Site icon NTV Telugu

Viral News: ఒంటి చేత్తో వరల్డ్ రికార్డ్ సాధించిన మహిళ

Anoushi Hussain World Record

Anoushi Hussain World Record

అంగవైకల్యం ఉన్న వారు తమలో ఉన్న లోపాన్ని చూస్తూ కుంగిపోతుంటారు. దేవుడెందుకు తమ పట్ల ఈ వివక్షత చూపాడంటూ ఆవేదన చెందుతుంటారు. సాధారణ మనుషుల్లా తాము చురుకుగా ఏ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోలేమని, అసలు బయటి ప్రపంచంతో పోటీ పడలేమంటూ మథనపడుతుంటారు. కానీ, కొందరు మాత్రం అలా ఆలోచించరు. తమలో ఎలాంటి లోపాలున్నా, అవేవీ పట్టించుకోకుండా సత్తా చాటుతుంటారు. తాము చేసే పనికి అంగవైకల్యం ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో అనౌషీ హుస్సేన్ ఒకరు.

లండన్‌కు చెందిన అనౌషీకి పుట్టుకతోనే కుడిచేయి మోచేతి భాగం వరకు లేదు. అయినా, తనకు సగం చేయి లేదని ఎప్పుడూ బాధ పడలేదు. అది తనకు లోపం కాకూడదని దృఢంగా నిర్ణయించుకొని, టీనేజ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌లో పట్టు సాధించింది. లక్సెంబర్గ్‌ నేషనల్‌ టీమ్‌లోనూ చోటు దక్కించుకుంది. అయితే.. వారసత్వంగా వచ్చే ఎహ్లర్స్‌ – డాన్లోస్‌ సిండ్రోమ్‌ (చర్మం, కీళ్లు, రక్తనాళాల గోడలపై ప్రభావం చూపుతుంది) అనే వ్యాధితో ఇబ్బందిపడటంతో, ఈమె కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికీ ఈమె కుంగిపోలేదు. ఆ తర్వాత కేన్సర్ బారిన పడిన భయపడలేదు. దాన్ని ధైర్యంగా ఎదుర్కొని, కేన్సర్ బారి నుంచి బయటపడింది.

కేన్సర్ నుంచి కోలుకుంటున్న సమయంలోనే అనౌషీ క్లైంబింగ్‌పై దృష్టి పెట్టింది. అందులో మెళకువలు నేర్చుకుంది. ఇప్పుడు ఆ విభాగంలోనే వరల్డ్ రికార్డ్ సాధించింది. కేవలం ఒక గంటలోనే 374 మీటర్ల క్లైంబింగ్ వాల్ ఎక్కి, ఔరా అనిపించింది. ఈ ఘనత సాధించిన ఏకైక మహిళగా.. గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించింది. ‘‘నా బలహీనతను అధిగమించేందుకు నేన సాధన చేస్తూ వచ్చా.. ఇప్పుడు అనుకున్నది సాధించా’’ అని అనౌషీ చెప్పుకొచ్చారు. మనోధైర్యం ఉంటే, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని అవరోధాల్ని అధిగమించవచ్చని అనౌషీ నిరూపించింది.

Exit mobile version