Hospital staff made to go home half-naked for asking to take off shoes: డాక్టర్ ఛాంబర్‌లోకి వెళ్లే ముందు డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్‌ఎం) భార్య చెప్పులు తీయమని చెప్పడం వల్ల తన జీవితంలో దారుణమైన అవమానం ఎదురవుతుందని రైల్వే హాస్పిటల్ అటెండర్ ఎప్పుడూ అనుకుని ఉండరు. ఈ విషయంపై డీఆర్‌ఎం పగబట్టి అతని బట్టలు తీయించి అర్ధనగ్నంగా ఇంటికి వెళ్ళేలా చేశాడు. ఈ అవమానానికి కుంగిపోయిన సదరు అటెండర్ డిప్రెషన్‌లోకి వెళ్లి ఆసుపత్రి పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకుని జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్‌కు చెందిన రైల్వే ఆసుపత్రి ఉద్యోగులు వీరంగం సృష్టించారు. అంతే కాదు అవుట్ పేషెంట్ సేవలకు కూడా అంతరాయం కలిగించారు. తమ తోటి ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించడం పట్ల ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఆర్‌ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమ్మలో ఏడీఆర్‌ఎం ఆశిష్ ఝా ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
Car Accident : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు తప్పిన పెనుప్రమాదం..కానీ?
చెప్పులు తీయాలని
అసలు విషయం ఏంటంటే గురువారం డీఆర్‌ఎం భార్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో అటెండెంట్ బసంత్ ఉపాధ్యాయ్‌ను డాక్టర్ ఛాంబర్ బయట డ్యూటీలో ఉంచారు. DRM భార్య చెప్పులు ధరించి ఛాంబర్‌లోకి ప్రవేశిస్తోన్న సమయంలో దాన్ని గమనించి అటెండర్ బసంత్ ఉపాధ్యాయ్ ఆమెను ఆపి చెప్పులు తీయమని అభ్యర్థించాడు. ఆ తర్వాత ఆమె చెప్పులు విడిచి డాక్టర్‌ని కలవడానికి వెళ్లింది. డాక్టర్ వద్ద చికిత్స పొందిన అనంతరం తన భర్త అయిన డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లింది. వెంటనే డిఆర్‌ఎం కార్యాలయంకి బసంత్ ఉపాధ్యాయ్‌ను పిలిపించారు. ఆ సమయంలో డీఆర్‌ఎం కార్యాలయంలో బసంత్‌ను వేధించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆమెను చెప్పులు తీయమని చెప్పిన విషయం మీద ఆగ్రహించి అతడి బట్టలు కూడా విప్పేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తర్వాత బాధితుడు బసంత్ ఉపాధ్యాయ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని ఉద్యోగులు తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, చికిత్స కోసం రైల్వే ఆసుపత్రికి కూడా తీసుకురాగా, మెరుగైన వైద్యం కోసం డాక్టర్ మరో ఆసుపత్రికి రెఫర్ చేశారని తెలుస్తోంది. ఇక మరోవైపు ఘటనాస్థలికి చేరుకున్న ఏడీఆర్‌ఎం ఆశిష్ ఝా.. ప్రస్తుతం కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. అయితే రైల్వే ఆస్పత్రి ఓపీడీ సేవలను ఉద్యోగులు అడ్డుకున్నారు, వాటిని పునరుద్దరించే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి జరుగుతోంది.