Site icon NTV Telugu

NTV Specials : పునఃపరిశీలన సరే .. దేశద్రోహం కేసుల మాటేమిటి?

Supreme Court

Supreme Court

దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చట్టాన్ని పునఃసమీక్షిస్తామని ..అప్పటి వరకు న్యాయస్థానం దీనిపై తన సమయాన్ని వెచ్చించవద్దని సోమవారం కేంద్రం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కేంద్రంపై పలు ప్రశ్నలు సంధించటంతో పాటు కొన్ని సూచనలు కూడా చేసింది.

దేశద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించే వరకు పౌరుల ప్రయోజనాల పరిరక్షణపై కేంద్రం స్పందనను సుప్రీం కోరింది. అంతేగాకుండా, ఈ పునఃసమీక్ష పూర్తయ్యే వరకు దానికి సంబంధించిన కేసులను నిలిపివేయవచ్చో లేదో ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు కోరింది.

కింది స్థాయాలో దేశద్రోహం చట్టంతో ఎవరు డీల్‌ చేస్తున్నారు? ఈ చట్టం పునఃపరిశీలన ప్రక్రియ ముగిసే వరకు ప్రొసీడింగ్స్‌ నిలిపివేయమని పోలీసు అధికారులు, స్థానిక పోలీస్ స్టేషన్లను ఎందుకు ఆదేశించలేరు అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. అలాగే, మూడు-నాలుగు నెలలలో దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలించే పనిని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

ఐపీసీ సెక్షన్ 124ఏపై సమీక్ష పూర్తయ్యే వరకు ప్రస్తుతం విచారణలో ఉన్న రాజద్రోహం కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించాలని భావిస్తోందా? లేదా? బుధవారం నాటికి తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించేంత వరకు విచారణను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

ఇదిలావుంటే, దేశద్రోహం కేసుపై ఎందుకు ఈ స్థాయిలో చర్చ జరుగుతోందో తెలుసుకోవాలి. వాస్తవానికి దీనిపై చర్చ ఇప్పుడే కొత్త కాదు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. కొన్ని సందర్బాలలో ఇది అధికంగా జనం దృష్టిని ఆకర్షిస్తుంది. 2016లో ఢిల్లీ లోని జెఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌తో పాటు మరి కొందరిపై దేశద్రోహం కేసు నమోదైన సందర్భంలో ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా విశేష చర్చ జరిగింది.

ఇప్పటి వరకు ఎంతోమందిపై ఈ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణా వంటివారిపై ఈ సెక్షన్ కింద రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, ఎప్పుడో 160 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ వలసపాలకులు చేసిన ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌ ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తోంది.

నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి, అంటే 2014 నుంచి దేశంలో దేశద్రోహం కేసులు పెరిగాయి. 2010- 2021 మధ్య దేశంలో 13,000 దేశద్రోహ కేసులు నమోదయ్యాయి. అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ విధానాలను విమర్శించినందుకు గాను 405 మందిపై పాలకులు దేశద్రోహం నేరం మోపారు. వాటిలో ల్లో 96 శాతం కేసులు 2014లో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత నమోదయ్యాయి.

ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారని, ఆయనను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ 149 మందిపై ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌పై ఆరోపణలు చేశారని 144 మందిపై దేశద్రోహం కేసు పెట్టారు. ఇక, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాం 2010- 2014 మధ్య వార్షిక సగటుతో పోలిస్తే 2014- 2020 మధ్య ప్రతి సంవత్సరం నమోదయ్యే దేశద్రోహం కేసుల సంఖ్య 28 శాతం పెరిగింది. సోషల్‌ మీడియాలో జాతి వ్యతిరేక, పాకిస్తాన్‌ అనుకూల రాతలు రాశారంటూ 105 మందిపై ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రయోగించింది. ఐతే, 2010- 2013 మధ్య యూపీఏ హయాంలో అలాంటి కేసు కేవలం ఒక్కటి మాత్రమే నమోదైంది.

2010 – 2014 మధ్య యూపీఏ యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన 279 దేశద్రోహం కేసులలో 39 శాతం కేసులు తమిళనాడులోని కుదంకులం న్యూక్లియర్‌ ప్లాంట్‌ ఏర్పాటు వ్యతిరేక ఆందోళనలో పాల్గొన్న వారిపై, అలాగే రెడ్‌ కారిడార్‌లోని మావోయిస్టులపై నమోదయ్యాయి. ఐతే, 2014-2021 మధ్య నమోదైన 519 సెడిషన్‌ కేసులలో చాలా వరకు ఉద్యమకారులు, జర్నలిస్టులు, మేథావులపై పెట్టినవే.

2014 నుండి దేశద్రోహం కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1962 నాటిలో సుప్రీంకోర్టు ఇచ్చిన కేదార్‌నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో తీర్పుకు విరుద్ధంగా ఈ కేసులు ఉన్నాయి. వాక్‌ స్వాతంత్ర్య హక్కుకు పరిమితిని విధించే ఈ సెక్షన్‌ సరైనదేనని ఆనాడు సుప్రీంకోర్టు ధర్మాసంన తీర్పిచ్చింది. ఐతే, ఇదే సమయంలో ఈ సెక్షన్‌ను వర్తింప చేయటానికి 1941లో నాటి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అభిప్రాయాన్ని ఆమోదించింది. ఇష్టం వచ్చినట్టు ఈ సెక్షన్‌ కింద కేసులు పెట్టే అవకాశం ఇవ్వలేదు.

ఈ చట్టాన్ని వర్తింపచేయాలంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగించటం, హింసకు ప్రేరేపించే తీవ్రత వారి చర్యలలో, మాటలలో కనిపించినపుడే వారు దోషులవుతారు. కేదార్‌నాథ్ తన ప్రసంగంలో – విప్లవాగ్నిలో పెట్టుబడిదారులు, జమీందార్లు, దేశాన్ని లూటీ చేయటమే పనిగా పెట్టుకున్న భారత కాంగ్రెస్ నాయకులు బూడిదవుతారు..అనే మాటల ద్వారా ప్రభుత్వాన్ని హింసాయుత మార్గంలో కూలదోసే ఆలోచనను ప్రేరేపించారు కనుక ఆయనను దేశద్రోహం ఆరోపణలో దోషిగా నిర్ధారించింది. కానీ ఇప్పడు, చిన్న చిన్న కారణాలతో కూడా దేశద్రోహ నేరం మోపుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నప్పటికీ దోషులుగా తేలే వారు చాలా తక్కువ. కానీ, ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు వారు సగటున 50 నుంచి 200 రోజులు జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ట్రయల్ కోర్టుల్లో బెయిల్‌ లభించటం కన్నా తిరస్కరించటమే ఎక్కువ. కానీ, హైకోర్టులో మాత్రం దాదాపు అన్ని కేసులలో బెయిల్‌ లభిస్తోంది.

2014-19 మధ్య ‘దేశద్రోహం’ చట్టం కింద 326 కేసులు నమోదు కాగా నేర నిరూపణ చేసింది కేవలం ఆరుగురి పైనే. అదే కాలంలో అస్సాంలో 54 కేసులు నమోదు కాగా వాటిలో 26 కేసుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేసి 25 కేసుల్లో విచారణ పూర్తి చేశారు. కానీ వీటిలో ఏ కేసులోనూ నేర నిరూపణ జరగలేదు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనిని బట్టి ‘దేశద్రోహం ఏ స్థాయాలో దుర్వినియోగమవుతోందో అర్థమవుతోంది. స్వాతంత్రోద్యమంలో గాంధీజీ, బాలగంగాధర్‌ తిలక్‌ వంటి వారిపై నాటి బ్రిటిష్‌ సర్కార్‌ ఈ చట్టాన్ని దుర్వినియోగపర్చింది.

పూర్తి స్థాయిలో దుర్వినియోగం అవుతున్నందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. ఈ చట్టాన్ని తెచ్చిన బ్రిటన్‌లో కూడా ఇది రద్దయింది. కానీ, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల తరువాత కూడా మన దేశంలో అది మనుగడలో ఉంది. అందుకే, మనకు దేశద్రోహ చట్టం అవసరమా అని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఏనాడో ప్రశ్నించింది. కానీ, రద్దు చేయాలంటే మన ప్రభుత్వాలకే మనసు రావటం లేదు. మోడీ సర్కార్ ఈ చట్టాన్ని పునఃపరిశీలించి ఏం చెబుతుందో తెలియాలంటే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే!!

Exit mobile version