Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!

Kanpur Accident 300kb

Kanpur Accident 300kb

Kanpur Accident: ఒక ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి బయలుదేరిన డెలివరీ ఏజెంట్‌కు ఊహించని ప్రమాదం ఎదురైంది. చీకటిగా ఉన్న రోడ్డుపై బైక్‌తో వెళ్తున్న అతడు ఒక్కసారిగా రోడ్డుపై తెరిచి ఉన్న సీవర్ గొయ్యిలో పడిపోయాడు. కేవలం కొన్ని సెకన్లలోనే బైక్‌తో సహా రోడ్డుపై నుంచి కనిపించకుండా పోయాడు. ఈ భయంకర ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  కాన్పూర్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. డెలివరీ ఆర్డర్ పూర్తి చేసేందుకు వెళ్తున్న ఏజెంట్ చీకటిగా ఉన్న ప్రాంతంలో బైక్ నడుపుతూ వెళ్తున్నాడు. అదే సమయంలో రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద సీవర్ గొయ్యి అతడికి కనిపించలేదు. దీంతో బైక్ అదుపు తప్పి నేరుగా ఆ గొయ్యిలోకి దూసుకెళ్లింది. బైక్‌తో పాటు అతడు కూడా అందులో పడిపోవడంతో కొన్ని క్షణాల పాటు ఏం జరిగిందో అక్కడి వారికి కూడా అర్థం కాలేదు.

అయితే ప్రమాదం జరిగిన వెంటనే డెలివరీ ఏజెంట్ అరుపులు వినిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు కలిసి అతడిని గొయ్యిలో నుంచి బయటకు తీశారు. బైక్‌ను కూడా బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతడిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అతడిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. చీకటిగా ఉన్న రోడ్డుపై ఇంత పెద్ద గొయ్యి ఉండటం, దాని చుట్టూ ఎలాంటి బ్యారికేడ్లు లేదా హెచ్చరిక బోర్డులు లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. స్థానికుల సమాచారం ప్రకారం సీవర్ లైన్ పాడైన తర్వాత దాదాపు 15 రోజులుగా ఆ గొయ్యి అలాగే తెరిచి ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సరైన స్ట్రీట్ లైటింగ్ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో వాహనదారులకు గొయ్యి కనిపించే పరిస్థితి లేకపోవడంతో ప్రమాదం మరింత తీవ్రమైంది. ఈ ఘటన తర్వాత స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిని ఇన్ని రోజులుగా ఎందుకు అలాగే వదిలేశారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే తెరిచి ఉన్న సీవర్ గొయ్యిని మూసివేయాలని, రోడ్లపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ ఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

delivery agent on a bike landed in a massive pothole in the middle of a street in Kanpur, Uttar Pradesh. He was immediately rescued by onlookers. pic.twitter.com/4282w1JSl0