Site icon NTV Telugu

‘మంగళవారం మరదలు’ అన్న మంత్రి నిరంజన్‌రెడ్డి… ఏకిపారేసిన వైఎస్ షర్మిల

నాగర్ కర్నూలులో బుధవారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలను ఉద్దేశించి ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు బయలుదేరింది’ అంటూ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. షర్మిల డిమాండ్ వెనుక ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆయన ఆరోపించారు.

Read Also: కేసీఆర్-జగన్‌లపై రేవంత్ ట్వీట్ వార్

అయితే తనను ఉద్దేశించి మంత్రి నిరంజన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చందమామను చూసి కుక్కలు మొరుగుతుంటాయని, అలాంటి కుక్కలను తరిమికొట్టే రోజు వస్తుందని షర్మిల కౌంటర్ ఇచ్చారు. కాగా షర్మిల ప్రస్తుతం ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటిస్తున్నారు. మరోవైపు మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల‌ని వైఎస్ఆర్ టీపీ పిలుపునిచ్చింది. పార్టీ క‌న్వీన‌ర్లు, కో -క‌న్వీన‌ర్లు, ద‌ళిత, మైనార్టీ, యువ‌జ‌న విభాగాల నాయ‌కులు వారి పరిధిలో మంత్రి నిరంజన్ రెడ్డి దిష్టిబొమ్మ‌ల‌ను ద‌హనం చేయ‌డంతో పాటు ధ‌ర్నాలు, రాస్తారోకోలు నిర్వ‌హించాలని సూచించింది.

Exit mobile version