Site icon NTV Telugu

Budget and Startups: కేంద్ర బడ్జెట్‌.. స్టార్టప్‌లకు ఏమిస్తుంది?

Budget And Startups

Budget And Startups

Budget and Startups: 2022వ సంవత్సరంలో ఇండియన్‌ స్టార్టప్‌ల వ్యవస్థ కొంచెం గాడి తప్పింది. నిధులు నిండుకోవటంతో తిరోగమనంలో పయనించింది. ఈ ఫండింగ్‌ సమస్య వల్ల స్టార్టప్‌లకు ఆశాజనకమైన పరిస్థితులు కరువయ్యాయి. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు డబ్బు ఇచ్చేందుకు ముందుకురాలేని ప్రతికూల పరిణామాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో మరో 10 రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌-2023.. ఇండియన్‌ స్టార్టప్‌లకు ఎలాంటి భరోసా ఇస్తుందోనని సంబంధిత వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇండియాలో స్టార్టప్స్‌ ఎకోసిస్టమ్‌ సక్సెస్‌ అవ్వాలంటే సర్కారు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎంట్రప్రెన్యూర్లకు మరియు వెంచర్‌ క్యాపిటలిస్టులకు ఆర్థికంగా స్థైర్యాన్నిచ్చే సానుకూల నిర్ణయాలు ప్రకటించాలని కోరుతున్నారు.

Flight Journeys: 2022లో 47 శాతం పెరిగిన ఫ్లైట్‌ జర్నీలు

రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఇండియన్‌ స్టార్టప్‌లు తమ ప్రధాన కార్యాలయాలను స్వదేశంలోనే కొనసాగించాలంటే IFSC.. GIFT.. తదితర సమస్యలను తీర్చాలని సూచిస్తున్నారు. మన దేశంలో సన్‌రైజ్‌ సెక్టార్‌గా అభివర్ణించే స్టార్టప్‌ల వ్యవస్థ తిరిగి పుంజుకోవాలంటే కేంద్రం ప్రోత్సాహకాల కింద మూలధన నిధులు మంజూరుచేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆశిస్తున్నారు. తాము.. గవర్నమెంట్‌ నుంచి రాయితీలు.. ఉచితాలు.. వంటివి కోరుకోవట్లేదని స్పష్టం చేశారు.

ఇండియన్‌ స్టార్టప్స్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌లో రాణించాలంటే నిబంధనల సరళీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. స్టాండర్డ్స్, గవర్నెన్స్, డూయింగ్ బిజినెస్, క్యాపిటల్ వంటివి ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే ఇండియాలో ఇంకా బెటర్‌గా లేదా కనీసం సమానంగానైనా ఉండాల్సిన అవసరముంది. ఇండియన్‌ స్టార్టప్స్‌ ఎకోసిస్టమ్‌ అంతర్జాతీయ స్థాయికి సమానంగా ఉంటే అప్పుడు మనం అందరితోనూ పోటీపడి ముందుకెళ్లగలం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓవర్సీస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పైన ఫోకస్‌ పెట్టింది.

దీన్ని మనం ఏవిధంగా అర్థంచేసుకోవాలి? విదేశీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటం పరోక్షంగా ఇండియన్‌ ఎంట్రప్రెన్యూర్ల ప్రయోజనాలను దెబ్బతీసినట్లు కాదా అనే దానిపై చర్చ జరగాలి. ఆర్‌బీఐ ఆలోచనా ధోరణి ఇండియన్‌ ఫండ్‌ మేనేజర్ల పట్ల ఏవిధంగా ఉందో దీన్నిబట్టి చెప్పొచ్చు. ఆర్‌బీఐ ఐడియాలజీ వల్ల భారదేశంలో పెట్టుబడిదారులు ఆర్థికంగా బలంగా ఉన్నట్లా? బలహీనంగా ఉన్నట్లా అనేదాంట్లో స్పష్టత రావట్లేదు. ప్రభుత్వం ప్రజలకు డైరెక్టుగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరంలేదు.

దేశంలో ఉత్పాదకతను పెంచితే చాలు. ఎకానమీ ఎంత స్పీడ్‌గా డెవలప్‌ అవుతుందనేదాన్ని బట్టి ఉపాధి అవకాశాలు ఆటోమేటిగ్గా అందుబాటులోకి వస్తాయి. గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటే ఆ మేరకు సెబీ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలి. స్టార్టప్‌లకు మరియు వెంచ్‌ క్యాపిటలిస్టులకు కొన్ని సమస్యలు ఉన్నాయనేది వాస్తవం.

ముందుగా వాటిని పరిష్కరించాలి. ఫండ్స్‌ విషయానికొస్తే.. ప్రభుత్వ సంస్థలతో పోల్చినప్పుడు.. ప్రైవేట్‌ కంపెనీల్లో ఈక్విటీ ఓనర్‌షిప్‌కు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. జీఎస్టీ, ఇన్‌కం అండ్‌ ట్యాక్స్‌ తదితర అంశాల్లో గవర్నమెంట్‌.. స్టార్టప్‌ల ఓనర్లతో డీల్‌ చేస్తున్న విధానం మారాలి. ప్రభుత్వ పాలసీల్లో పారదర్శకత, ముందుచూపు ఉంటే అభివృద్ధికి కావాల్సిన మూలధనం దానంతటదే ఈజీగా వస్తుంది.

స్టార్టప్‌ల యజమానులతో, వెంచర్‌ క్యాపిటలిస్టులతో ప్రభుత్వం సమావేశం పెట్టి ఈ రంగంలోని లోటుపాట్లపై లోతుగా చర్చించి పరిష్కరిస్తే ఇండియన్‌ స్టార్టప్స్‌ మళ్లీ పట్టాలెక్కుతాయనటంలో ఎలాంటి సందేహం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఫండ్‌ మేనేజర్లకు నేనున్నా అని భరోసా ఇస్తుందా? పడిపోతున్న స్టార్టప్‌లను నిలబడుతుందా అనేది కాలమే చెప్పాలి.

Exit mobile version