Site icon NTV Telugu

Ramadan: రంజాన్ ఉపవాసదీక్షలు ప్రారంభం

Ranzam

Ranzam

ముస్లింలకు పరమ పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం అయింది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో ముస్లింలలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ మాసం నేపథ్యంలో ఇప్పటికే మసీదులను అందంగా ముస్తాబు చేశారు. నెలవంక దర్శనమిచ్చిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి నమాజులు చేపట్టనున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. రంజాన్ నేపథ్యంలో, ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని సీఎం ఆకాంకింక్షారు. తెలంగాణకు ప్రత్యేకమైన “గంగజమునా తెహజీబ్ ” మరింతగా పరిఢవిల్లాలని, రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని సీఎం కేసిఆర్ అభిలాషించారు.

ఇటు ఏపీ సీఎం జగన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షలు ఆచరించబోతున్న ప్రతి ఒక్కరికీ అల్లా దయతో అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.

మరోవైపు నగరంలో హలీం సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే వివిధ హోటళ్ళ నిర్వాహకులు హలీం తయారీకి కట్టెల పొయ్యిలు తయారుచేసి సిద్ధంగా వుంచారు. రంజాన్ నెల ఆరంభం నుంచి ముస్లింలు 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపడతారు. వేకువ జామునే నాలుగు గంటలకు ఆహారం తీసుకుంటారు. దీన్నే సహర్ అంటారు. ఆతర్వాత సూర్యాస్తమయం అయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోరు.

సాయంత్రం ఉపవాసాన్ని విరమించడాన్ని ఇఫ్తార్‌గా పేర్కొంటారు. ఈ నెలలో ముస్లింలు జకాత్ రూపంలో పేదలకు దానాలు చేస్తారు. తెలంగాణలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఉద్యోగులకు మినహాయింపులు మంజూరు చేసింది. ఉద్యోగులు గంట ముందు.. సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే వెసులుబాటు కలిపించింది. రంజాన్ లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version