ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. మొదటి దశ పోలింగ్‌కు మరో పక్షం రోజులే ఉన్నాయి. దాంతో పార్టీలు ప్రచార వేగం పెంచాయి. ప్రస్తుత పబ్లిక్ మూడ్ ను బట్టి ఈ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ఎస్పీగా కనిపిస్తున్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలను ఓటర్లు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదనే అనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు తమ బేస్ ఓటు దక్కించుకుంటే అదే పదివేలు.
2017 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీకి 22.23 శాతం, కాంగ్రెస్ కు 6.25 శాతం ఓటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఎస్పీ , బీజేపీ మధ్య బహుముఖ పోటీ ఏర్పడటంతో అది దక్కక పోవచ్చు. బీఎస్పీ ఓట్లు ఈ సారి సగానికి సగం తగ్గుతాయని, కాంగ్రెస్ ఓటు శాతం ఎలా ఉంటుందో చెప్పటం కష్టమని పరిశీలకులు అంటున్నారు.
ప్రియాంక ప్రచారంతో ఈసారి కాంగ్రెస్ ఓటింగ్ పెరుగుతుందని విశ్లేషకులు మొదట భావించారు. కానీ రాను రాను పరిస్థితి మారింది.ప్రజలు బీజేపీ, ఎస్పీలలో దేనినో ఒకదానిని ఎంచుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి కాంగ్రెస్ ఓటింగ్ ఈ సారి 6 శాతం వచ్చినా గొప్ప విషయమే అంటున్నారు.
ప్రియాంక ఈసారి తెలివిగా మహిళా ఓటర్లపై ప్రధానంగా దృష్టి పెట్టారు. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. అది కాంగ్రెస్‌కు ఎంతవరకు అనుకూలంగా పనిచేస్తుందో చూడాల్సి వుంది.
మరోవైపు, ప్రస్తుత ప్రచార సరళి చూస్తుంటే సమాజ్‌వాదీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ర్యాలీలలకు జనం పోటెత్తుతున్నారు. మాయావతి పెద్దగా కనిపించటం లేదు. కాని ప్రియాంకకు ఇది పరీక్షా సమయం. కాంగ్రెస్ భవిష్యత్తును ఈ ఎన్నికలు ఫలితాలు తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి.
ఏదేమైనా, యూపీ ఎన్నికల్లో హస్తం పార్టీకి పెద్దగా సీట్లు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఓ జాతీయ పార్టీగా బీజేపీకి 2024లో యూపీలో కొద్దో గొప్పో అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు మెరుగుపడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓట్ బేస్ పెంచుకోవాల్సి వుంటుంది. ఇప్పుడు ఎన్నికలు బీజేపీ వర్సెస్ ఎస్పీగా మారినట్టే.. ..లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారాలంటే ఇప్పుడు ఆ పార్టీ మెరుగైన ప్రదర్శన ఇవ్వాలి. ప్రియాంక ప్రయత్నం కూడా అదే.
ప్రస్తుతం ప్రియాంకా గాంధృ వ్యూహాత్మకంగా పబ్లిక్‌లో తన విజిబులిటీని పెంచుకుంటున్నారు. మహిళా ఓటర్లు లక్ష్యంగా ఆమె ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. జాతీయ మీడియాతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. మొత్తం మీద యూపీ కాంగ్రెస్ ముఖచిత్రంగా మారారామె.
ఇదిలావుంటే, తానే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని అంటూ గత శుక్రవారం ప్రియాంక బాంబు పేల్చారు. అయితే ఆ వ్యాఖ్యలు సరదాగా చేసినవంటూ తరువాత మాట మార్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రియాంకపై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఆమెను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్‌గా ప్రకటిస్తే పార్టీకి పెద్దగా ఒరిగేదీమీ ఉండదు. ఘోర పరాభవం ఎదురైతే ఆ భారాన్ని ఆమే మోయాల్పి వుంటుంది. అన్న రహుల్ మాదిరిగా ఓటమి ముద్ర పడుతుంది. అందుకే ప్రియాంకా గాంధీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఐతే, ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలను ప్రియాంక కొట్టి పారేయటం లేదు. పోటీ చేస్తారా? ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో ఐదు పర్యాయాలు అధికారం చలాయించిన హస్తం పార్టీ గత మూడు దశాబ్ధాల్లో తీవ్ర పతనావస్థకు చేరింది. 2017 ఎన్నికల్లో కేవలం ఏడంటే ఏడు సీట్లు గెలిచింది. యూపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి నిలబెట్టే గురుతర బాధ్యత ప్రియాంక మీద ఉంది.
2019 నుంచి ప్రియాంక యూపీ కాంగ్రెస్‌లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆమె మొదట తూర్పు యూపీకి మాత్రమే ఇంఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. గత ఏడాది రాష్ట్ర కాంగ్రెస్ మొత్తాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కార్యకర్తలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తున్నారు. అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనల్లో పాల్గొన్నారు.
ప్రియాంక కష్టం ఫలిస్తుందా లేదా అనేది ఈ ఎన్నికల తరువాత తెలుస్తుంది. ఆమె సారధ్యంలో పార్టీ ఏమాత్రం పుంజుకున్నా హస్తంలో కొత్త ఆశలు చిగురిస్తాయి!!
