రైతన్నలారా ధాన్యం కొనుగోలుకు సర్కార్‌పై యుద్దానికి సిద్ధం కావాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. పోరాటం చేస్తే తప్ప సర్కార్ ఐకేపీ సెంటర్లు ప్రారంభించేలా లేదని స్పష్టంచేశారు. అలాగే వెంటనే ఐకేపీ సెంటర్లు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… రైతన్నలు ఏకం కావాలని కోరారు. నాగార్జున సాగర్ ఎన్నికలు ఉండడంతో ఓట్ల కోసం అసెంబ్లీలో ఐకేసీ సెంటర్లు ప్రారంభిస్తామని చెప్పిన సర్కార్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రైతన్నలు త్వరగా మేలుకోని.. సర్కార్‌పై యుద్దం ప్రకటించాలని కోరారు. పంటలు కోసి నెల రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఒక్క ఐకేపీ సెంటర్ ఎందుకు ప్రారంభించలేదని సర్కార్‌ను ప్రశ్నించారు. ఆరు నెలలుగా కష్టపడ్డ రైతన్న.. పంటను అమ్ముకోవడానికి ఐకేపీ కేంద్రాల వద్దకు తెచ్చి నెలరోజులుగా నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం పడిన అకాల వర్షానికి చాలా ధాన్యం తడిసిపోవడం… నీటిలో కొట్టుకుపోవడం జరిగిందని తెలిపారు. మళ్లీ ఒక అకాల వర్షం పడితే ఆ ధాన్యం పాడవుతుంది కాబట్టి మీరు వెంటనే చీఫ్ సెక్రెటరీ, సంబంధిత మంత్రికి చెప్పి ఐకేపీ సెంటర్ల ప్రారంభం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆరుకాలం కష్టించి రైతన్న పండించిన పంటను సర్కార్ ఇప్పటి వరకు ఎందుక కొనుగోలు చేయాలో తెలంగాణ రైతన్నకు మీరు సమాధానం చెప్పాలన్నారు. ఎండనక, వాననక రైతన్నలు పండించిన పంటలు కోసి నెల రోజులు కావాస్తున్న ఇప్పటీ వరకు ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించి..ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని వెల్లడించారు. అసలు రైతన్న సమస్యల పట్ల మీ సర్కార్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుంది. ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తుంది. తన ఒక్కో చెమట చుక్కను ఒక్కో గింజను పండించిన రైతన్న చేత మీ టీఆర్ఎస్ సర్కార్ కన్నీరు పెట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా 6వేల ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రతి ఒక్క రైతు నుంచి చివరి గింజ వరకు కొంటామని ప్రగాల్భాలు పలికిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నిమ్మకు నీరెత్తి వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ నోటిఫికేషన్‌కు ముందు రైతన్న గురించి పంట కొనుగోలు గురించి మాట్లాడిన మీరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. అంటే ఎన్నికల్లో లబ్ధి కోసమే మీరు ఐకేపీ సెంటర్ల గురించి ప్రకటన చేశారా.. అని ప్రశ్నించారు. మీకు రైతులంటే కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే కనిపిస్తున్నారా… సాగర్ ఉప ఎన్నికలు అయిపోవడంతోనే రైతులను పట్టించుకోవడం మానేశారని దుయ్యబట్టారు. ఇప్పటీకే పూట్టేడు కష్టాల్లో, అప్పుల్లో ఉన్న రైతన్న పండించిన పంటను మద్దతు ధరకు సర్కార్ కొనకపోతే ఎంతో దళారుల చేతిలో రైతన్నలు మోసపోవడం జరుగుతుందన్నారు.
ఢిల్లీ తరహా రైతాంగ యుద్దం మన రాష్ట్రంలో మొదలవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తికి ఉద్యమాలు చేయడం కొత్త కాదు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఐకేపీ సెంటర్లు ప్రారంభించి ధాన్యంను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతన్నలు అందరు ఏకమై సర్కార్ పై పోరాటం చేస్తారని తెలిపారు. రైతన్నలు చేసే ప్రతి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ, తను అండగా ఉంటామని స్పష్టం చేశారు.