Site icon NTV Telugu

Mumtaz Hockey : కూరగాయలు అమ్ముతున్న తల్లి… హాకీలో మెరుస్తున్న కూతురు!

Mumtaz Hockey Player

Mumtaz

టాలెంట్‌ ఏ ఒక్కరి సొంతం కాదు. దానికి పేదవారు…ధనవంతులతో పని లేదు. పట్టుదల..కష్టపడే తత్వం ఉంటే చాలు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జూనియర్‌ మహిళల హాకీప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతున్న ముంతాజ్‌ కథ అలాంటిదే.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముంతాజ్‌ది ఓ నిరుపేద కుటుంబం. ఆరుగురు అక్కా చెల్లెళ్లు..ఒక సోదరుడు. తండ్రి సంపాదన అంతంత మాత్రమే. కుటుంబం గడవటానికి తల్లి కైసర్‌ జహాన్ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముతుంది. శుక్రవారం దక్షిణ కొరియాపై ముంతాజ్‌ విజృంభించి ఆడుతున్న సమయంలో ..ఇక్కడ క్నోలోని తోప్‌ఖానా బజార్‌లో కైసర్‌ జహాన్‌ ఎర్రటి ఎండలో తన కూరగాయల బండి నిలిపి గిరాకీ కోసం చూస్తోంది.

ముంతాజ్‌ చేసిన సూపర్‌ గోల్‌ దక్షిణ కొరియాపై 3-0 విజయానికి తొలి మెట్టు. ఈ గెలుపుతో భారత జట్టు రెండో సారి ఈ టోర్నీ సెమీస్‌కు చేరింది. కానీ కైసర్ జహాన్ తన 19 ఏళ్ల కుమార్తె వీరోచిత ప్రదర్శనను ప్రత్యక్షంగా చూడలేకపోయింది. కూతురు గొప్పగా ఆడుతుంటే చూడాలని ఏ తల్లికి మాత్రం ఉండదు? కానీ కుటుంబ పోషణ కూడా ముఖ్యమే కదా అంటారామె. భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ వస్తాయంటూ సరిపెట్టుకున్నారామె. తన కూతురు హాకీలో చాలా ఎత్తుకు వెళుతుందని కైసర్‌ జహాన్‌ నమ్మకం.

ముంతాజ్‌పై ఆమె తల్లికి ఉన్న విశ్వాసం సరైనదే. ఆమెలోని వేగం, బంతిని వేటాడే సామర్థ్యం జూనియర్‌ జట్టులో ఇప్పటికే ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో విజయాలు సొంతం చేసుకుంది. ప్రతి మ్యాచ్‌లోనూ ముంతాజ్‌ భారీ సహకారం అందించింది. టోర్నీలో ఇప్పటి వరకు ఆరు గోల్స్‌ చేసింది. టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన మూడో క్రీడాకారిణి ఆమె.

వేల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే గోల్‌ చేసి 5-1 విజయంలో తన వంతు పాత్ర పోషించింది. తరువాత ఫేవరెట్ జర్మనీ పైనా గోల్‌ చేసింది. భారత్‌ 2-1 తో జర్మనీపై గెలిచింది. ఇక మలేషియాపై హ్యాట్రిక్ కొట్టి సంచలనం సృష్టించింది.

శుక్రవారం ముంతాజ్‌ తల్లి కూరగాయలు అమ్మే పనిలో ఉండగా…ఆమె ఐదుగురు అక్కా చెల్లెళ్లు లక్నోలోని తమ ఇంట్లో మొబైల్ లో మ్యాచ్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె తండ్రి హఫీజ్ మసీదులో ఉన్నాడు. ఇప్పుడు తాము ఎంత ఆనందిస్తున్నామో మాటల్లో చెప్పలేమంటున్నారు ముంతాజ్‌ తోబుట్టువులు. ఎందకంటే పూటకడవటమే కష్టంగా ఉన్న రోజుల్లో ఒక అమ్మాయిని ఆటలకు అనుమతించటం పెద్ద సాహసమే. ఆము తల్లిదండ్రులను బంధువులు, ఇరుగు పొరుగు ఎన్నెన్నో మాటలన్నారో ముంతాజ్ అక్క ఫరా ఇంకా మరిచిపోలేదు.

నిజానికి, ముంతాజ్‌ హాకీ ప్లేయర్‌ కావటం అనుకోకుండా జరిగింది. 2013 ప్రాంతంలో ఆమె తన పాఠశాల అథ్లెటిక్స్ జట్టుతో ఆగ్రాలో జరిగిన ఒక పోటీలో పాల్గొంది. ఆ పోటీల స్ప్రింట్స్‌ విభాగంలో ముంతాజ్‌ ఫస్ట్ వచ్చింది. ఆమెను గమనించిన స్థానిక కోచ్‌ ఒకరు హాకీని ఎంచుకోమని సూచించారు.

ముంతాజ్‌ వేగం, ఎనర్జీ హాకీలో బాగా పనికొస్తాయని ఆమె చిన్నప్పటి కోచ్‌లు గుర్తించి ప్రోత్సహించారు. తనలోని హాకీ నైపుణ్యానికి సానబెట్టగలిగితే మంచి క్రీడాకారిణి అవుతుందని భావించారు. ఆగ్రా టోర్నమెంట్ తర్వాత లక్నోలోని ప్రసిద్ధ కేడీసింగ్ బాబు స్టేడియం అకాడమీలో కొన్ని నెలల పాటు ముంతాజ్ హాకీలో శిక్షణ తీసుకుంది. ట్రయల్స్‌లో సెలక్టర్లను మెప్పించి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికై స్పోర్ట్స్ హాస్టల్‌లో చేరింది. ఇదే ముంతాజ్‌ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌. అప్పటికి ముంతాజ్ వయస్సు కేవలం 13 సంవత్సరాలు. అప్పటి నుంచి ఆమె ఏకైక లక్ష్యం దేశం కోసం ఆడటం. ఇప్పుడు ఆమె తన కలను సాకారం చేసుకుంది.

ముంతాజ్ పుట్టక ముందు ఆమె తండ్రి కుటుంబ పోషణకు రిక్షా తొక్కేవాడు. అయితే వయసు పైబడటంతో రిక్షా లాగే పరిస్థితి లేదని ముంతాజ్‌ మేనమామ గమనించి కూరగాయల బండిని పెట్టించాడు. అదే ఇప్పటికీ ఆ కుటుంబానికి అన్నం పెడుతోంది. ఐతే, తోపుడు బండి ద్వారా వచ్చే ఆదాయం ఆరుగురు ఆడపిల్లల రోజువారీ ఖర్చులు, స్కూల్ ఫీజులకే సరిపోతుంది. హాకీ కిట్‌ను కొనుగోలు చేసే స్థోమత కూడా వారికి లేదు. కోచ్‌లే ముంతాజ్‌కు సహాయం చేసారు.

ముంతాజ్ ఆటను మెరుగుపరచేందుకు కోచ్‌లకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే హాకీ ఆమెకు సహజంగా అబ్బిందని అంటారు వారు. అందుకేనేమో అలవోకగా గోల్స్‌ చేస్తోంది. టోర్నీ తదుపరి మ్యాచ్‌లలో కూడా ముంతాజ్‌ ఇలాగే విజృంభిస్తుందని ఆశిద్దాం.

Exit mobile version