Site icon NTV Telugu

కింగ్‌ ఆఫ్‌ ఫుడ్‌ హైదరాబాద్‌ బిర్యానీ!

తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అంటారు. కానీ ఇప్పుడు గారెల బదులు బిర్యానీ అనాలేమో. ఎందుకంటే అందరు మెచ్చిన వంటకంగా బిర్యానీ మారిపోయింది. అందునా మన హైదరాబాద్‌ బిర్యానీకి మరీ క్రేజ్‌. గల్లీ నుంచి ఢిల్లీ వరకు..టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు.. మహేశ్‌ నుంచి సల్మాన్ దాకా ..యాక్టర్లు క్రికెటర్లు అందరికి ఇష్టమైన వంటకం హైద్రాబాదీ బిర్యానీ. ఆర్డర్లలోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. నిమిషానికి 115 ఆర్డర్లలో టాప్ లో నిలిచింది. అందుకే ఫుడ్‌ ఇండస్ర్టీలో హైదరాబాద్ బిర్యానీని “కింగ్‌ ఆప్ ఫుడ్‌” అంటున్నారు.

ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ లేటెస్ట్‌ రిపోర్డ్ ప్రకారం హైద‌రాబాద్ నుంచి ఆర్డర్ చేసిన వంటకాల్లో చికెన్ బిర్యానీ ఫస్ట్‌ ప్లేస్‌ దక్కించుకుంది. దాని తరువాతే ఏదైనా. నిరుడు ప్రతి నిమిషానికి 90 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఈ ఏడాది అది 115 కి పెరిగింది. అంటే ప్రతి సెకనుకు దాదాపు రెండు బిర్యానీలు ఆర్డర్‌ చేశారు. వెజిటేరియన్‌ ఫుడ్‌ కంటే దాదాపు నాలుగున్నర రెట్లు ఎక్కువగా బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. 4 లక్షల 25 వేల మంది వినియోగదారులు తొలిసారి స్విగ్గీలో చికెన్ బిర్యానీ ఆర్డర్‌ చేసినట్టు వెల్లడైంది. చెన్నై, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌ ఫుడ్‌ ఆర్డర్లలో చికెన్ బిర్యానీయే టాప్‌.

గ‌త ఏడాది విడుద‌ల చేసిన నివేదిక‌లో కూడా బిర్యానీ టాప్ ప్లెస్ లో నిల‌బ‌డ‌గా ఈ ఏడాది కూడా మ‌ళ్లీ బిర్యానీ టాప్ ప్లెస్ లో మొద‌టి వ‌ర‌స‌లో ఉంది. దీంతో బిర్యానీని మ‌న వాళ్లే కాకుండా దేశ‌వ్యాప్తంగా ఎంత మంది ఇష్టప‌డుతున్నారో అర్ధమ‌వుతోంది.

బిర్యానీ రోజు చేసుకునే వంటకం కాదు. ప్రత్యేక రోజులలో మాత్రమే ఇళ్లలో దీనిని వండుతారు. ఐతే, ఇప్పుడు సర్వీస్‌ ఇండస్ర్టీ విస్తరించటంతో ఆన్‌లైన్‌ ఆర్డర్లకు డిమాండ్‌ పెరిగింది. దాంతో అన్ని రకాల వంటకాల అమ్మాకాలూ పెరిగాయి. మరీ ముఖ్యంగా మిలీనియం జనరేషన్‌, ఉద్యోగం చేసే జంటలు ఎక్కువగా ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్‌ మెనూలో వారిని ఎక్కువగా ఆకర్షిస్తున్న వంటకం బిర్యానీ. ఎందుకంటే అది ఎప్పుడైనా..ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి.

ఆర్డర్‌ చేసిన అరగంటలో వేడి వేడి బిర్యానీ మీ ముందు ఉంటుంది. ఆందుకే ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న చిన్న పల్లెల వరకు అందరూ మెచ్చిన ఆహారంగా బిర్యానీ మారిపోయింది. ఫలితంగా ఆహార పరిశ్రమలో దీని వాటా కూడా గణనీయంగా పెరిగింది. రెస్టారెంట్‌కు వెళ్లే వారిలో అత్యధికులు బిర్యానీనే కోరుకుంటున్నారు.

ఫిక్కి నివేదిక ప్రకారం బిర్యానీ డెలివరీ పరిశ్రమ ఏటా 2,500 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఇది రెండేళ్ల క్రితం నాటి లెక్క. అది ఇప్పుడు రెట్టింపు అయి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఫుడ్‌ ఇంటస్ట్రీ మొత్తం వ్యాపార విలువ దాదాపు ఆరు లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఏటా పది శాతం చొప్పున పెరుగుతోంది. రెస్టారెంట్‌ రంగంలో దాదాపు కోటి మంది పని చేస్తున్నారు. ఇది కేవలం హోటళ్లలో మాత్రమే. చిన్న చిన్న సెంటర్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ను పరిగణలోకి తీసుకుంటే దానికి కొన్ని రెట్ల వరకు ఉంటుంది.
హైదరాబాద్ నిస్సందేహంగా బిర్యానీ గడ్డ. హైదరాబాద్‌ బిర్యానీకి ఎక్కడైనా యమా డిమాండ్. ఏదైనా దీని తరువాతే. ఆన్‌లైన్‌ ఆర్డర్లలో కూడా హైదరాబాద్‌ బిర్యానీయే టాప్. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, పూణే తరువాత స్థానల్లో ఉంటాయి. యూపీ ప్రజలకు లక్నో బిర్యానీ అంటే ఇష్టం. కానీ హైదరాబాదీలు ఈ వంటంటే పడిచస్తారు. అలాగే కోల్‌కత్తాలో కూడా ఎక్కువ మంది బిర్యానీనే ఆర్డర్‌ చేస్తారు. అంతే కాదు మన నాటుకోడి కూరకు కూడా దేశ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉందని ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ ద్వారా తెలుస్తోంది.

ఒకప్పుడు చిన్న చిన్న టౌన్లు..పెద్ద గ్రామాలలో హోటళ్ల ముందు శాఖాహార హోటల్‌ .. బ్రాహ్మణ హోటల్‌..మిలటరీ హోటల్‌ అని బోర్డుల మీద రాసేవారు. కానీ ఇప్పుడు మనం వాటిని చూడాలన్నా ఎక్కడా కనిపించవు. అన్నీ చోట్ల స్సెషల్‌ బిర్యానీలే. అందుకే ప్రతి రోజు దానాతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది.

క్రమంగా ఈ వంటకానికి ఆదరణ పెరుగుతోంది.చిన్న చిన్న పట్టణాల్లో కూడా పెద్దపెద్ద బిర్యానీ సెంటర్లు వెలుస్తున్నాయి. వంద రూపాయలకు కూడా బిర్యానీ లభిస్తుండటంతో శాఖాహారం కన్నా మాంసాహారం వైపే జనం మొగ్గు చూపుతున్నారు. బిజినెస్‌ పెరగటం వల్ల వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఓ మోస్తరు హోటల్లో అయినా కనీసం 15 నుంచి 20 మంది పనిచేస్తారు. ఇక బిర్యానీ వండే వారికి బాగా డిమాండ్‌ ఉంది. రోజుకు వెయ్యి రూపాయలకు తక్కువ తీసుకోరు.

మరోవైపు, వినియోగదారులు కూడా బిర్యానీలో కొత్త రుచులు వెతుకుతున్నారు. అందుకే పెద్ద పెద్ద బిర్యానీ పాయింట్లు ఇతర రాష్ట్రాల నుంచి చేయి తిరిగిన వంట మాస్టర్లను రప్పిస్తున్నారు.దాంతో ప్రాంతాలకు అనుగుణంగా బిర్యానీ వంటకాన్ని మారుస్తున్నారు. రెస్టారెంట్లు తమ వ్యాపారం పెంచుకునేందుకు ప్రాంతీయ ఆహార అలవాట్లకు తగ్గట్టుగా ఈ పురాతన వంటకంపై ప్రయోగాలు చేస్తున్నాయి.

బిర్యానీకి రుచి మాత్రమే కాదు.. దానితో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బిర్యానీ తిన్నపుడు మనసుకు హాయిగా ఉంటుంది. పని చేయటానికి ఉత్సాహం వస్తుంది. అందులో వాడే వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, కుంకుమ, పసుపు, నల్ల మిరియాలు వంటి దినుసులు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచటంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఏదేమైనా, బిర్యానీని మితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిది.

మనల్ని ఇంతలా ఆకట్టుకుంటున్న బిర్యానీ మన దేశంలో పుట్టలేదంటే ఆశ్యర్యం కలుగుతుంది. ఇది పశ్చిమాసియా నుంచి దిగుమతి అయిన వంటకం. అయితే దీని పుట్టుకపై అనే కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంత మంది హైదరాబాద్ నిజాం కాలంలో తొలిసారి బిర్యానీ వంటకం చేశారనే కథ ఎక్కువగా ప్రచారంలో ఉంది. 1630 ప్రాంతంలో హైదరాబాద్‌ను మొఘలులు స్వాధీనం చేసుకున్నారు..అక్కడి నుంచి నిజాం పాలన మొదలైంది. దాంతో పాటు సాంప్రదాయ మొఘలాయి వంటకాలు..స్థానిక వంటకాలు మిక్స్‌ అయ్యాయి. ఆ క్రమంలో ఏర్పడినదే హైదరాబాదీ బిర్యానీ.

మొదటి నిజాం-ఉల్-ముల్క్ అసఫ్ జా -I వేటకు వెళ్లినపుడు ఆయన వంటమనిషి మొదటిసారి హైదరాబాదీ బిర్యానీ చేశాడని చెబుతారు. కొందరు దీనికి ఆరు వందల ఏళ్ల చరిత్ర ఉందని వాదిస్తారు. మరికొందరు టర్కీ నుంచి దిగుమతి అయ్యిందంటారు. ఒక పురాణగాథ ప్రకారం, మొఘల్ బాద్షా షాజహాన్ భార్య ముంతాజ్ తమ సైన్యానికి బలమైన ఆహారాన్ని అందించాలని ..పెద్ద మొత్తంలో సులభంగా వండేలా ఉండాలని వంటవాళ్లను ఆదేశించటంతో బిర్యానీ పుట్టింది. ఇక అరబ్ వ్యాపారులు దక్షిణ ఆసియా దేశాలకు వెళ్లినపుడు తమతో తీసుకు వెళ్లిన పులావ్‌ వంటకం నుంచి బిర్యానీ పుట్టిందని కూడా అంటారు.

నిజానికి, పులావ్‌ అనేది మధ్యయుగ భారతదేశంలో ఒక సైనిక వంటకం. అందుబాటులో ఉన్న మాంసంతో సైన్యానికి పులావ్‌ వండిపెట్టేవారు. ఐతే, పులావ్‌, బిర్యానీ మధ్య పెద్ద తేడా లేదు. రెండింటికీ ఒకే రకం మసాలాలు, బియ్యం, కూరగాయలు, మాంసం వాడతారు. అన్నిటిని ఒకే గిన్నె లో మగ్గించి నీళ్ళు పోసి వండేస్తే అది పలావు. బిర్యానీ ఐతే మాంసాన్ని మారినేట్ చెయ్యాలి. బియ్యం సగం ఉడికించుకోవాలి. రెంటినీ పొరలు పొరలు గా సర్ది గిన్నెను సన్న సెగ మీద, దమ్ పెట్టి నెమ్మదిగా తయారు చేయాలి. దించిన తరువాత చాలా సున్నితంగా కలపాలి.

ఐతే, ఇప్పుడు బిర్యానీల్లో అనేక వెరైటీలు వచ్చాయి.ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు నలబై రకాల బిర్యానీలు ఉన్నాయి. బర్మా, పశ్చిమాసియా, ఆఫ్గానిస్తాన్‌, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్‌, మారిషస్‌, ఫిలిపైన్స్‌, దక్షిణాఫ్రికా, థాయిలాండ్‌,టర్కీ వంటి దేశాలలో కూడా బిర్యానీ అలరిస్తోంది. ఎక్కడికి వెళ్లినా రెస్టారెంట్‌ మెనూలో హైదరాబాదీ బిర్యానీ ఉండాల్సిందే. అందుకే అది “కింగ్‌ ఆఫ్‌ ఫుడ్‌”.

Exit mobile version