్‌ యుద్దాన్ని ముగించటం ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పటి వరకు అమెరికా చర్చల దిశగా చేసిన ప్రయత్నం శూన్యం. పుతిన్‌ను మాటలతో రెచ్చగొట్టడం మినహా అది చేసిందేమీ లేదు. పైగా ఉక్రెయిన్‌ చర్చలకు వెళ్లకుండా అమెరికా, బ్రిటన్‌ దానిపై ఒత్తిడి తెస్తున్నాయనే రష్యా ఆరోపణలను కొట్టి పారేయటానికి లేదు. చర్చలు ఆగిపోవడానికి ఉక్రెయినే కారణమని రష్యా పదే పదే ఆరోపిస్తోంది. దీనిని అమెరికా, బ్రిటన్‌ జీర్ణించుకోలేకపోతున్నాయి.

మొత్తానికి రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్‌ చేసిన అణు యుద్ధం వ్యాఖ్యలు అమెరికా దాని మిత్రపక్షాలకు తాకాల్సిన చోట తాకాయి. అణు యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరు. చేయకూడని యుద్ధమని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలాయం పెంటగాన్‌ వ్యాఖ్యానించింది. అలాగే, మూడో ప్రపంచ యుద్ధాన్ని చూడాలని ఎవరూ కోరుకోరని చైనా పేర్కొంది. 1962 క్యూబన్‌ మిస్సైల్‌ సంక్షోభం తరువాత మళ్లీ అంతటి ఉద్రిక్తతలను ప్రపంచం ఇప్పుడే చూస్తోంది. అమెరికా, నాటో బలగాలను నిరోధించటానికి రష్యా అణు బూచీ చూపిస్తోంది. ఇరు పక్షాలు ప్రతీకార వాంఛనతో రగిలిపోతున్నాయి. శాంతి ప్రయత్నాలు లేకపోవటంతో ఈ ఘర్షణలు రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కావచ్చు.

రెండు నెలలుగా తీవ్ర స్థాయిలో పోరాడుతున్నా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో పై సాధించటంలో రష్యా విఫలమైంది. దాంతో అది తీవ్ర అసహనానికి లోనవుతోంది. దానికి తోడు పశ్చిమ దేశాలు రెచ్చగొడుతుండటంతో హిరంగంగానే మూడో ప్రపంచ యుద్ధం అంటోంది. అణు దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. అయితే అణు దాడులకు పాల్పడే సాహసం రష్యా చేస్తుందా అని అనుకోవచ్చు. అదే జరిగితే ఏమీ మిగలదని తెలుసు. అయినా రష్యా ఎందుకీ హెచ్చరికలు చేస్తున్నదో ఆలోచించాలి. ఉక్రెయిన్‌ ఆక్రమణకు దిగే సాహసం పుతిన్‌ చేస్తాడని అనుకున్నారా? కానీ ఏం జరిగింది? తీవ్ర స్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించి.. ప్రపంచంలో ఏకాకిని చేస్తే రష్యా వెనక్కి తగ్గుతుందని అనుకున్నారు. మరి తగ్గిందా? కనుక, రష్యా అణ్వాయుధం ప్రయోగించదు అనే గ్యారంటీ లేదు. పుతిన్‌ దూకుడు గురించి ఇంత తెలిసీ దానిని తేలిగ్గా తీసుకుంటే అది తెలివి తక్కువతనమే అవుతుంది.

Ukraine Crisis: మూడో ప్రపంచ యుద్ధం ముప్పు.. ఉక్రెయిన్‌కు నాటో ఆయుధాలు

Exit mobile version