Site icon NTV Telugu

పొలికల్ గేమ్ లో ‘బలి’ అవుతుందెవరు?

మన సినిమాల్లో హీరోలు, విలన్లు ఎలాగైతే ఉంటారో.. పురాణాల్లోనూ దేవతలు, రాక్షసులు ఉండేవారు. వీరికి ఒకరంటే ఒకరు పడదు. ఎవరైనా మంచి పని చేస్తే ఇంకొకరికి అసలు నచ్చదు. దీంతో వీరి మధ్య నిత్యం ఫైట్ సీన్లు జరుగుతూనే ఉంటాయి. పురాణాల్లో అయితే దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధాలు జరిగినప్పుడు త్రిమూర్తులు(బ్రహ్మ, విష్ణు, శివుడు) ఏదోరకంగా సర్దిచెప్పేవారు. విన్నారా? ఒకే.. లేకుంటే తమ శక్తులతో అంతమొందించి లోకకల్యాణం చేసేవాళ్లు. మన సినిమాల్లోనూ అంతే. హీరో క్యారెక్టర్ విలన్ తో చివరికంటూ పోరాడుతాడు. క్లైమాక్స్ లో విలన్ మారడా? ఒకే.. లేకుంటే హీరో చవదొబ్బటం ఖాయం. ఇలాంటి సినిమాలు తెలుగులో బోలోడున్నాయి.

పురాణాలు, సినిమాల్లో క్లైమాక్స్ ఒకేలా ఉంటాయి. కానీ రాజకీయాల్లో మాత్రం ఇవి వేరే లెవల్లో ఉంటాయి. ప్రజాస్వామ్యంలో లేపేయడాలు అస్సలు కుదరవు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నించడం తప్ప. ప్రత్యర్థి బలం, బలహీనతలను తెలుసుకొని దెబ్బకొట్టాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే ప్రత్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తుంది. లేదంటే మానసికంగా కుంగదీయడమో.. లేదంటే ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ చేయడమో వంటి పనులు చేస్తుండటం కన్పిస్తూ ఉంటుంది. ఇప్పటి రాజకీయాలన్నీ ఇలాగే నడుస్తున్నాయి. దీనికి ఎవరు మినహాయింపు కాదులేండి?

గుమ్మడికాయ దొంగ అంటే భుజలు తడుముకున్నట్లు రాజకీయ నాయకుల తీరు ఉంటుందన్న విమర్శలున్నాయి. కొద్దిరోజులుగా ఏపీలో దేవతలు, రాక్షసుల మధ్య సంగ్రామం నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ వీరిలో దేవతలు ఎవరు? రాక్షసులు ఎవరనే చర్చ నడుస్తోంది. అధికార పార్టీలో ఉన్న నాయకులు దేవతల అవతారం ఎత్తితే.. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రాక్షసులుగా మారినట్లు ఫోకస్ చేస్తున్నారు. దేవతలు చేసే మంచి పనులన్నింటిని రాక్షసమూక అడ్డుకుంటుందంటున్నారు. ఏపీలో ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య ఈ మేరకు వార్ నడుస్తోంది. దానవులు, దేవతల మధ్య ఫైట్ ను ఆపేందుకు ఎవరు లేకపోవడంతో మధ్యలో సామన్య ప్రజలు నలిగిపోతున్నారన్న చర్చ సాగుతోంది. .

నవ్యాంధ్రలో తొలిసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. నాడు దేవతల పాత్రను టీడీపీ, రాక్షసుల పాత్రను వైసీపీ పోషించిందనే ఆపార్టీ నేతలు కలరింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటంతో దేవతల పాత్రను ఆపార్టీ నేతలు పోషిస్తున్నారు. ఇక రాక్షసుల పాత్రను యథావిధిగా టీడీపీ నేతలు పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ చేసే ప్రతీ అభివృద్ధి కార్యక్రమాలన్ని అడ్డుకోవడమే టీడీపీ పనిగా పెట్టుకుందంటున్నారు. దీంతో ఏపీలో అభివృద్ధి ముందుకు సాగడం లేదు. తమ హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు వైసీపీ చేస్తున్న పనులను టీడీపీ అడ్డుకుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధినేతల స్థాయి నుంచి కింది స్థాయి నేతల వరకు అందరు ఇలానే వ్యవహరిస్తున్నారు. ఎవరికీ వారు దేవతలు, రాక్షసులుగా విభజించుకొని రాజకీయాలు చేస్తున్నారు. దీంతో ఏపీలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందకుండా పోతున్నాయి. ఏ కోశాన కూడా ఈ రెండు పార్టీలు ప్రజల గురించి ఆలోచించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికీ వారు పైచేయి సాధించేందుకు కుయుక్తులు పన్నుతుండటంతో సామాన్య ప్రజలు మధ్యలో నలిగిపోతున్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని గానీ వీధుల్లోకి ఎక్కడం మంచిది కాదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇకనైనా ఏపీలో దేవదానవ సంగ్రామానికి ముంగింపు పలికి లోకకల్యాణానికి ప్రయత్నించాలని ప్రజలు కోరుతున్నారు.

Exit mobile version