తెలంగాణలో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న ఏకైక నియోజకవర్గం హుజూరాబాద్. గడిచిన ఐదు నెలలుగా ఈ నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గెలుపు ఎవరి పక్షాన నిలుస్తుందనేది ఉత్కంఠత నెలకొంది. దేశంలో అత్యంత క్లాస్టీ ఉప ఎన్నిక హుజూరాబాద్ నిలుస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా పారామిలిటరీ బలగాల విషయంలో హుజూరాబాద్ సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఆసక్తిని రేపుతోంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో మోహరించిన బలగాలను పరిశీలిస్తే సాధారణ ఎన్నికలకు మించి పారామిలిటరీ బలగాలు దిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో పారా మిలిటరీ బలగాలు రావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 13 నియోజకవర్గాలుండగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తంగా 17 కంపెనీల పారామిలిటరీ బలగాలు మాత్రమే వచ్చాయి. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఏకంగా 20కంపెనీల బలగాలను ఈసీ పంపించడం విశేషం.
జిల్లాలోని 13నియోజకవర్గాల ఎన్నికల నిర్వహాణ కోసం 17కంపెనీల బలగాలు గతంలో అవసరం పడగా ఇప్పుడు ఒక్క హుజూరాబాద్ కే అదనంగా మరో 3కంపెనీల బలగాలు రావడం గమనార్హం. జిల్లాలో నక్సల్స్ ప్రాబల్యం ఉన్న సమయంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇంత పెద్దమొత్తంలో కేంద్ర బలగాలు రాలేదని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. అయితే ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకే ఈసీ 20కంపెనీల బలగాలను దింపినట్లు తెలుస్తోంది. ఇది ఒకరకంగా రికార్డే.
ఇదిలా ఉంటే హుజూరాబాద్ లో ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీల ముఖ్యనేతలంతా హుజూరాబాద్ లోనే తిష్టవేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా నేతలంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటుండటంతో నియోజకవర్గంలో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. పలుచోట్ల ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. వీటికి ఆదిలోనే బ్రేక్ వేయాలనే ఉద్దేశ్యంతోనే ఈసీ భారీసంఖ్యలో కేంద్ర బలగాలను హుజూరాబాద్ కు రప్పించినట్లు తెలుస్తోంది.
