Site icon NTV Telugu

NTV Specials : కాంగ్రెస్‌ను పీకే పట్టాలెక్కిస్తాడా..

congress flag

దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ లేనంతగా ఇప్పుడు డీలా పడింది. దాని పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఇదిలాగే కొనసాగితే అది వామపక్షాల సరసన చేరటం ఖాయం. పార్టీని నడిపిస్తున్న గాంధీ ఫ్యామిలీకి ఇది తెలియంది కాదు. కానీ తెలిసినా ఏమీ చేయకపోవటం వారి ప్రత్యేకత. మొదటి నుంచీ దిద్దుబాటు చర్యలు తీసుకుని వుంటే పరస్థితి ఇంతలా దిగజారేది కాదేమో.

అధికారం దానంతటదే తమ చెంతకు నడుచుకుంటూ వస్తుందనే భావనలో కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పటి వరకు ఉంది. కనుక, ఇప్పుడు వారు తలుచుకున్నా పార్టీ పునరుత్థానం అంత సులభం కాకపోవచ్చు. ముఖ్యంగా అది గాంధీల శక్తికి మించిన పని. ఎందుకంటే, సోనియా ఆరోగ్యం అంతంత మాత్రమే. మునపటిలా చురుకుగా ఆమె పార్టీ వ్యవహరాలలో పాల్గొనటం లేదు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు సీజనల్‌ పొలిటిషీయన్స్‌ అనే పేరుంది. ఎన్నికల సమయంలో హడావుడి చేసి వెళుతుంటారు. అలాగే, రాహుల్‌ చేస్తున్న ప్రయోగాలలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా సక్సెస్‌ కాలేదు.ఇటీవల పంజాబ్‌, అంతకు ముందు మధ్యప్రదేశ్ అందుకు మంచి ఉదాహరణలు.

కళ్లముందే పార్టీ తుడిచిపెట్టుకుపోతుంటే చూడటం మినహా గాంధీలు ఏమీ చేయలేకపోతున్నారు. పోనీ ఎవరైనా చేస్తాం అంటే వారినీ చేయనీయరు. పార్టీ సారధ్య బాధ్యతలు వేరొకరికి అప్పగించటం వారికి నచ్చదు. ఏం చేసినా తామే చేయాలనే మైండ్‌ సెట్‌ వారిది. అలాంటప్పుడు జవసత్వాలు ఉడిగిన ఈ వృద్ధ పార్టీ ఎలా శక్తివంతమవుతుంది?

ఇటీవల దెబ్బ మీద దెబ్బ తగులుతుండటంతో గాంధీలకు తత్వం పూర్తిగా బోధపడింది. ఆలస్యంగా అయినా పార్టీ మరమ్మత్తుల పనికి ఉపక్రమించింది. అందులో భాగంగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ఎడతెగని మంతనాలు సాగిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ రోగం ఏమిటో ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలిసివుండదు. ఎందుకంటే ఆయన దేశంలోని రాజకీయ పార్టీలను నిరంతరం అధ్యయనం చేస్తారు. కాంగ్రెస్ డీలా పడిందే తప్ప దేశంలోని ప్రతి మూలనా ఇంకా సజీవంగానే ఉంది. చికిత్స అందిస్తే లేచి పరిగెడుతుందనేది ఆయన నమ్మకం.

లేడికి లేచిందే పరుగులా కాకుండా..కాంగ్రెస్‌ తిరిగి ఉరుకులు పెట్టడానికి కొంత సమయం పట్టవచ్చు. అందుకు అవసరమైన ప్రణాళికలు పీకే దగ్గర రెడీగా ఉన్నాయి. కానీ ఎందుకో డీల్‌ కుదరటంలో జాప్యం జరిగింది. కాంగ్రెస్‌తో పని చేయాలని పీకే గతంలో కూడా ప్రయత్నించారు. సంప్రదింపులు నడిచాయి కానీ వర్కవుట్‌ కాలేదు. పీకే మరీ ఎక్కువ ఆశిస్తున్నారని కాంగ్రెస్‌ అప్పుడు ఆయనను తిరస్కరించినట్టు వార్తలొచ్చాయి.

చర్చలు విఫలం అయిన తరువాత కాంగ్రెస్‌ పార్టీపై, రాహుల్‌పై వరుసగా విమర్శనాస్త్రాలు సంధించారు పీకే. విమర్శలతో పాటు.. ఏం చేస్తే కాంగ్రెస్‌ బాగుపడుతుందనే దానిపై తన ఇంటర్వ్యూలతో తరచూ హింట్‌ ఇచ్చేవాడు. ఎంత బలహీన పడినప్పటికీ బీజేపీని ఓడించే శక్తి ఇప్పటికీ కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని ప్రశాంత్‌ కిశోర్‌ బలంగా నమ్ముతారు. దానికి సంబంధించిన లెక్కలు ఆయన వద్ద ఉన్నాయి. అందుకే ఆయన కాంగ్రెస్‌ పార్టీ తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నాడు.

కన్సల్టంట్‌గా కాకుండా పార్టీలో చేరి కీలక స్థానం దక్కించుకోవాలని పీకే బావించారు. ఇప్పుడు సోనియా అందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్‌లో ఆయన చేరిక దాదాపు ఖాయమైనట్టేనిన పార్టీ అత్యున్నత వర్గాలు అంటున్నారు. అదే నిజమైతూ ఇక అధికార ప్రకటనే తరువాయి. కాంగ్రెస్ పున‌రుత్థానం కొరకు ఆయన రూపొందించిన 80 పేజీల‌ ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్‌ను అధిష్ఠానానికి స‌మ‌ర్పించారు. 600 స్లయిడ్‌లతో కూడిన ఈ ప్రణాళికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మొత్తం మీద పీకే ప్లాన్‌తో సోనియా గాంధీ పూర్తిగా ఏకీభవించారని తెలుస్తోంది.

ఇంతకూ కాంగ్రెస్‌ను బాగు చేయటానికి పీకే చెప్పిన మొదటి మంత్రం అధ్యక్ష బాధ్యత‌ల నుంచి గాంధీలు త‌ప్పుకోవటం. సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీ పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టకూడదని స్పష్టంగా చెప్పారు. గాంధీయేతరులకు అధ్యక్ష బాధ్యత‌లు అప్పజెప్పాల‌ని సూచించారు. ఐతే, గాంధీ ఫ్యామిలీ అందుకు ఒప్పుకుంటుందా? అంటే ..ఖచ్చితంగా ఒప్పుకోదు..కనుక వీరికి కూడా పార్టీలో ప్రత్యేక బాధ్యతలను సూచించినట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ బాధ్యత‌ల్లో వుండాల‌ని, రాహుల్ గాంధీ పార్లమెంట్ బోర్డు అధ్యక్షుడిగా, ప్రియాంక ప్రధాన కార్యద‌ర్శుల‌కు స‌మ‌న్వయ క‌ర్తగా వుంటే మేలని పీకే బావించారు.

దేశంలో పార్టీ పరిస్థితిని పూర్తిగా స్డడీచేసిన ఆయన ద‌క్షిణాది, తూర్పు రాష్ట్రాల లోక్‌సభ సీట్లపై ఎక్కువ ఫోక‌స్ పెట్టాల‌ని ప్రతిపాదించారు. ఈ ప్రాంతాల్లో బీజేపీ బ‌ల‌హీనంగా ఉండటం కాంగ్రెస్‌కు కలిసివస్తుంది. వంశ‌పారంప‌ర్య ప‌ద్ధతుల్లో కాకుండా ప్రజాస్వామ్య ప‌ద్ధతిలో పార్టీని న‌డ‌పాల‌ంటున్నారాయన. డైనాస్టిక్‌ పాలిటిక్స్‌, కరప్ట్‌ పాలిటిక్స్‌కు తాము పూర్తి వ్యతిరేక‌మ‌ని ప్రజ‌ల‌కు సంకేతాలిస్తే బాగుంటుంద‌న పీకే సూచించారు.

1984 నుంచి 2019 వరకు కాంగ్రెస్‌ పతనానికి గల కారణాలు పూర్తిగా అధ్యయనం చేసి ప్రణాళికలో పొందుపరిచాడు. పార్టీ వ్యవస్థాపక సిద్ధాంతాలకు కట్టుబడటం, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలతో బలమైన సంస్థాగత సైన్యం, మీడియా, డిజిటల్ ప్రచారానికి పటిష్టమైన యంత్రాంగం కావాలని ప్రణాళికలో సూచించినట్టు సమాచారం. 2024 ఎన్నికల్లో 365-370 లోక్‌సభ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని, మొదటి, రెండో స్థానంలో ఉన్న రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం. ఏదేమైనా పీకే వంటి వ్యూహకర్త కాంగ్రెస్‌లో చేరటం భవిష్యత ఎన్నికల రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టటం ఖాయం.

 

Exit mobile version