NTV Telugu Site icon

Interesting News: ఆసక్తికరమైన వార్త. ఏక్‌నాథ్‌ షిండేను చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు. ఆయనే..

Mani Ek

Mani Ek

Interesting News: మనిషిని పోలిన మనిషి ఉండటం సహజం. ప్రపంచం మొత్తమ్మీద మనలాంటోళ్లు కనీసం ఆరేడుగురైనా ఉంటారట. దీనికి తాజా ఉదాహరణ.. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, తమిళ క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌ మణివణ్ణన్‌. ఏక్‌నాథ్‌ షిండేను చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు. ఎవరా అని ఆసక్తికరంగా వెతికితే మణివణ్ణన్‌ అని తేలింది. ఈ రెండు ముఖాలూ ఒకేలా ఉంటాయి. ఇద్దరిలోనూ ముఖ్యంగా గుబురు గడ్డం ఉంటుంది. కళ్లజోడు కనిపిస్తుంది. కొట్టొచ్చినట్లు కనిపించేలా బొట్టు పెట్టుకుంటారు. హెయిర్‌ స్టైల్‌ సైతం సేమ్‌ ఉంటుంది. ఏక్‌నాథ్‌షిండే లాగే మణివణ్ణన్‌ కూడా మస్తు ట్యాలెంట్‌ ఫెలో.

ఎక్కువగా రజనీకాంత్‌ సినిమాల్లో ఆయన పక్కనే కనిపిస్తుంటాడు. మణివణ్ణన్‌కి తెలుగు డబ్బింగ్‌ మన కోట శ్రీనివాసరావు చెబుతుంటారు. ఇవే కాదు. మణివణ్ణన్‌ గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఆయన కేవలం నటుడు అని మాత్రమే మనం అనుకుంటాం. కానీ 400లకు పైగా సినిమాల్లో నటించిన మణివణ్ణన్‌ 50 సినిమాలకు దర్శకత్వం కూడా చేశాడు. ఇందులో ఎక్కువగా హిట్‌ మూవీసే ఉండటం చెప్పుకోదగ్గ విషయం. కథా రచయితగా, డైలాగ్‌ రైటర్‌గా రాణించాడు. ఏక్‌నాథ్‌ షిండే తొలినాళ్లలో ఆటో డ్రైవర్‌గా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. మణివణ్ణన్‌ కూడా అంతే.

Viral News: మోడీజీ.. మీ వల్లే మా అమ్మ నన్ను కొట్టింది. ఒకటో తరగతి చిన్నారి లేఖ వైరల్‌.

సినిమాల్లో నటించి తర్వాత పాలిటిక్స్‌లోకి ప్రవేశించాడు. డీఎంకే పార్టీతోపాటు నామ్‌ తమిలార్‌ కచ్చి (ఎన్‌టీకే) అనే పార్టీలోనూ పనిచేశాడు. మణివణ్ణన్‌ తరచూ కమెడియన్‌గా నటించాడు. ప్రతినాయక పాత్రలనూ పండించాడు. మణివణ్ణన్‌ రీల్‌ లైఫ్‌లో విలన్‌గా కనిపిస్తే ఏక్‌నాథ్‌ షిండే రియల్‌ లైఫ్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి విలన్‌గా మారిపోయాడు. ఆయన చేతిలో నుంచి అధికారాన్ని లాగేసుకున్నాడు. దానికి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన తప్పులు కూడా కారణమే అనుకోండి. అది వేరే విషయం. ఏక్‌నాథ్‌ షిండేకి మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాల పట్ల ఎంతో నిబద్ధత ఉంది. నిజాయితీ కూడా ప్రదర్శించాడు.

ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచాక ఆ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకోకపోవటం ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన తప్పు అని ఏక్‌నాథ్‌ షిండే పదే పదే చెబుతున్నాడు. రాజకీయంగా ఏక్‌నాథ్‌ షిండేకి ఎలాంటి భావాలైతే ఉన్నాయో మణివణ్ణన్‌కి కూడా తమిళనాడు ప్రజల ప్రయోజనాల పట్ల అలాంటి ఫీలింగ్సే ఉండేవి. తమిళ ఈలానికి ఆయన బలమైన మద్దతుదారుడు. ఈలం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించాడు. శారీరకంగా, ఆలోచనల పరంగా ఒకే పోలికలు ఉన్న వీళ్లిద్దరూ ప్రముఖులే కావటం గమనార్హం. ఇద్దరూ ప్రజల దృష్టిని ఆకర్షించారు.

కాకపోతే మణివణ్ణన్‌ ప్రస్తుతం భౌతికంగా మన మధ్యన లేరు. 2013లో 59 ఏళ్లకే చనిపోయారు. నిన్నే (జూలై 31) ఆయన జయంతి. ఇక ఏక్‌నాథ్‌ షిండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టి నెల రోజుల కిందట బాగా వార్తల్లో నిలిచారు. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయారు. శివసేన నేత సంజయ్‌ రౌత్‌ని ఈడీ అరెస్టు చేసిన సందర్భంగా నిన్న మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. సంజయ్‌ రౌత్‌ నిర్దోసి అయితే ఈడీని చూసి ఎందుకు భయపడుతున్నాడు అంటూ ఆయన్ని మరింత రెచ్చగొట్టాడు.