Site icon NTV Telugu

అస్తమించిన రాజకీయ భీష్ముడు!

సుదీర్ఘ ప్రజా జీవితంలో మచ్చలేని మహోన్నత నాయకుడు కొణిజేటి రోశయ్య. ఆయన మరణంతో రాజకీయాలలో ఒక శకం ముగిసింది. వివాద రహితులుగా, నిష్కళంకితులుగా అందరి మెప్పు పొందిన గొప్ప నేత. నేటి తరం నేతలకు ఆయన ఆదర్శప్రాయుడు. ప్రత్యేకమైన ఆయన కంఠాన్ని తెలుగు ప్రజలు మరిచిపోలేరు.

నేటి రాజకీయ నేతల తీరుచూస్తున్నాం… విమర్శలకు తిట్లకు తేడా లేదు. నేతలు కావాలని వివాదాలు సృష్టించుకుంటున్న రోజులు ఇవి. రోశయ్య నిబద్ధత, క్రమశిక్షణ చూసి వారు ఎంతో నేర్చుకోవాల్సి వుంది. ఆరు దశాబ్ధాల రాజకీయ జీవితంలో చివరకు వరకు ఆదర్శన నేతగానే ఉన్నారు. ఆజాశతృవు ఆయన. మనసెరిగి మసలిన గొప్ప స్నేహశీలి. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి ప్రియమైన సహచరుడు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు క్యాబినెట్‌ బెర్త్‌ ఖాయం.1978 నుంచి 2009 మధ్య ఏర్పడిన దాదాపు అన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో ఆయన మంత్రి. తొలిసారి 1978లో మర్రి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో చోటు లభించింది. తరువాత టి. అంజయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్థన రెడ్డి, వైఎస్‌ రాజశేకర రెడ్డితో కలిసి పనిచేశారు. చెన్నారెడ్డి, విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రెండు సందర్భాలలో రోశయ్య మంత్రి.

ఏ ముఖ్యమంత్రి దగ్గర పని చేసినా రోశయ్య తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పరిపాలనాదక్షుడే కాదు ఆర్థిక నిపుణుడు కూడా. ఆయా ప్రభుత్వాలలో ఆర్థిక శాఖలో గొప్ప సేవలు అందించారు. విద్యార్థి నాయకుడి నుంచి ఉన్నత పదవులకు ఎదిగిన నేత. రైతుబంధు ఆచార్య ఎన్‌ జీ రంగా ప్రియ శిష్యుడు ఆయన. రోశయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయం.

రోశయ్య ఎంతో సౌమ్యులు..సహనశీలి… సాధారణంగా ఆవేశ పడేవారు కాదు. ఆయనది తనదైన రాజకీయ శైలి. గవర్నర్‌గా, సీఎంగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు అలంకరించారు. ఆ పదవులలో రాణించారు. క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో ఆయన పాత్ర అభినందనీయం. పదిహేను సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనుడు. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులే కాని వ్యక్తిగత ప్రత్యర్థులు లేరు.

2009 సెప్టెంబర్‌లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దాంతో, ఆయన వారసుడి ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అందరివాడైన రోశయ్యని ఆ పదవికి ఎంపిక చేసింది. అలా ఆయన సీఎం పదవిలో కూర్చున్నారు. ఐతే అప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉన్నాయి. ఓ వైపు తెలంగాణ ఉద్యమం..మరోవైపు పార్టీ అంతర్గత పోరు. మృధుస్వభావి, సౌమ్యుడైన రోశయ్య ఆ పరిస్థితుల్లో సీఎంగా ఇమడలేకపోయారు. ఆ పదవిలో ఎక్కువ కాలం కొనసాగలేదు. పదవి నుంచి తప్పించమని స్వయంగా అధిష్టానాన్ని కోరారు. అలా ఆయన పదిహేను నెలల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఉన్నారు. తరువాత తమిళనాడు, కర్నాటకలకు గవర్నర్‌గా సేవలందించారు.

కొణిజేటి రోశయ్య జన్మస్థలం గుంటూరు జిల్లా వేమూరు.1933, జూలై 4న జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో చదివారు. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయ జీవితానికి పునాది పడింది. స్వతంత్రపార్టీలో చేరి రైతు నేత ఆచార్య ఎన్‌ జి రంగా వద్ద రాజకీయ శిష్యరికం చేశారు. తరువాత కాంగ్రెస్‌లో ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది.1968లో తొలిసారి శాసన మండలికి ఎన్నికయ్యారు. అనంతరం 1974, 1980లో కూడా ఆయన మండలిలో సభ్యులు. 1985లో ఎన్టీఆర్ శాసనమండలి రద్దు చేయటంతో ఆయన శాసనసభకు పోటీ చేయటం అనివార్యమైంది. అలా తొలిసారి తెనాలి నుంచి శాసనసభకు పోటీ చేసి గెలిచారు. 1998లో నరసరావుపేట నుంచి పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తెలుగు నాట రాజకీయ భీష్ముడు!!

-Dr. Bhonagiri Ramesh Babu

Exit mobile version