రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప పోరు రసవత్తరంగా సాగింది. అయితే, తెలంగాణలోని హుజురాబాద్ తో పోలిస్తే ఏపీలోని బద్వేలులో అంతగా జనం ఆసక్తి చూపించలేదు. బద్వేల్ లో టీడీపీ, జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో పోటీ అంతగా కనిపించలేదు. అధికార వైసీపీ అభ్యర్ధిని పరిగణనలోకి తీసుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 9 శాతం తక్కువగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 76.37 శాతం నమోదు కాగా.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం 68.12గా నమోదైంది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టరు దాసరి సుధ, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మతో పాటు మరో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
పోలింగ్ ముగిసిన అనంతరం.. ఎన్నికల అధికారులు ఈవీఎంలను బద్వేల్ బాలయోగి గురుకుల పాఠశాలలో స్ట్రాంగ్ రూమ్‌కి తరలించారు. మంగళవారం ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ పోలింగ్ శాతం తగ్గడానికి వాతావరణ పరిస్థితులు కూడా ప్రధాన కారణం అంటున్నారు. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచి వర్షాలు పడుతుండటంతో ఓటర్లు చురుకుగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అట్లూరు మండలంలో సోమశిల బ్యాక్ వాటర్‌తో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుకుని మరీ కొందరు ఓటర్లు తమ ఓటేశారు.
బద్వేలు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292 కాగా… వారిలో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది, థర్డ్ జండర్ 22 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 77.64 శాతం పోలింగ్ శాతం నమోదైంది. అప్పుడు 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఈసారి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ పోటీలో వుండడంతో అధికార పార్టీ నేతలు ప్రచారం చేశారు. గెలుపు గ్యారంటీ కావడంతో అంతగా శ్రమించిన దాఖలాలు లేవు. చెదురుమదురు ఘటనలే నమోదయ్యాయి. వైసీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారితో దొంగ ఓట్లు వేయించారని బీజేపీ నేతలు ఆరోపించారు. టీడీపీ పోటీలో లేకున్నా బీజేపీకి సహకరించిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైయస్ జగన్ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అడుగుతామన్నారు. ప్రజాక్షేత్రంలో..ప్రజాతీర్పు కోరేందుకు టీడీపీ వెనుకడుగు వేస్తుందని విమర్శించారు. ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా విపక్షాలు పని చేస్తున్నాయని మండిపడ్డారు.
2019 బద్వేల్ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్యకి 44 వేల మెజారిటీ వచ్చింది. అదే మెజారిటీ ఉప ఎన్నికల్లో కూడా రావాలని సీఎం వైయస్ జగన్ నిశానిర్దేశం చేశారు. వారసత్వ రాజకీయాలు..మరొకటి అనుకున్నా కూడా..చనిపోయిన చోట ఆ కుటుంబ సభ్యులు పోటీలో ఉండటం సహజంగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి టీడీపీ, జనసేన పోటీ చేయలేదు. కానీ బీజేపీ, కాంగ్రెస్ బరిలో వుండడం, మరికొందరు ఇండిపెండెంట్లు పోటీచేయడంతో ఎన్నిక తప్పలేదు. తిరుపతి తరహాలోనే బద్వేల్ ఎన్నికల ప్రచారంలో సీయం జగన్ పాల్గొనలేదు. నియోజకవర్గ ఓటర్లకు జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయనేది హాట్ టాపిక్ అవుతోంది. రెండు జాతీయ పార్టీలకు డిపాజిట్లు దక్కుతాయా? పరువు నిలుస్తుందో చూడాలి.