Site icon NTV Telugu

టాప్‌ గేర్‌లో హుజురాబాద్‌ ప్రచారం!


హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి పీక్‌కి చేరింది. ఈ నెల 27తో ప్రచార పర్వానికి ఎండ్‌ కార్డు పడనుంది. ఎంత ప్రచారం చేసినా ఇంకో నాలుగు రోజులే. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన ప్రముఖులు నియోజకవర్గంలోని ఐదు మండలాలను సుడిగాలిలా చుట్టేస్తున్నారు. హుజూరాబాద్‌ పట్టణం మొదలుకుని మారుమూల పల్లెలల వరకు ..వీధి వీధిన ..గల్లీ గల్లీలో ప్రచార హోరు వినిపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్‌ షోలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రెండు చేతులు జోడించి గెలిపించమని అభ్యర్థిస్తున్నారు. ఉదయం ఏడింటికే నేతలు తమ పరివారంతో కలిసి ఇల్లిల్లూ తిరుగుతున్నారు.

ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన హస్తం పార్టీ ప్రచారాన్ని తీవ్రం చేసింది. రెండు అధికార పార్టీలపై వాడి వేడిగా ఆరోపణాస్ర్తాలు సంధిస్తోంది. మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాల వైఫల్యాలను సమర్థవంతంగా ప్రజలలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీ దొందూ దొందే అని ఓటర్లకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. మతం పేరుతో బీజేపీ దేశాన్ని విభజిస్తుంటే ..టీఆర్‌ఎస్‌ కులం పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్‌ని డమ్మీని చేసి మంత్రి హరీష్‌ రావు తానే అభ్యర్థి అయినట్టు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు..మోడీ సర్కార్‌ పేదల బ్యాంకు ఖాతాల్లో పదిహేను లక్షలు వేస్తానని వేయలేదని ఓటర్లకు గుర్తుచేస్తున్నారు. అలాగే పెట్రో ధరలను కూడా కాంగ్రెస్‌ పార్టీ తన ప్రచారంలో హైలైట్‌ చేస్తోంది. పెట్రో ధరలు…వంట గ్యాస్‌ ధరలు నాడు ఎలా ఉన్నాయి? నేడు ఎలా ఉన్నాయి? అని ఓటర్లను ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూర్‌ వెంకట్‌ నర్సింగ రావు యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువతే నా మతం ..నిరుద్యోగాన్ని పారదోలటమే నా లక్ష్యం ..నాకో అవకాశం ఇవ్వండి అంటూ యువజనులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు వేల నూటపదహార్ల ఆసరా ఫించన్లు కావాలో..నెలకు 40 వేల జీతం వచ్చే సర్కార్‌ కొలువులు కావాలో తేల్చుకోండంటూ నిర్ణయం వారికే వదిలేస్తున్నాడు. ఇక ఈటల మీదా వాక్భాణాలు వదులుతున్నారు కాంగ్రెస్‌ అభ్యర్థి. నియోజకవర్గం అభివృద్ధిని గాలికి వదిలేసి కోట్లు మూటగట్టుకున్నాడని.. అలాగే తనను తాను కాపాడుకునేందుకు వామపక్ష భావజాలాన్ని వదిలిపెట్టి బీజేపీ0లో చేరాడని ఎద్దేవా చేశాడు.

దళితబంధుపై చంద్రశేఖర్‌రావుకు చిత్తశుద్ధి లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. వారి అభ్యున్నతికి కెసిఆర్ నిజంగా కట్టుబడి ఉంటే దళితుడిని సిఎం చేస్తానన్న హామీని వెనక్కి తీసుకోడు. పేద ఎస్సీ కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పంపిణీని ఆపేవాడు కాదన్నారాయన.

మరోవైపు, బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు ఈటెల గెలుపుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి తొలిసారి శుక్రవారం ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ , దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ పలు గ్రామాలలో రోడ్‌ షో నిర్వహించారు.

ప్రచారం సందర్భంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. నియంతృత్వానికి, కుటుంబ రాజకీయాలకు చరమ గీతం పాడే అవకాశం హుజురాబాద్ ప్రజలకు వచ్చిందని .. దానిని వినియోగించుకోవాలని కిషన్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. అంతే కాదు ఆయన కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీకి అబద్ధాలు ఆడటమే తెలుసని, అబద్ధాలు పుట్టి ఆ తర్వాత వీళ్లు పుట్టారన్నారు. తాము దళితబంధును ఆపామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తాను సవాల్ చేస్తున్నానని, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలయ్యాక ఒకే రోజు దళిత బంధు ఇవ్వాలని అధికార పక్షానికి కిషన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. గతంలో ఒకే రోజు కుటుంబ సమగ్ర సర్వే చేసినట్లుగా ఒకే రోజు దళిత బంధు పథకం రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కిషన్ రెడ్డి విమర్శలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. నడిరోడ్డు మీద, పట్టపగలు నగ్నంగా అబద్దాలు ఆడుతూ ఆత్మవంచన చేసుకుంటూ, ప్రజలను వంచించి నాలుగు ఓట్లు పొందాలనుకోవడం దివాళా కోరు రాజకీయమని, తాను సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ అహంకారానికి , హుజూరాబాద్‌ ఓటర్ల గౌరవానికి మధ్య జరగుతున్న పోటీ అని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ప్రతి సభలో ఉద్ఘాటిస్తున్నారు. రాజేందర్‌ పేదల మనిషి.. అవసరంలో ఉన్నవారిని ఆదుకునే మనిషి.. కానీ కేసీఆర్‌ బలవంతులు..ధనవంతుల మనిషి. పేదవాళ్లు రాజేందర్‌ని గెలిపించకుండా ఇంకెవరిని గెలిపిస్తారంటూ బీజేపీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులలో చాలా వరకు కేంద్రం నుంచి వచ్చినవే అని బీజేపీ నేతలు వెళ్లిన ప్రతి చోటా పదే పదే ప్రజలకు వివరిస్తున్నారు.

ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎప్‌ పోరాట ఫలాలను అనుభవించి పార్టీ నుంచి వెళ్లిపోయాడని, ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదని తమ రోడ్‌ షోలలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు. మంత్రులు టి. హరీష్‌ రావు, గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ వినోద్‌ రావు, పి.కౌశిక్‌ రెడ్డి తదితరలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గం మూలమూలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. స్వార్థంతోనే ఈటల తన పదవికి రాజీనామా చేశాడే తప్ప ప్రజల కోసం కాదని మాజీఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఎన్నికల సభల్లో ప్రశ్నిస్తున్నారు. ఈటలది తన బాధే తప్ప ప్రజల బాధ కాదన్నారు.

మరోవైపు, హుజురాబాద్ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఈటల, రేవంత్ మధ్య సీక్రెట్‌ మీటింగ్‌ జరిగిందని బాంబు పేల్చారు. గోల్కొండ కోటలో వీరిద్దరు రహస్య మంతనాలు జరిపారని, దీనికి సంబంధించి తమ వద్ద ఆధారలు కూడా ఉన్నాయని ఓ టీవీ ఛానెల్ కు చెప్పారాయన. మరి ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాల్సివుంది.

Exit mobile version