Nihilist Penguin: ప్రస్తుతం సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తే చాలామందికి ఒక విచిత్రమైన వీడియో కనిపించే ఉంటుంది. మంచుతో నిండిన అంటార్కిటికాలో కొన్ని పెంగ్విన్లు అన్నీ కలిసి సముద్రం వైపు వెళ్తుంటే.. ఒక్క పెంగ్విన్ ఒంటరిగా పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్లే వీడియో మీకూ తారసపడే ఉంటుంది. ఈ వీడియోని అందరూ “నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు. దాన్ని చూసిన చాలామందికి బాధగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ పెంగ్విన్ వెళ్తున్న దారి సేఫ్ కాదు. అక్కడ దానికి ఆహారం దొరకదు. చుట్టూ నిశ్శబ్దం, మంచు, ఖాళీ ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆ పెంగ్విన్ నడక నేరుగా మరణం వైపు నడక అన్నమాట. ఆ విషయం ఆ పెంగ్విన్‌కు తెలుసు. అయినా ఆ పెంగ్విన్ వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్లిపోతుంది. ఇదే దృశ్యం చాలా మందిని ఆలోచనలో పడేసింది. “ఏ జీవి అయినా బతకాలని ప్రయత్నించాలి కదా? మరి ఇది ఎందుకు చావాలనుకుంటోంది?” అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది.
READ MORE: గ్రిల్, టెయిల్ లైట్ల డిజైన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్.. 2026 చివర్లో Skoda Slavia Facelift లాంచ్
ఈ వీడియో కొత్తది కాదు. ఇది 2007లో వచ్చిన “ఎన్‌కౌంటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్” అనే డాక్యుమెంటరీ నుంచి తీసిన దృశ్యం. ఆ డాక్యుమెంటరీని వెర్నర్ హెర్జాగ్ అనే దర్శకుడు తీశారు. అప్పట్లో ఆయన పరిశోధకుడు డాక్టర్ ఐన్‌లీ కలిసి అంటార్కిటికాలో పెంగ్విన్ గుంపును గమనిస్తుంటే ఈ సంఘటనను చూశారు. మిగతా పెంగ్విన్లు అన్నీ సముద్రం వైపు ఆహారం కోసం కదులుతుంటే.. ఈ ఒక్క పెంగ్విన్ మాత్రం ఆగిపోయింది. కొద్ది సేపటికి వెనక్కి తిరిగి, దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండం మధ్యభాగం వైపు నడవడం మొదలుపెట్టింది. కొందరు వ్యక్తులు అది దారి తప్పిందేమో అని దాన్ని తీసుకొచ్చి గుంపులో కలిపినా.. అది మళ్లీ తిరిగి అక్కడికే వెళ్లిందట. అది ఏదో విషయంలో మోసపోయింది. జీవితంలో బాగా విసిగిపోయింది. అందుకే ఒంటరి దారిని ఎంచుకుందని కొందరు చెబుతున్నారు. కొందరు మాత్రం అది లవ్‌లో ఫేయిల్ అయ్యిందని అభిప్రాయపడుతున్నారు.
ఇంటర్నెట్ ఈ పెంగ్విన్‌కు “నిహిలిస్ట్ పెంగ్విన్” అనే పేరు పెట్టింది. ఈ రోజుల్లో జీవితం చాలా ఒత్తిడిగా మారిపోయిందని భావించే చాలామంది తమను తాము ఈ పెంగ్విన్‌లో చూసుకుంటున్నారు. పోటీ, బాధ్యతలు, అలసట ఇవన్నీ వదిలేసి “ఇక చాలు” అని అన్నట్టుగా ఆ పెంగ్విన్ ప్రవర్తన కనిపిస్తోంది. అందుకే ఇది ఒక మీమ్‌లా, ఒక భావోద్వేగానికి గుర్తులా మారిపోయింది. కానీ ఈ కథ కేవలం ఫన్నీ వీడియో లేదా బాధ కలిగించే దృశ్యం మాత్రమే కాదు. ఇది మన ఆలోచనలను కుదిపేసే విషయం. సాధారణంగా మనం జీవులన్నీ బతకడానికే పుట్టాయని అనుకుంటాం. కానీ మనుషుల విషయంలో మాత్రం అలా కాదు. “నిహిలిస్ట్” అనే మాట అసలు మనుషుల తత్వశాస్త్రం నుంచి వచ్చింది. ఈ పదం అర్థం జీవితానికి అర్థం లేదు.. లక్ష్యం లేదు అని భావించడమట.
ఆ పెంగ్విన్ నిజంగానే చనిపోయిందా?
అయితే ఆ పెంగ్విన్ నిజంగా చనిపోయిందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. వీడియో తర్వాత దాని పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు. కొన్ని సార్లు జంతువులు దారి తప్పుతాయి. వాతావరణం, కాంతి, నేల పరిస్థితులు వాటిని తప్పుదోవ పట్టించవచ్చు. మనుషుల్లా జంతువులు జీవిత అర్థం గురించి ఆలోచించవు. అవి సహజ ప్రవృత్తి, పరిసరాల ప్రభావంతోనే ప్రవర్తిస్తాయి. పరిశోధనల ప్రకారం.. పెంగ్విన్లకు మంచి దిశా జ్ఞానం ఉంటుంది. అవి సరైన దారుల్లోనే ప్రయాణిస్తుంటాయి. అయినా ఈ కథ మన హృదయాలను తాకడానికి కారణం మనుషుల జీవితాలను దాంతో పోల్చుకోవడమే. ఫ్రాయిడ్ చెప్పిన థానాటోస్ మనందరిలోనూ ఉంటుంది. ప్రతి ఉదయం లేచి, కష్టాల మధ్య పని చేస్తూ, ముందుకు సాగుతున్నాం.. మనలోనూ చాలా మందికి ఈ సమాజం నుంచి దూరంగా వెళ్లాలని ఉంటుంది. అందుకే ఆ స్టోరీ మనకు అన్వయించుకుంటున్నాం. ఆ పెంగ్విన్‌కు ఆలోచించే శక్తి లేదు. కానీ మనకు ఉంది. తీసుకునే ఏ నిర్ణయమైన నీ పరిస్థితులను బట్టి తీసుకోవాలి.
