NTV Telugu Site icon

Solar E- Scooter: స్క్రాప్‌తో 7 సీటర్ సోలార్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ.. ఏకంగా 200 కి.మి రేంజ్!

Solar E Scooter

Solar E Scooter

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూసినప్పుడు మన ముఖాల్లో చిరునవ్వు వస్తుంది. కొన్నింటిలో ప్రజల సృజనాత్మకత మనల్ని అబ్బుర పరుస్తుంది. అదే వీడియోను ఓ సెలబ్రిటీ షేర్ చేస్తే.. ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తాజాగా అలాంటి ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. ఇందులో కొంతమంది పిల్లలు సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని తయారు చేశారు. ఈ టూ వీలర్‌లో ఒకేసారి 7 మంది ప్రయాణించవచ్చు.

అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో.. 7 మంది పిల్లలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై కూర్చుని కనిపిస్తున్నారు. ఓ వ్యక్తి వీళ్లను వీడియో తీశాడు. ఈ బైడ్‌ను నడుపుతున్న బాలుడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. “ఇది స్క్రాప్ పార్ట్స్ తో తయారు చేసిన సోలార్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని తయారు చేసేందుకు దాదాపు రూ. 8,000-10,000 ఖర్చు అయ్యింది. కస్టమ్-ఫిట్టెడ్ సోలార్ ప్యానెల్ సహాయంతో దీనిని రీఛార్జ్ చేస్తాం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 200 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది. సూర్యకాంతి ఎక్కువగా ఉంటే దాని రేంజ్ పెరుగుతుంది. సూర్య కాంతి ఉన్నంత వరకు ఇది నడుస్తూనే ఉంటుంది!” అని బాలుడు చెబుతాడు.

దీని డిజైన్ గురించి చెప్పాలంటే.. పూర్తిగా ఇనుమును ఉపయోగించారు. రైడర్‌తో పాటు వెనక కూర్చున్న వారికి హ్యాండిల్స్ ఉన్నాయి. ఈ హ్యాండిల్స్ 2 ప్రత్యేక భాగాలుగా ఉన్నాయి. ఈ మొత్తం బైక్‌ను 3 కంపార్ట్‌మెంట్లుగా విభజించారు. దీనిలో 2-2 మంది ప్రయాణీకులు సులభంగా కూర్చోవచ్చు. చిన్న పిల్లలు ఏడు మంది వరకు కూర్చునే అవకాశం ఉంది. ఈ బైక్ అడుగున ఒక పొడవైన స్ట్రిప్ ఉంది. ఇది ఫుట్ రెస్ట్ లాగా పనిచేస్తుంది. బైక్ వెనుక భాగంలో బ్యాక్ రెస్ట్ కూడా అందించారు. దాని మధ్యలో రెండు పైపులు ఏర్పాటు చేశారు. వాటి పైన ఒక పెద్ద సోలార్ ప్లేట్ఉంచారు. ఈ ప్లేట్ ద్వారా బైడ్‌కు ఛార్జింగ్ అందడమే కాకుండా.. ప్రయాణికులందరికీ ఎండ నుంచి రక్షణ అభిస్తుంది. దీనికి స్పీడోమీటర్, LED లైట్, బ్రేక్ ఉన్నాయి. వీడియోలో బైక్ వేగం కూడా అద్భుతంగా కనిపిస్తోంది.

అమితాబ్ బచ్చన్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడి అభిమానులతో సహా సోషల్ మీడియా వినియోగదారులందరూ పిల్లల ఈ వీడియోను ఇష్టపడుతున్నారు. కాగా.. ఈ 7 సీట్ల ద్విచక్ర వాహనం వీడియో చాలా పాతది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇంతకు ముందు చాలాసార్లు కనిపించింది. ఇప్పుడు మరోసారి వైరల్‌గా మారింది.