NTV Telugu Site icon

చెన్నైలో కిలో టమాటా@160..సామాన్యుడికి చుక్కలే..!

మొత్తానికి పెట్రోల్‌ ధరలను టమాటా దాటేసింది. ఇది సామాన్యుడి నిత్యావసరం. ఏదో ఒక రకంగా ఏ వంటకంలో అయినా టమాటా ఉండాల్సిందే. ఐతే ఇప్పుడు చాలా వాటిలో కనిపించట్లేదు. పప్పు చారు..సాంబారు మాత్రమే కాదు ఇడ్లీ చట్నీల్లో కూడా పత్తా లేదు. దేశంలో కూరగాయల ధరలకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో 20 రూపాయలున్న టమాటా ధర ఉన్నట్టుంది వంద దాటేసింది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో టమాటా ధరలు గత కొన్ని వారాలుగా చాలా వేగంగా పెరుగుతున్నాయి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటి ప్రధాన కూరగాయల ధరలు పెరిగాయి. ఐతే, వంట గదిలో అత్యంత ముఖ్యమైన టమాటా ధరలు ఊహించని స్థాయికి చేరాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో కిలో 100 రూపాయలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్ ప్రారంభంలో ఉన్న దేశ సగటు టమాటా ధర 54 రూపాయలకు దాదాపు ఇది రెట్టింపు.

ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ధరల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కూరగాయల ధరలు సగటున 40 శాతం పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం చెన్నైలో కిలో టమాటా 160 రూపాయలు పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో 130 రూపాయల వరకు ఉంది. ఇక కర్ణాటకలో 90-120 రూపాయల మధ్య ఉంది.

ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో టమాటా ధర ఒక్కసారిగా పెరిగి కిలో రూ.100కి చేరుకుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా ఇదే విధమైన పెరుగుదలను చూడొచ్చు. ఇక్కడ టమాటాల టోకు ధర కిలో రూ. 70కి చేరింది. రిటైల్ ధర 100 రూపాయల పైనే ఉంది. విపరీతమైన పెరుగుదల వల్ల టమాటా ధరలు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఇతర కూరగాయల ధరలు కూడా భారీగానే పెరిగాయి. బంగాళాదుంప ధర 10 నెలల గరిష్టానికి చేరగా ఉల్లి ధర తొమ్మిది నెలల గరిష్టాన్ని చేరింది. పెరిగిన డీజిల్ ధరలు, అకాల వర్షాల వల్ల పంట నష్టం కారణంగా సరఫరా లేదు. దాంతో ప్రధాన కూరగాయలైన టమాటా, ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇది ఇలావుంటే, టమాటా ధరల కట్టడికి తమిళనాడు ప్రభుత్వం చర్యలకు దిగింది. కిలో రూ.79కి అమ్మేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర మార్కెట్లలో కిలో టమాటా రూ. 130 నుంచి రూ. 150 వరకు పలుకుతోంది. ధరలు మరింత పెరగొచ్చన్న సంకేతాలతో మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. సహకారశాఖ పరిధిలోనా దుకాణాల ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఈ అమ్మకాలు చేపట్టింది.

గ్యాస్, ఇంధన అధిక ధరల కారణంగా వంటింటి బడ్జెట్‌ ఇప్పటికే పెరిగిపోయింది. ఇక టమాటా ధర పైపైకి వెళ్లటం కుటుంబాలను కుంగదీస్తోంది. వర్షం వల్ల పంట నష్టం జరగడం, డీజిల్ ధరలో పెరుగుదల, పైగా ఇది పెళ్లిళ్ల సీజన్‌ కవాటంతో డిమాండ్ పెరగడం, నిల్వ చేయటం వంటి కారణాలతో టమాటా ధరలు కూడా పెరిగాయి. అయితే, పరిస్థితిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగడంతో సంక్షోభం త్వరలో ముగుస్తుందని అమ్మకందారులు అంటున్నారు. త్వరలో కొత్త పంటల రాక ధరల తగ్గుదలకు దారితీస్తుందన్నది హోల్‌సేల్ మార్కెట్ల అంచనా.

దక్షిణాది రాష్ట్రాలలో భారీ వర్షాల వల్ల తీవ్ర పంట నష్టం వాటిల్లింది. దాంతో కూరగాయల సరఫరా కూడా పడిపోయింది. దీనికి తోడు రవాణా పరమైన ఇబ్బందులు, పెరిగిన పెట్రోల్ ధరలు వెరసి టమాటా చుక్కలు చూపిస్తోంది. హైదరాబాద్‌లో టమాటా ధర నెల క్రితం కిలో రూ.30 ఉండగా ఇప్పుడు రూ.100కు చేరింది. అటు ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ టమాట ధర రూ.100 దాటింది. వైఎస్సార్‌ కడప జిల్లాలో మార్కెటింగ్‌శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని సామాన్యులకు భారం కాకుండా టమాటాను బయటి ప్రాంతం నుంచి తెప్పించింది. కడప రైతు బజార్‌లో కిలో ధర రూ. 65 గా ఉంది.

గత ఆరు నెలల్లో చాలా కూరగాయల ధరలు ఆరు రెట్లు పెరిగాయి. గత ఏప్రిల్‌ లో తమిళనాడులోని చాలా చోట్ల, అలాగే కేరళ బార్డర్‌ ప్రాంతాల్లో కిలో టమాటా ధర 2 రూపాయాలు ఉండేది. కానీ ఇప్పుడు వంద దాటింది. ధరలు పెరగడంతో కస్టమర్లు ఎక్కువగా కొనలేకపోతున్నారు. రోజు కూలీలు 100 రూపాయలు పెట్టి టమాటాలు ఎలా కొనగలరు. ధరలు పెరగటం వల్లే తాము తక్కువగా కొంటున్నామని కస్టమర్లు ఒప్పుకుంటున్నారు. ఇందులో వ్యాపారుల తప్పేమీ లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధరలు విపరీతంగా పెరగటం వల్ల నెలవారీ బడ్జెట్ అస్తవ్యస్తంగా మారిందని మధ్యతరగతికి చెందిన కస్టమర్లు ఆవేదన చెందుతున్నారు. కూరగాయల ధరలతో పాటు రవాణా ఖర్చులు కూడా పెరగటంతో వారిపై అధిక భారం పడ్డట్టయింది. ప్రభుత్వం ధరల పెరుగదలకు చెక్‌ పెట్టాలి. కానీ ఆ పని చేయదని కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే నెలలో మార్కెట్‌కు కొత్త క్రాప్‌ వస్తే ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు కాస్త కిందకు దిగవచ్చు.

మరోవైపు, ఎడతెరిపి లేని వర్షాలు కర్ణాటకను అతలాకుతలం చేస్తున్నాయి.24 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. ఐదు లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంట నష్టం వాటిల్లింది. 30,114 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, తుంకూరు, కోలార్, చిక్బళ్లాపూర్, రామనగర్, హాసన్ జిల్లాల్లో వర్షాల వల్ల అపార నష్టం వాటిల్లింది. ఇది కూరగాయల ధరల పెరుగుదలకు దారితీసింది. పంట నష్టం కారణంగా, బెంగళూరులో కూరగాయల ధరలు దాదాపు 40 శాతం పెరిగాయి. టమాటా చిల్లర ధర 90 నుంచి 120 రూపాయలకు చేరింది. వంకాయ, క్యాబేజీ, బీన్స్ వంటి ఇతర కూరగాయల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.

వర్షాల వల్ల సమీప జిల్లాల నుంచి బెంగళూరుకు వచ్చే నిల్వలు లేకపోవడంతో చాలా కూరగాయల ధరలు పెరిగాయి. ఎప్పుడూ వచ్చే దానికంటే 10 శాతం నుంచి 20 శాతం తక్కువ స్టాక్ వస్తోంది. దాంతో టమాటా ధర కిలో 150 రూపాయలకి చేరింది. ఐతే, వెంటనే మహారాష్ట్ర నుంచి స్టాక్స్ రావడంతో ధర 100 -110 మధ్య పడిపోయింది. బీన్స్, క్యారెట్, ముల్లంగి వంటి ఇతర కూరగాయలు కూడా ఖరీదైనవిగా మారాయి.

కోలారు జిల్లాలో 10 వేల ఎకరాల్లో టమాట సాగవుతుండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చాలా వరకు పంట దెబ్బతిన్నది. పొలాల్లో టమాటాలు కుళ్లిపోతున్నాయి. కాపు బ్రహ్మాండంగా ఉన్న సమయంలో మాయదారి వాన వచ్చింది. మొక్కలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పండీ పండని దశలో ఉన్న పంట చెట్ల మీదే కుళ్లిపోయింది.

దెబ్బతిన్న 5 లక్షల హెక్టార్లలో 2.76 లక్షల హెక్టార్లలో రాగి పంట సాగవుతోంది. మొత్తం ప్రభావిత ప్రాంతంలో ఇది 55 శాతం. దక్షిణ కర్ణాటకలో రాగి ప్రధాన ఆహారం. ఖరీఫ్ సీజన్‌లో 6.88 లక్షల హెక్టార్లలో రాగులు సాగవగా వర్షం వల్ల 40 శాతం దెబ్బతింది.

మరోవైపు, పెరిగిన ట‌మాటా ధ‌ర‌లు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం ట్రెండవుతోంది. ట్విట్టర్‌లో ఎక్కడ చూసినా ట‌మాటా ధ‌ర‌ల‌పై స్పందనలే కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని నవ్వు పుట్టించేవిగా ఉంటే మ‌రికొన్ని ఆలోచింపచేసివిగా ఉన్నాయి. వీటితో పాటు నెటిజ‌న్లు ఫ‌న్నీ మీమ్స్‌తో సోష‌ల్ మీడియాను నింపేస్తున్నారు.

-Dr. Ramesh Babu Bhonagiri