Gorilla Viral Video : మనుషులకే హావభావాలు ప్రత్యేకమని అనుకుంటాం. మనిషి జంతువు నుంచి వచ్చినా కూడా తమని ప్రత్యేకంగా చూసుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక గొరిల్లా వీడియో ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తోంది. ఓ మూలన ఒంటరిగా కూర్చుని, దూరంగా చూస్తూ, ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయినట్టుగా కనిపిస్తున్న ఆ గొరిల్లా హావభావాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఆకట్టుకుంటున్నాయి. చాలామంది దాన్ని చూసి “ఇది మనమే కదా!” అంటూ స్పందించడం ఈ వీడియో ప్రత్యేకతగా మారింది.
ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న గొరిల్లా పేరు కియోమాసా. జపాన్‌లోని Higashiyama Zoo and Botanical Gardensలో నివసిస్తున్న 13 ఏళ్ల మగ వెస్ట్రన్ లోలాండ్ గొరిల్లా ఇది. 2012 నవంబర్ 1న జన్మించిన కియోమాసా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రసిద్ధ సిల్వర్‌బ్యాక్ గొరిల్లా Shabani కుమారుడు. షబానీ తన ఆకర్షణీయమైన రూపంతో ఒకప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారగా, ఇప్పుడు అతని కుమారుడు తన హావభావాలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాడు.
దాదాపు ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోలో కియోమాసా ఒంటరిగా కూర్చుని కనిపిస్తాడు. కుడి చేతిని శరీరంపై మడిచి, ఎడమ చేతిని నోటికి ఆనించి, దూరంగా చూస్తూ ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఈ భంగిమను చూసిన చాలామంది దాన్ని “తత్వవేత్తల ఆలోచనా భంగిమ”గా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా ఈ వీడియో తీసిన కొద్దిసేపటి ముందు తన తోటి గొరిల్లాతో కియోమాసాకు గొడవ జరిగినట్లు సమాచారం రావడంతో ఇది మరింత వైరల్ అయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కామెంట్ల వరద మొదలైంది. కొందరు “భార్యతో వాదన జరిగిన తర్వాత నేను కూడా ఇలాగే ఉంటాను” అని సరదాగా వ్యాఖ్యానించగా, మరికొందరు “నా భర్త నాతో గోడవపడి ఓడిపోయిన తర్వాత ఇలాగే పక్క గదిలోకి వెళ్లి కూర్చుంటాడు” అంటూ నవ్వులు పూయించారు. మరికొందరు మాత్రం కియోమాసా హావభావాల్లో మనుషుల ఎమోషన్స్ చూసినట్లు చెప్పుకొచ్చారు.
Famous gorilla Kiyomasa falls into deep contemplation after spat with mate — caught on camera in Japanese zoo pic.twitter.com/uZhzYhs5Am
— RT (@RT_com) June 9, 2026
నిజానికి జంతువుల ఎమోషన్స్ పై శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా గొరిల్లాలు, చింపాంజీలు, ఒరంగుటాన్‌లు వంటి ప్రైమేట్లు మనుషులకు అత్యంత దగ్గర బంధువులుగా పరిగణించబడతాయి. అందుకే వాటి ప్రవర్తనలో కొన్నిసార్లు మనల్ని మనం చూసుకునేలా ఉంటుంది. అయితే కియోమాసా నిజంగానే తన గొడవ గురించి ఆలోచిస్తున్నాడా, లేక కేవలం విశ్రాంతి తీసుకుంటున్నాడా అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. అయితే సోషల్ మీడియాలో ప్రపంచానికి ఆ వివరణ అవసరం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో చాలామంది తమ జీవితంలోని ఏదో ఒక క్షణాన్ని చూసుకున్నారు. ఒక వాదన తర్వాత మౌనంగా కూర్చుని ఆలోచించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అదే కారణంగా కియోమాసా ఇప్పుడు ఒక జంతుప్రదర్శనశాల గొరిల్లా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి “మనలో ఒకడిలా” అనిపించిన వైరల్ స్టార్ గా కూడా మారిపోయాడు.

