Site icon NTV Telugu

Viral Video: ఇది వంతెన కాదు.. జారుడుబండ

Viral Video

Viral Video

అది ఫ్లైఓవర్‌. కానీ ఆ ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ద్విచక్రవాహనదారులు సినీ ఫక్కీలో యాక్షన్ సన్నివేశాల్లో చూపించినట్లు ఒకరి వెంట ఒకరు జర్రుమని జారి కిందపడిపోతున్నారు. ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో బైక్‌పై వెళ్లేవాళ్లు జారిపడిపోతూ గాయాలపాలు అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వివరాలను గమనిస్తే ఈ ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కరాచీలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌పై ఓ లారీ నుంచి ఆయిల్ కారింది. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనదారులు ఒకరి వెంట ఒకరు జారిపడిపోతున్నారు.

అయితే కొందరు కావాలని ఈ ఘటన జరిగింది హైదరాబాద్‌లో అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. కొందరు హైదరాబాద్‌లోని షేక్‌పేట ఫ్లైఓవర్ అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇది పాకిస్థాన్‌కు చెందిన వీడియో అని.. తెలంగాణలోని హైదరాబాద్‌ నగరానికి చెందిన వీడియో కాదని అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్‌లు ఇది ఫ్లైఓవర్ కాదని జారుడు బండ అని ఫన్నీ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Exit mobile version