NTV Telugu Site icon

ఇన్నాళ్ళకు ‘ట్రిపుల్ ఆర్’పై ఆ ఇద్దరు!!

Rrr Wishes

Rrr Wishes

రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ జనం ముందు నిలచి దాదాపు నలభై రోజులు అవుతోంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజుల్లో డిఫరెంట్ టాక్ తోనే సాగింది. అయితే ట్రేడ్ పండిట్స్ మాత్రం ‘ట్రిపుల్ ఆర్’ ఈ యేడాది టాప్ గ్రాసర్ గా నిలుస్తుందని ముందే చెప్పారు. అదే జరుగుతోంది. ఈ యేడాది వెయ్యి కోట్లు చూసిన తొలి చిత్రంగా ‘ట్రిపుల్ ఆర్’ నిలచింది. ఇన్నాళ్ళకు ఈ సినిమాను చూసి ప్రముఖ హిందీ నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ అభినందించడం విశేషంగా మారింది.

అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ ఇద్దరికీ తెలుగు చిత్రసీమతో అనుబంధం ఉంది. బాపు రూపొందించిన ‘వంశవృక్షం’తోనే అనిల్ కపూర్ నటునిగా తన కెరీర్ ఆరంభించారు. ఇక అనుపమ్ ఖేర్ 1987లోనే వెంకటేశ్ హీరోగా నటించిన ‘త్రిమూర్తులు’లో డాన్ గా నటించారు. అలా తెలుగువారితో అనుబంధం ఉన్న ఈ ఇద్దరు బాలీవుడ్ యాక్టర్స్ మన రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ నూ ప్రశంసించారు. ఇటీవలే ‘ట్రిపుల్ ఆర్’ చూసిన ఇద్దరూ వేర్వేరుగా ఈ సినిమాను విజువల్ ఫీస్ట్ గా అభివర్ణించడం విశేషం! ‘ట్రిపుల్ ఆర్’లోని కథాంశం, నటీనటుల అభినయం, పాటలు, డాన్సులు, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ నచ్చాయని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. అనిల్ కపూర్ ఈ చిత్రాన్ని ‘వరల్డ్ క్లాస్ సినిమా’ అనీ అభివర్ణించారు. కొందరు బాలీవుడ్ బాబులు రాజమౌళి సినిమాలను తీవ్రంగా విమర్శిస్తున్న సమయంలో అనుభవజ్ఙులు, హిందీ చిత్రసీమలో ఎంతో పేరున్న అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ ‘ట్రిపుల్ ఆర్’ను ప్రశంసించడం గమనార్హం! కళలకు, కళాకారులకు హద్దులు లేవని, ప్రతిభ ఎక్కడ ఉన్నా ప్రశంసించవలసిందేనని ఈ ఇద్దరు నటులు చాటడం తెలుగువారికి ఆనందం కలిగిస్తోంది.