Rozgar Mela: క్రికెట్‌లో.. ‘‘అంపైర్ ఈజ్ ఆల్వేస్ రైట్’’ అంటుంటారు. అదే.. బిజినెస్ విషయానికొస్తే.. ‘‘కన్జ్యూమర్ ఈజ్ ఆల్వేస్ రైట్’’ అని చెబుతుంటారు. ఇప్పుడు.. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ‘‘సిటిజెన్ ఈజ్ ఆల్వేస్ రైట్’’ అని సరికొత్త పిలుపునిచ్చారు. అందుకే తమ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా సర్కారీ కొలువును ఒక ఉద్యోగంలాగా పేర్కొనదని, ప్రభుత్వ సేవగా, ప్రజా సేవగా పరిగణిస్తుందని మోడీ అన్నారు.
read more: Wipro Layoffs: పని బాగలేదంటూ.. 450 మందిపై వేటు..
10 లక్షల మందికి ఉద్యోగాలిచ్చేందుకు ప్రధాని మోడీ గతేడాది రోజ్‌గార్ మేళా అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. లేటెస్టుగా.. 71 వేల 426 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చారు. తమ ప్రభుత్వం.. ఉద్యోగాల నియామక ప్రక్రియలో సమూల మార్పులు తెచ్చిందని ప్రధాని మోడీ చెప్పారు.
సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను మరింతగా క్రమబద్ధీకరించామని, పారదర్శకతను, వేగాన్ని పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తున్నామని వివరించారు. అందువల్ల.. రోజ్‌గార్ మేళా.. తమ సర్కారుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాయని చెప్పారు. త్వరలో మరిన్ని రాష్ట్రాలు సైతం రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తాయని ప్రధాని వెల్లడించారు.
అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్నవారిని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. సిటిజన్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే ముఖ్యమైన సూత్రాన్ని పరిపాలనా వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదని సూచించారు. అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్నవారిలో ఎక్కువ మంది తమ కుటుంబంలో మొట్టమొదటి ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో పారదర్శకతను, స్పష్టతను తీసుకురావటం ద్వారా అభ్యర్థుల ప్రతిభకు, పోటీతత్వానికి పట్టం కట్టామని ప్రధాని తెలిపారు.
మౌలిక సదుపాయాల రంగంలోకి భారీగా పెట్టుబడులు రావటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధి అవకాశాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధాని మోడీ గుర్తుచేశారు. అభివృద్ధిలో వేగం పెరిగితే స్వయం ఉపాధి అవకాశాలు కూడా అంతే తొందరగా లభిస్తాయని చెప్పారు. రోజ్‌గార్ మేళా కార్యక్రమం గురించి ప్రధానమంత్రి కార్యాలయం గతంలో స్పందిస్తూ ఉపాధి కల్పనకు పెద్ద పీట వేయాలనే మోడీ సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలో ఇదొక గొప్ప ముందడుగని పేర్కొంది.
యువత సాధికారత సాధించేందుకు, దేశాభివృద్ధిలో పాల్గొనేందుకు కావాల్సిన అర్థవంతమైన అవకాశాలను అందించటంలో మరియు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనలో రోజ్‌గార్ మేళా.. ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని PMO అభిప్రాయపడింది. ఇదిలాఉండగా.. తాజాగా రిక్రూట్‌మెంట్ లెటర్లు అందుకున్నవారిలో పలు ప్రభుత్వ విభాగాలకు కేటాయించినవారు ఉన్నారు.
ఈ లిస్టులో.. జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, స్టెనోగ్రాఫర్స్, జూనియర్ అకౌంటెంట్లు, గ్రామీణ డాక్ సేవక్‌లు, ఇన్‌కంట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, టీచర్లు, నర్సులు, డాక్టర్లు, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్లు తదితరులు ఉన్నారు.