Site icon NTV Telugu

Tholi Ekadashi: రేపే తొలి ఏకాదశి.. తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి?

Tholi Ekadashi 2022 Min

Tholi Ekadashi 2022 Min

ఈ ఏడాది జూలై 10వ తేదీకి ఓ విశిష్టత ఉంది. ఆదివారం నాడు తొలి ఏకాదశి పండగ. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే శ్రీమహావిష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ ఏకాదశి తర్వాతి రోజు ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అని అంటారు. అయితే ఈ నాలుగు మాసాలలో మీరు శ్రీమహావిష్ణువును పూజించవచ్చు ,ఉపవాసం చేయవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. చాతుర్మాసం ప్రారంభంతో వివాహం, క్షవరం , గృహ ప్రవేశం వంటి మొదలైన పనులు నిలిచిపోతాయి.

Read Also: Health Tips: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులకు చెక్‌ పెట్టండిలా..!

తొలి ఏకాదశి పండగను హిందువులు పరమపవిత్రంగా భావిస్తారు. ఈ రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. అలాగే రాత్రిపూట జాగారం చేస్తారు. జాగారం సందర్భంగా సినిమాలు లాంటివి కాకుండా భాగవత పారాయణం, విష్ణుసహస్రనామం వంటివి పారాయణం చేస్తే మంచి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్లు ద్వాదశి రోజున దేవాలయానికి వెళ్లి ఉపవాసాన్ని విరమించాలి. ఏకాదశి పండగ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు, పండ్లు, చందనం, అక్షింతలు, తమలపాకులు, తులసి ఆకులు, పంచామృతం వంటి వాటిని దేవుడికి సమర్పించాలి. కాగా తొలి ఏకాదశి నాడు జొన్నలతో తయారుచేసిన పేలాల పిండిని తినాలి. ఎందుకంటే పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. తొలి ఏకాదశి వ్రతం చేసేవాళ్లు మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసిన పదార్ధాలు భుజించకూడదు. అలాగే మంచంపై పడుకోరాదు.

Exit mobile version