Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ వేవ్‌ మొదలైంది..జాగ్రత్తలే శ్రీరామ రక్ష!

ఊహించినట్టే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దాంతో ప్రపంచ దేశాలు మారోసారి ప్రమాదంలో పడ్డాయి. దీని మూలంగా భారత్‌లో కారోనా థర్డ్‌వేవ్‌ మొదలైంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో అధిక సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. రానున్న రోజుల్లో తీవ్ర రూపం దాలుస్తుందనటానికి ఇది సంకేతం. ఐతే, థర్డ్ వేవ్‌ని భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కోగలదా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే సెకండ్‌ వేవ్‌ నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఒమిక్రాన్‌ ముంగిట నిల్చున్న తరుణంలో దీనిని ఎదుర్కోవటంలో భారత్‌ ఎంత వరకు సిద్ధంగా ఉన్నదో చూడాల్సిన సమయం వచ్చింది.

ఈ నెలలో ప్రచురితమైన గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌ 2021 లో భారత్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. కరోనా సెకండ్ వేళ వేగంగా స్పందించకపోవటమే దీనికి కారణం. గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌ 2021 లో ప్రధానమైన “వేగవంతమైన ప్రతిస్పందన” ఇండికేటర్‌లో భారత్‌ స్కోరు 11.8 పాయింట్లు పడిపోయింది. ప్రస్తుత అది 30.3 గా ఉంది. ప్రపంచ కనీస సగటు 37.6 కంటే కూడా ఇది చాలా తక్కువ.

ఆగస్టు 2020-జూన్ 2021 మధ్య సేకరించిన సమాచారం ఆధారంగా ఇండెక్స్‌ని రూపొందించార. ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ మధ్య కరోనా సెకండ్‌ వేవ్‌ భారత ఆరోగ్యవ్యవస్థను అతలాకుతలం చేసింది. ఆస్పత్రలులు కిక్కిరిపోయాయి.. అత్యవసర మందుల కొరత, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవటంతో అధిక మరణాలు సంభవించాయి. కాబట్టి ఒమిక్రాన్‌ వేళ ప్రపంచం మొత్తం మరోసారి భారత్ వైపు చూస్తోంది.

భారత్‌లో థర్డ్‌వేవ్‌ ఎప్పుడైనా రావచ్చని నిపుణులు చెపుతూ వచ్చారు. వెనకా ముందు కావచ్చు కానీ దాని నుంచి భారత్ తప్పించుకోలేదని హెచ్చరించారు. కాబట్టి సెకండ్‌ వేవ్‌ కోసం ఏర్పాటు చేసిన మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అలాగే ఉంచాలని, కోవిడ్‌ ఆస్పత్రులను మూసివేయ వద్దని వైద్య నిపుణులు ప్రభుత్వాలకు సూచించారు. ఒమిక్రాన్‌ రూపంలో ఇప్పుడు థర్డ్‌వేవ్‌ రానేవచ్చింది.

కరోనా మళ్లీ విజృంభిస్తుందని డిసెంబర్‌ 10న కేంద్ర ప్రభుత్వం తొలిసారి ప్రకటించింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులు ఈ అంశాన్ని పలుమార్లు లేవనెత్తారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ ఫేజ్-II కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.1827.78 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. సర్కార్‌ చర్యల ఫలితంగా కోవిడ్ పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్‌ నిల్వలు గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఈ నవంబర్‌ మధ్య 28 శాతం పెరిగింది. ఉత్పత్తి సామర్ధ్యం రోజుకు 6,876 టన్నుల నుంచి 8,778 టన్నులకు పెరిగిందని డిసెంబర్ 3న లోక్‌సభకు ప్రభుత్వం వివరించింది.1,563 ప్రెజర్ స్వింగ్ అడ్‌సార్ప్‌షన్‌-పీఎస్‌ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్లు వివిధ రాష్ట్రాలలో మెడికల్-గ్రేడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి.

ప్రస్తుతం 22 రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాలలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తరించింది. కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య వెయ్యికి చేరువవుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో ఒమిక్రాన్‌ కేసులు భారీగా బయటపడుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. పరిస్థితి అదుపు తప్పకుండా అస్సాం, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూలు విధించాయి. రెస్టారెంట్లు, జిమ్‌లను 50 శాతం సామర్థ్యంతో అనుమతిస్తున్నారు.కోవిడ్‌ ప్రోటోకాల్‌ పటించని వారికి భారీగా జరిమానా విధిస్తున్నారు.

మరోవైపు, థర్డ్‌వేవ్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే నెల రోజులు అత్యంత కీలకమని పేర్కొంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు చూడబోతున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ చాలా వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి థర్డ్‌ వేవ్‌లో కేస్‌ లోడ్‌ తొలి రెండు దశల కన్నా ఐదారు రెట్లు ఎక్కవు ఉండే అవకాశం ఉంది. నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా జనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది గుమిగూడుతారు కాబట్టి సంక్రాంతి తరువాత కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందని తెలంగాణ వైద్య విభాగం అంచనా వేస్తోంది.

వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఒమిక్రాన్‌ సంక్రమించకుండా ఉండదు. అమెరికా, బ్రిటన్‌ అనుభవాలు ఇదే చెపుతున్నాయి. అయితే టీకా తీసుకుంటే మరణించే ప్రమాదం తగ్గుతుంది. అందుకే ప్రజలు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. టీకా తీసుకుని .. కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటిస్తే కొత్త వేరియంట్‌కు భయపడాల్సిన అవసరం లేదు.

మరోవైపు, సెకండ్‌ వేవ్‌లా కాకుండా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కాస్త ముందే కళ్లు తెరిచాయి. తగిన చర్యలు తీసుకుంటున్నాయి. నిజానికి థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైంది. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందన్నదే ఇప్పుడు చూడాల్సిన అంశం. 90 శాతం మందిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడం లేదు. లక్షణాలు లేనపుడు టెస్ట్ చేయాల్సిన పరిస్థితే తలెత్తదు.

ఏదేమైనా కొత్త సంవత్సరం సంబరాల వేళ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మాస్కులు ..శానిటైజర్లు ..భౌతిక దూరం ..ఈ మూడే మిమ్మల్ని ఒమిక్రాన్‌ నుంచి దూరంగా ఉంచుతాయని మర్చిపోవద్దు!!

Exit mobile version