బాలికల వివాహ వయస్సు పెంపునకు ఉద్దేశించిన బాల్య వివాహాల నిషేధం (సవరణ) బిల్లు- 2021తో దేశ వ్యాప్తంగా హడావుడి పెళ్లిళ్లు పెరిగాయి. ఈ బిల్లు చట్టంగా మారితే బిడ్డ పెళ్లి ఆలస్యమవుతుందని ఆడపిల్లల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్, ముస్లిం పర్సనల్ లా (షరియత్), అప్లికేషన్ యాక్ట్ , ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ – ఈ ఏడు వ్యక్తిగత చట్టాలను ఈ బిల్లుతో సవరిస్తారు. కాబట్టి కొత్త చట్టం అన్ని వర్గాలకు వర్తిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంత వరకు మహిళా సాధికారతకు తోడ్పడుతుందనటంలో సందేహం లేదు. అలాగే బాల్య వివాహాల వెనుక ఉన్న అవిద్య లేమి, పేదరికం వంటి మూల కారణాల పరిష్కారానికి సాయపడుతుంది. కానీ, ఈ బిల్లు చట్ట రూపం తీసుకుంటే తమ కూతురు వివాహం చాలా ఆలస్యం అవుతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సవరణ చట్టం రాక ముందే వివాహం చేస్తున్న సంఘటనలు దేశ వ్యాప్తగా పెరిగాయి.
ప్రతిపాదిత బిల్లు ప్రకారం 21 ఏళ్లు నిండకుండా ఆడపిల్లకు వివాహం చేయటం నేరం. కాబట్టి, సంబంధం రెడీగా ఉన్న వారు హడావుడి పెళ్లి చేసేస్తున్నారు. ఏడాది, రెండేళ్ల ఆగుదామని అనుకున్న తల్లిదండ్రులు కూడా ఇప్పుడు తొందరపడుతున్నారు. అమ్మాయి వివాహ వయస్సు ఒకేసారి మూడేళ్లు పెరగటం వారి ఆలోచనలను మార్చేసింది. ముఖ్యంగా ముస్లింలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ మసీదుల్లో నిత్యం నిఖా సందడి కనిపించటం దీనిని సూచిస్తోంది. ఈ హడావుడి పెళ్లిళ్లలో వధువులు అందరూ 18 నుంచి 20 ఏళ్ల లోపు వారే. వారిలో చాలా మందికి కొన్ని మాసాలలో నిఖా జరగాల్సి ఉంది. ఐతే, బిల్లు ఆమోదం పొందుతుందనే భయంతో ఇరువైపుల కుటుంబాలు వెంటనే వివాం జరిపిస్తున్నారు. వారు తమ కూతురు పెళ్లికి మరో రెండు మూడేళ్లు వేచి చూడాలనుకోవటం లేదు.
ఎక్కువ మంది ఆడిపిల్లలున్న తల్లిదండ్రులు పెళ్లికి త్వరపడటం సహజం.”నాకు ముగ్గురు ఆడ పిల్లలు.. వారిలో కనీసం ఒకరికి ఇప్పుడు పెళ్లి చేయాలి. కాబట్టి మరో రెండేళ్లు ఎలా ఎదురుచూడగలను”అని ఓ తల్లి అంటోంది. అందుకే ఆమె తన 19 ఏళ్ల కూతురుకు స్థానిక మసీదులో నిఖా జరిపించింది.
కూతురు పెళ్లికి డబ్బు కోసం గల్ఫ్ వెళ్లాడో తండ్రి. 2022లో పెళ్లి చేయాలనుకున్నారు. ఇంతలో బిల్లు వార్త వచ్చింది. దాంతో హడావుడిగా పెళ్లికి సిద్ధమయ్యారు. ఇలాంటి కారణాలతో ఇప్పుడు చాలా పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
ఐతే, ఆర్థిక కారణాల వల్ల చాలా మంది అప్పగింతల కార్యక్రమం ‘విదాయి’ని వాయిదా వేస్తున్నారు. వివాహ సమయంలో పెళ్లి కూతురు తల్లిదండ్రులు తప్పనిసరిగా కొంత ఫర్నిచర్, బంగారం, బట్టలు, నగదుతో ఆమెను అత్తవారింటికి పంపించాలి. లాక్‌డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయి ఇప్పుడు కుటుంబం గడవడానికే కష్టపడాల్సి వస్తోందని ఐదుగురు కూతుళ్లు ఉన్న ఓ యాబై ఏళ్ల తండ్రి అంటున్నాడు. దాంతో, ముందు నిఖా చేసి విదాయి కోసం కొన్ని నెలల గడువు కోరుతున్నారు.
కేసీఆర్ షాదీ ముబారక్ పథకం పేద ముస్లిం కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. 2014లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన అమ్మాయి వివాహానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందుతుంది. పేద ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉద్దేశించిన పథకం ఇది. దాంతో వారు ఇప్పుడు నిఖా చేసి షాదీ ముబారక్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. రెండు మూడు నెలలో వారికి లక్ష రూపాయలు అందుతుంది. అది విదాయికి ఉపయోగపడుతుంది. రాబోవు రోజులలలో పాతబస్తీలో వరుసగా వందాలాది నిఖాలు జరగనున్నాయి.
ప్రతిపాదిత బిల్లుపై ముస్లిం మతపెద్దలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది ముస్లిం పర్సనల్ లా లోకి చొరబడటమేని మండిపడుతున్నారు. ఇస్లాం ప్రకారం ఆడపిల్ల యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఎప్పుడైనా వివాహం చేసుకోవచ్చని అంటున్నారు. ముస్లింలు మాత్రమే కాదు హిందూ కులుంబాలలో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది. హర్యానా, రాజస్తాన్ సహా దేశ వ్యాప్తంగా ఈ హడావుడి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అమ్మాయికి పద్దెనిమిదేళ్లు నిండటం ఆలస్యం వారంలో పెళ్లి కానిచ్చేస్తున్నారు. సంబంధం కుదిరితే చదువు మాన్పించి పెళ్లి పీటలు ఎక్కించే పరిస్థితి కనిపిస్తోంది.
హర్యానాలో ఆడపిల్లల తల్లిదండ్రులు వరుల వేట వేగం పెంచారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో కూడా ఈ పరిస్థితి ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలోనే ఈ హడావుడి పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. హర్యానాలోని మేవాత్ ప్రాంతంలో ఇటీవల కేవలం రెండు రోజులలో 450 వివాహాలు జరిగాయి. వాటిలో 180 మాత్రమే ప్లాన్ ప్రకారం జరిగిన పెళ్లిళ్లు. మిగతావన్నీ హడావుడిగా చేసినవే. కోర్టు వివాహాలు కూడా పెరుగుతున్నాయి. గుర్‌గావ్‌లో మామూలుగా రోజుకు ఐదారు దరఖాస్తులు వస్తుండేవి. కానీ ఇప్పుడు ఇరవై వరకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కోర్టు పెళ్లిళ్లతో పాటు టెంపుల్ మ్యారేజెస్ కూడా పెరిగాయి.
అర్థికంగా బలహీన వర్గాలే కాదు ..ధనిక సంప్రదాయవాద కుటుంబాలలోనూ ఇదే పరిస్థితి. వీలైనంత త్వరగా ఆడపిల్ల పెళ్లి చేసి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయికి ఉన్నట్టుండి ఏకపక్షంగా పెళ్లి ఫిక్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.