NTV Telugu Site icon

Viral Video: రోజూ రాత్రి 10 కి.మీ. పరుగెడుతున్న యువకుడు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

19 ఏళ్ల వయసులో సాధారణంగా ఎవరైనా కాలేజీ చదువుతో లేదంటే ఖాళీ దొరికితే స్నేహితులతో కలసి షికార్లు కొడుతుంటారు. కానీ 19 ఏళ్ల కుర్రాడు ప్రదీప్ మెహ్రా అలా కాదు. చిన్న వయసుకే బాధ్యతలు తెలిసినవాడు. ఉత్తరాఖండ్‌లోని పల్మోరాకు చెందిన ఈ బాలుడు నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్‌లో పనిచేస్తుంటాడు. పొద్దున వెళితే.. అర్ధరాత్రి వరకు డ్యూటీ. దీంతో రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన ఇంటి వరకు పరిగెడుతూ వెళ్లడం అతడి దినచర్యలో భాగం. అతడితో పాటు అతడి సోదరుడు, అమ్మ కలసి ఉంటున్నారు. ప్రస్తుతం ప్రదీప్ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఓ రోజు రాత్రి ఆ బాలుడు ఓ నిర్మాత దృష్టిలో పడ్డాడు. ‘ఎందుకు రాత్రి వేళ అలా పరుగెత్తుతున్నావు, నా కారులో రా దిగబెడతాను’ అంటూ ఫిలిం మేకర్ వినోద్ కాప్రి ఆఫర్ చేశాడు. అయినా ఆ బాలుడు కారు ఎక్కేందుకు నిరాకరించాడు. ఉదయం రన్నింగ్ చేయొచ్చుగా? అని ప్రశ్నించాడు. దాంతో అప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుందని, సమయం చాలదని ప్రదీప్ మెహ్రా బదులిచ్చాడు.

ఆర్మీలో చేరడమే తన ధ్యేయమని ప్రదీప్ స్పష్టం చేశాడు. అందుకోసమే నిత్యం సాధనలో భాగంగా రన్నింగ్ చేస్తున్నానని.. కారులో వస్తే తన సాధన గాడి తప్పుతుందన్నాడు. ప్రతి రోజు పొద్దున 8 గంటలకు లేవాలి. పనికి వెళ్లడానికి ముందు ఆహారం సిద్ధం చేసుకోవాలి. రాత్రి వచ్చిన తర్వాత కూడా ఆహారాన్ని వండుకుని తినడమే కాదు.. రాత్రి షిప్ట్ ఉద్యోగానికి వెళ్లిన సోదరుడి కోసం కూడా ఆహారాన్ని ప్రదీప్ సిద్ధం చేయాలి. ఇది అతడి దినచర్య. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రదీప్ ఇన్‌స్పైరింగ్ స్టోరీ పలువురిని కదిలిస్తోంది.

మరోవైపు ప్ర‌దీప్ మెహ్రాపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌దీప్ చిత్త‌శుద్ధిని కేటీఆర్ కొనియాడారు. అత‌డు అద్భుతం అని కేటీఆర్ ట్వీట్ చేశారు. నెటిజ‌న్లు కూడా ప్రదీప్ మెహ్రాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌దీప్ క‌ల సాకారం కావాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

https://ntvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Video-2022-03-21-at-3.11.23-PM.mp4