అధినేత దృష్టిలో పడేందుకు కొత్త ఎత్తుగడ వేశారా? రాజ్యాంగ పదవిలో ఉన్నా.. విపక్ష పార్టీపై విమర్శలకు కారణం కూడా అందుకేనా? కల సాకారం చేసుకోవడానికి.. ఎక్స్‌టెన్షన్ పొందడానికి ఆయన ఎంచుకున్న మార్గం వర్కవుట్ అవుతుందా? ఇంతకీ ఎవరా పెద్దాయన? ఏమా కథ?
త్వరలో ముగియనున్న గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం!
గుత్తా సుఖేందర్‌రెడ్డి. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేత. ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఎంపీగా పనిచేశారు గుత్తా. మంత్రి కావాలన్నది ఆయన చిరకాల కోరికగా అనుచరులు చెబుతుంటారు. టీఆర్‌ఎస్‌లో చేరాక ఆ కోరిక తీరుతుందని ఆశించినా.. సామాజిక, రాజకీయ సమీకరణాల వల్ల గులాబీ బాస్ ఫ్రేమ్‌లో పట్టలేదు. అయినప్పటికీ కేబినెట్ హోదా కలిగిన రైతు సమన్వయ సమితికి అధ్యక్షుడిని చేశారు. కొన్నాళ్లు ఆ పదవిలో నెట్టుకొచ్చినా.. ఆయనలో అసంతృప్తి ఏదో ఒక మూల ఉండిపోయిందట. తర్వాత కాలంలో శాసన మండలి ఛైర్మన్ అయ్యారు. ఇది రాజ్యాంగ పదవి. ఇప్పుడేమో ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగిసే సమయం ఆసన్నమైంది. దీంతో కొత్త టెన్షన్ పట్టుకుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
జానారెడ్డి, కాంగ్రెస్‌లపై గుత్తా తీవ్ర విమర్శలు!
మంత్రి కావాలన్న కోరిక నెరవేరాలంటే ఎమ్మెల్యేగానో.. ఎమ్మెల్సీగానో ఉండాలి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్‌రెడ్డి కొనసాగుతున్నారు. పార్టీ అధిష్ఠానం కరుణించి మరోసారి ఎమ్మెల్సీని చేస్తే ఆశలు సజీవంగా ఉంటాయి. ఆ ఆశ సజీవంగా ఉండాలంటే కామ్‌గా ఉంటే కుదరదని భావించారో ఏమో.. ఈ మధ్య విమర్శలకు పదునుపెట్టారు. ఒకప్పుడు మిత్రుడిగా ఉన్న జానారెడ్డిపైన, కాంగ్రెస్ పార్టీపైనా ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మండలి ఛైర్మన్ హోదాలో ఉన్నా.. అధిష్ఠానం అటెన్షన్ కోసం కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారని అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు.
గుత్తాకే ఛాన్స్ ఉందని అనుచరులు లెక్కలు!
గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ ప్రాంతానికి చెందిన రాజకీయ నేత. ఇదే జిల్లాకు చెందిన శాసన మండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ పదవీకాలం సైతం త్వరలో ముగియబోతోంది. మరో ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. తేరా పదవీకాలం ఇంకా రెండేళ్ల వరకు ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత ఎమ్మెల్సీగా ఎక్స్‌టెన్షన్ పొందడానికి తనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంటున్నారట గుత్తా.
విమర్శలకు పదును అందుకేనా?
ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు నల్లగొండ జిల్లాకు చెందినవే కావడంతో గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎక్స్‌టెన్షన్ ఉంటుందని చర్చ జరుగుతోంది. కాకపోతే మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు సాగర్ ఉపఎన్నిక తర్వాత మరో లెక్క అన్నట్టు పరిస్థితులు మారిపోయినట్టు గుత్తా శిబిరం అభిప్రాయపడుతోందట. అందుకే విమర్శలకు పదును పెట్టారట. మరి.. కల సాకారం అయ్యేందుకు.. ఎమ్మెల్సీగా ఎక్స్‌టెన్షన్ పొందేందుకు గుత్తా ఇంకెలాంటి ఎత్తుగడలు వేస్తారో? అవి వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి.