Site icon NTV Telugu

బాబుకు సవాలుగా మారిన ‘కుప్పం’?

కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా తప్ప మరొకటి ఎగిరిన దాఖలాలు లేవు. వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లాలోని పులివెందుల ఎలాగో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలోని కుప్పం కూడా అలాగేనని అందరికీ తెల్సిందే. టీడీపీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ టీడీపీ హవానే కొనసాగుతూ వస్తోంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. కుప్పంలో వైసీపీ క్రమంగా బలపడుతుండగా టీడీపీ బలహీనమవుతోంది. ఈ పరిస్థితి టీడీపీకి, చంద్రబాబు నాయుడికి ఏమాత్రం మంచిదికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కొనసాగింది. చిత్తూరు జిల్లాలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మినహా చిత్తూరు జిల్లా మొత్తాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీనికితోడు ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ హవానే కొనసాగింది. అయితే కొన్ని కారణాల వల్ల రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగలేదు. ఇందులో కుప్పం మున్సిపాలిటీ కూడా ఉంది. త్వరలోనే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీంతో ఈ మున్సిపాలిటీని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందనేది ఆసక్తిని రేపుతోంది. 


చిత్తూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. కుప్పం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వైసీపీనే ఎక్కువ స్థానాలు దక్కించుకుంది. దీంతో కుప్పం మున్సిపాలిటీని కూడా తామే చేజిక్కించుకుంటామనే ధీమాను వైసీపీ నేతలు కనబరుస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు స్థానిక సంస్థల్లో పోయిన పరువును ఈ మున్సిపాలిటీని కాపాడుకోవడం ద్వారా తిరిగి దక్కించుకోవాలని చూస్తున్నారు.

కుప్పం మున్సిపాలిటీ టీడీపీ చేజారితే పార్టీతోపాటు చంద్రబాబు పరువు కూడా పోయే అవకాశం ఉండటంతో నేతలంతా అలర్ట్ అవుతున్నారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కుప్పం స్థానిక టీడీపీ నేతలను పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీని కారణంగానే కుప్పం టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో టీడీపీ బలహీన పడిందనే టాక్ విన్పిస్తోంది. ఈనేపథ్యంలోనే చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే కుప్పంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. మూడురోజులు కుప్పంలోనే తిష్టవేసి చంద్రబాబు పార్టీని గాడినపెట్టనున్నారనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు ఇక్కడ టీడీపీ ఎలాగైనా ఓడించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపాలిటీ ఎవరి వశం అవుతుందనేది సస్పెన్స్ గా మారింది.

Exit mobile version