IndiGo Offer : దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో (InterGlobe Aviation) తమ 20వ ఏట అడుగుపెడుతున్న శుభసందర్భంగా ప్రయాణికులకు అదిరిపోయే కానుక ప్రకటించింది. ‘హ్యాపీ ఇండిగో డే’ పేరిట ఓ ప్రత్యేక ప్రమోషనల్ క్యాంపెయిన్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్ ద్వారా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఏకంగా 20,000 ఉచిత విమాన టికెట్లను ప్రయాణికులకు అందించాలని నిర్ణయించింది. ఎంపికైన లక్కీ విజేతలకు ఒక్కో PNR పై గరిష్ఠంగా రూ. 10,000 వరకు టికెట్ మొత్తాన్ని నేరుగా రీఫండ్ చేయనుంది.
ఆఫర్ వ్యవధి , అర్హతలు
ఆగస్ట్ 4 నుంచి ఆగస్ట్ 6 వరకు చేసే బుకింగ్‌లకు మాత్రమే ఈ సువర్ణ అవకాశం అందుబాటులో ఉంటుంది. ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా Skai ప్లాట్‌ఫామ్ ద్వారా దేశీయ విమాన టికెట్లు బుక్ చేసిన ప్రయాణికులు మాత్రమే ఈ క్యాంపెయిన్‌కు అర్హులుగా ఉంటారు. ఎకానమీ , స్ట్రెచ్ క్లాసుల్లో వన్‌వే, రౌండ్ ట్రిప్, కనెక్టింగ్ , మల్టీసిటీ బుకింగ్‌లకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. అయితే అంతర్జాతీయ విమాన బుకింగ్స్, కోడ్‌షేర్ విమానాలు, ట్రావెల్ ఏజెంట్లు లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తించదు. అలాగే ఒక మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీపై ఒకసారి మాత్రమే పాల్గొనే వెసులుబాటు ఉంటుంది.
ఉచిత టికెట్ పొందే విధానం
ఈ స్పెషల్ క్యాంపెయిన్‌లో భాగంగా నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి ర్యాండమ్ కంప్యూటర్ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల రిజిస్టర్డ్ ఈ-మెయిల్ లేదా వాట్సాప్‌కు ఇండిగో సంస్థకు సంబంధించిన ఒక ప్రశ్నను పంపుతారు. ఆ ప్రశ్నకు 48 గంటల్లోగా సరైన సమాధానం పంపాల్సి ఉంటుంది. దీనికోసం గరిష్ఠంగా 3 అవకాశాలు ఇస్తారు. సరైన సమాధానం చెప్పిన విజేతలకు వారు బుక్ చేసిన టికెట్ ఎయిర్‌ఫేర్‌తో పాటు పన్నులు కలిపి గరిష్ఠంగా రూ. 10,000 వరకు రీఫండ్ ఇస్తారు. ఈ మొత్తం వారు చెల్లించిన ఒరిజినల్ పేమెంట్ మోడ్‌కే 3 నుంచి 5 రోజుల్లో తిరిగి జమ అవుతుంది.
మూడు రోజుల్లో 20 వేల మందికి అవకాశం
ఈ మూడు రోజుల ఆఫర్ పీరియడ్‌లో మొత్తంగా 20 వేల మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆఫర్ తొలిరోజైన ఆగస్ట్ 4న ఏకంగా 10,000 మంది విజేతలను ఎంపిక చేయనుండగా, రెండు , మూడో రోజుల్లో రోజుకు 5,000 మంది చొప్పున ఎంపిక చేస్తారు. ముందస్తుగా లక్కీ డ్రాలో ఎంపికై, ఆ తర్వాత ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం ద్వారా ఈ ఉచిత టికెట్ పొందవచ్చు. విమాన ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారికి ఇది నిజంగా అదృష్టాన్ని పరీక్షించుకునే మంచి అవకాశమని చెప్పవచ్చు.

