NTV Telugu Site icon

సోనూసూద్ కు కరోనా పాజిటివ్

Sonu Sood tests positive for Covid-19

ప్రముఖ బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ ప్రకటించారు. ఈరోజు మార్నింగ్ కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, తాను ఆల్రెడీ క్వారంటైన్ లో ఉన్నానని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను అని సోషల్ మీడియాలో తెలిపారు సోనూసూద్. అంతేకాదు ‘మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు… దీనివల్ల మీ సమస్యలను తీర్చడానికి నాకు మరికొంత సమయం దొరుకుతుంది. గుర్తు పెట్టుకోండి. మీకోసం నేను ఉన్నాను’ అంటూ తనకు కరోనా సోకిందన్న విషయాన్ని వెల్లడించారు సోనూసూద్. అయితే ఇటీవల “సంజీవని” అనే కోవిడ్ టీకా డ్రైవ్‌ను ప్రారంభించిన సోనూసూద్… అందులో భాగంగా ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు కరోనా సోకడం గమనార్హం. ఇటీవలే పంజాబ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ను నియమించింది పంజాబ్ ప్రభుత్వం. ఆ సమయంలో పంజాబ్ ముఖ్యమంత్రిని కూడా కలిసాడు సోనూసూద్. కాగా కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు ఆయన చేసిన సాయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయన కష్టం అన్నవారికి కాదనకుండా ఆపన్నహస్తం అందిస్తున్నారు.