NTV Telugu Site icon

ఆ ఎన్నికలకు జాతీయ నాయకులు వచ్చే అవకాశం ఉందా…?

  తెలంగాణలో బీజేపీకి మరో పరీక్ష ఎదురు కానుందా? అర్బన్‌ ప్రాంతాల్లో తమకు పట్టు ఉన్నట్టు చెప్పుకొనే కమలనాథులకు మినీ పురపోరు.. పెను సవాలేనా? ఆయా మున్సిపాలిటీలలో బీజేపీకి ఉన్న బలమేంటి.. బలహీనతలేంటి? లెట్స్‌ వాచ్‌!

2023కు ముందు జరిగే పెద్ద ఎన్నికలు మినీ పురపోరేనా?

తెలంగాణలో మినీ మున్సిపల్‌ ఎన్నికలకు తెరలేచింది. ఒకవైపు నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక కాకమీద ఉన్న సమయంలోనే రెండు మున్సిపల్‌ కార్పొరేషన్లు.. ఐదు మున్సిపాలిటీలలో ఎలక్షన్స్‌కు షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ నెల 30నే పోలింగ్‌. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరగబోతున్న  పెద్ద ఎన్నికలు ఇవే. కొన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. వాటికంటే ఇప్పుడు పోరు జరిగే ప్రాంతాలే కీలకం. ఖమ్మం, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో బీజేపీకి సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. గ్రేటర్‌ ఎన్నికల్లో పుంజుకున్న కమలనాథులు.. తమది వాపు కాదు అని నిరూపించుకోవాల్సిన  టైమ్‌ వచ్చింది. 

మినీ పురపోరు బీజేపీకి పెద్ద సవాలేనా?

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం.. అధికారంలోకి వచ్చేది తామే అని చెబుతున్న బీజేపీకి ఈ మినీ పురపోరు పెద్ద సవాల్‌. ఈ ఎన్నికల్లో చతికిల పడితే కోలుకోవడం కష్టం.. ఆ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఉంటుంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బీజేపీని కుంగదీశాయి. నాగార్జునసాగర్‌లో ఓటర్లు పార్టీకి ఏ మేరకు పట్టం కడతారో అంతుచిక్కడం లేదు. అయితే సాగర్‌ ఎన్నికల ఫలితాల కంటే ముందు పురపోరుకు నగారా మోగడం తమకు కలిసి వచ్చే అంశంగా కొందరు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.  సాగర్‌తో సంబంధం లేకుండా పోరాటం చేయడానికి ఒక అవకాశం దక్కిందని అనుకుంటున్నారట. 

వరంగల్‌ బాధ్యతలు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి అప్పగింత
మాజీ ఎమ్మెల్యే చింతలకు ఖమ్మం బాధ్యతలు 

వరంగల్‌  మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పార్టీ బలంగా ఉందని చెబుతున్నారు బీజేపీ నేతలు. ఖమ్మంలో ఇటీవల చేరికలు బాగా జరగడంతో అక్కడ కూడా పాజిటివ్‌ సంకేతాలు ఉన్నాయట. సిద్ధిపేట మున్సిపాలిటీలో పార్టీ కేడర్‌ ఉన్నా.. అచ్చెంపేట, నకిరేకల్‌లో బీజేపీ అంతంతమాత్రమే. జడ్చర్ల, కొత్తూరుల్లో కొద్దిగా ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారట. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇంఛార్జ్‌గా పనిచేసిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికే వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బాధ్యతలు అప్పగించారు. ఆయన కొంత కాలంగా అక్కడే ఉంటున్నారు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి ఇచ్చారు. 

ప్రచారానికి జాతీయ నాయకులు వచ్చే వీలు లేదా? 

ఖమ్మంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎక్కువ ఫోకస్‌ పెట్టే వీలు ఉందట. సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావును ఢీకొట్టడానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావును దించుతున్నారట. జడ్చర్ల, అచ్చంపేట్‌, కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పర్యవేక్షిస్తారట. పశ్చిమబెంగాల్‌లో హోరా హోరీ పోరు సాగుతుండటం.. అక్కడ పోలింగ్‌ పూర్తి కాకపోవడంతో బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రానికి ప్రచారానికి రాకపోవచ్చని భావిస్తున్నారు. కాకపోతే పట్టణ ప్రాంతాల్లో తమకు సానుకూల వాతావరణం ఉంటుందని చెప్పే కమలనాథులు ఇక్కడ ఏ మాత్రం సత్తా చాటుతారో చూడాలి.