భార్య–భర్తల మధ్య చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద విభేదాలకు దారి తీస్తాయని మనం తరచూ వింటుంటాం. అయితే గుజరాత్‌లో ఉల్లి, వెల్లుల్లి వల్ల ఓ జంట విడిపోయింది. దీంతో 23 ఏళ్ల వైవాహిక బంధానికి చెక్ పడింది.
2002లో గుజరాత్ లోని ఓ జంట పెళ్లి చేసుకున్నారు. భార్య స్వామి నారాయణ భక్తురాలు కావడంతో..ఆమె ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని వంటల్లో వాడేది కాదు. మొదట్లో దీనిపై ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికి, కాలక్రమేణా భర్తకు ఆమె చేసిన వంటలపై అసహనం ఏర్పడింది. ఇద్దరి మధ్య వంట విషయంలో మొదలైన చిన్న గొడవలు రోజురోజుకూ పెద్దయ్యాయి. చివరకు ఇంట్లోనే రెండు పొయ్యులు పెట్టే పరిస్థితి వచ్చింది. వివాదాలు పెరిగిన కొద్దీ భార్య తన బిడ్డను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.
2013లో భర్త కోర్టు మెట్లెక్కాడు. తన భార్య ఆహార అలవాట్లపై మార్పు భార్య రాజీపడకపోవడం ‘క్రూరత్వం’ కింద వస్తుందని భర్త తెలిపాడు. భార్య కూడా ఎమాత్రం తగ్గలేదు. దీంతో ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం 2024లో విడాకులు మంజూరు చేసింది. మహిళ మాత్రం హైకోర్టును ఆశ్రయించింది. మతపరమైన ఆహార నియమాలను భర్త గౌరవించడంలేదని ఆమె తరపు లాయర్ తెలిపాడు. తనకు వేరుగా ఉల్లి, వెల్లుల్లి లేని వంటకాలు సిద్ధం చేసినా కూడా ఆమె వైఖరి మారలేదని భర్త తన ఆవేదనను వ్యక్తం చేశాడు.అనంతరం భార్య కూడా విడాకులను వ్యతిరేకించకపోవడంతో కోర్ట్ వెల్లడించింది. దీంతో కోర్ట్ ఇద్దరి విడాకులను ధృవీకరించి.. భార్యకు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది.
