పోలవరం ప్రాజెక్టు స్పీల్ వే మీదుగా 8, 60,042 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాఫర్ డ్యాం వద్ద 32. 80 మీటర్లుగ ఉంది గోదావరి వరదనీటి మట్టం. ఇక దేవీపట్నంలో గోదావరి ఉద్ధృతి కొనసాగుతుంది. దేవీపట్నం పోలీసు స్టేషన్, గండి పోచమ్మ ఆలయం నీట మునిగాయి. గండి పోచమ్మ అమ్మవారి ఆలయం గోపురాన్ని వరద నీరు తాకడంతో సమీపంలోని ఇళ్లుకూడా నీట మునిగాయి. దేవిపట్నం మండలాన్ని పోలవరం బ్యాక్ వాటర్ ముంచెత్తాయి. ఏజన్సీలో రహదార్లు పూర్తిగా జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఇక తొయ్యేరు, గుబ్బలపాలెం, దండంగి, పూడిపల్లి , వీరవరం, పెనికలపాడు, మంటూరు, మడిపల్లి, మూలపాడు, కచ్చులూరు, ఏనుగులగూడెం, గానుగుల గొంది గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరద ముంపులోనే కొండమొదలు, తాళ్లూరు, గోందూరు, తాలిపేరు గ్రామస్తులు ఉన్నారు. సహాయ పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు నిరాకరించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. గోదావరికి వరద పెరగడంతో ఆయా ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు… ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.